భైంసా(ముధోల్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జాలువారే జలపాతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అందాల కశ్మీర్‌కు మన ఆదిలాబాద్‌కు చాలా విషయాల్లో సారుప్యత కనిపిస్తుందని సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ను తెలంగాణ కశ్మీర్‌గా సీఎం కేసీఆర్ చెబుతుంటారు. గతంలోనే కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఇటీవల సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో పర్యాటకంపై ప్రస్తావించారు. ఇరువురి ప్రకటనలతో ఒక్కసారిగా మళ్లీ పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశ ఉమ్మడి జిల్లా వాసుల్లో పెరిగింది.
పెరుగనున్న పర్యాటకుల తాకిడి
చదువుల తల్లి నిలయమైన బాసర నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ప్రత్యేక ప్రాంతాలు, జలపాతాలను సందర్శించేలా టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్క్యూట్ ఏర్పాటు చేయవచ్చు. సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక ఉమ్మడి జిల్లాలోని ఎన్నో విశేషాలను చూస్తూ ముందుకు వెళ్లవచ్చు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఉమ్మడి జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
కుంటాల జలపాతం...
నేరడిగొండ మండలం కుంటాల సమీపంలో 200 అడుగుల పైనుంచి కిందికి నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఈజలపాతం వద్ద ఇప్పటికే సినిమా షూటింగ్‌లు చిత్రీకరిస్తారు. సమీపంలోనే పొచ్చర జలపాతం ఉంది. వర్షాకాలంలో ఇక్కడ బండరాళ్లపైనుంచి 20 మీటర్ల లోతున నీళ్లు జారిపడుతుంటాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లేమార్గంలో వెలుగులోకి రాని వాస్తాపూర్ జలపాతం ఉంది. ఇచ్చోడ మండలం తర్నం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గాయిత్రి జలపాతం, జైనూర్ మండలం మెట్టగూడ అడవి ప్రాంతంలో సప్తగుండాల జలపాతం, బజార్‌హత్నూర్ మండలంలో కన్‌కయి జలపాతం, తాంసి మండలంలో గుంజాల జలపాతం ఉన్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలో కనువిందుచేసే దృశ్యాలు
ఆదిలాబాద్ నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి అక్కడి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అడవి బిడ్డల బతుకులు చూడవచ్చు. ఎన్నో కనువిందుచేసే దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలో నాగోబాను దర్శించుకోవచ్చు.
నిర్మల్‌లో...
బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక గోదావరి నది ఒడ్డున లోకేశ్వరం మండలంలో కాకతీయుల కాలంలో నిర్మించిన బ్రహ్మేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి లోకేశ్వరం మీదుగా కల్లూరు వెళ్లి అభినవ షిర్డీగా వర్నించే సాయిబాబా ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి దిలావర్‌పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నిర్మల్ వెళ్లి పొనికి కర్రతో తయారు చేసిన కొయ్యబొమ్మలు చూడవచ్చు. పట్టణానికి ఆనుకుని ఉన్న నిర్మల్ ఖిల్లాను చూడవచ్చు. అక్కడి నుంచి ఉత్తర తెలంగాన వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు.
మంచిర్యాల జిల్లాలో...
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలో శ్రీపాదసాగర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు ఉంది. ఇక్కడ ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఇదే ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ సున్నపురాళ్ల కోసం తవ్విన గుంతల్లో నీరు నిలిచి ఉంటుంది. హాజీపూర్ క్వారీ ప్రాంతానికి పర్యాటకులు వస్తుంటారు. సరస్సును తలపించేలా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేమార్గంలో ఇరువైపులా దట్టమైన చెట్లు ఆహ్లాదం పంచుతాయి. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా దండేపల్లి మండలంలో సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లవచ్చు. అక్కడి నుంచి వస్తుండగా కవ్వాల్ అభయారణ్యంలో పర్యాటకులకు అటవి జంతువులు, ఏపుగా పెరిగిన చెట్లు చూసే అవకాశం ఉంటుంది.
ఆదిలాబాద్‌లో...
నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే క్రమంలో మహబూబ్‌ఘాట్ ఎంతో అనుభూతినిస్తుంది. ఘాట్ పైకి ఎక్కిచూస్తే పచ్చని ప్రకృతిలో పాముచుట్టుకుని పడుకున్నట్లు బీటీ రోడ్డు కనిపిస్తుంది. నిర్మల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్‌ఘాట్ ఉంది. రోడ్డు పక్కన కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించి వాచ్‌టవర్‌లు ఏర్పాటుచేస్తే పర్యాటకుల తాకిడి పె రుగుతుంది. జైనథ్‌లో పురాతన లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఏటా నవంబర్‌లో ఉదయం స్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు పడుతుంటాయి.
బోటింగ్‌పై ఆశలు
సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత మళ్లీ ఎస్సారెస్పీలో బోటింగ్‌పై ఆశలు పెరిగాయి. గతంలో ఎస్సారెస్పీ వద్ద పునరుజ్జీవ సభలోనూ సీఎం కేసీఆర్ పోచంపాడ్ నుంచి బాసర వరకు 60 కిలోమీటర్ల మేర బోటింగ్ ప్రారంభించి సినిమా షూటింగ్‌లకు అవసరమయ్యేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. డిసెంబర్ 6, 2019న అధికారులు ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు ట్రయల్‌రన్ సై తం పూర్తి చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్‌లో ప్రారంభమయ్యే గోదావరి నది ప్రవాహం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తుంది. ఈ నది పొడవు 1465 కిలోమీటర్లు. ఉమ్మడి జిల్లాలో బాసర నుంచి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం రాంపూర్ వరకు 258 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తుంది. నది ఒడ్డున బాసర, బ్రహ్మేశ్వర్, సోన్, పొన్కల్, గూడెంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈమేర బోటింగ్‌పై దృష్టిసారిస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
ఆహ్లాదం పంచుతున్న కవ్వాల్ అభయారణ్యం
ఇక కవ్వాల్ నుంచి తిరుగు ప్రయాణంలో మళ్లీ కడెంకు చేరుకోవచ్చు. కడెం అందాలు కనువిందు చేస్తాయి. కడెం ప్రాజెక్టులో ఇప్పటికే బోటింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేశారు. అధికసంఖ్యలో వచ్చే పర్యాటకుల కోసం వసతి కల్పించాలి. పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేసేలా టూరిజం సర్క్యూట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి.
‘పర్యాటకరంగం అభివృద్ధిలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తాం. శాసన సభ్యులంతా తమ పరిధిలోని విశేషస్థలాలు, దేవాలయాల సమాచారాన్ని పర్యాటక మంత్రికి ప్రతిపాదనలు అందించాలి. చారిత్రక నేపథ్యం ఉన్నవాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. ప్రధాన టూరిజం స్పాట్లతో కలుపుతూ సర్క్యూట్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. వచ్చిన వినతులపై రాష్ట్రస్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది’
– ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలు, అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలకు కొదువలేదు. చాలామంది దగ్గరున్న అందాలను వదిలేసి ఎన్నో వ్యయ ప్రయాసలతో విదేశాలకు వెళ్తున్నారు. సరైన ప్రచారం, మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ధోరణి మారాలి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఈరంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా.
– కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment