'ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలి'
► తెలుగు భాష వైతాళికులను మరవకండి
► బే-ఏరియా సభలో యార్లగడ్డ విజ్ఞప్తి
శాన్ ఫ్రాన్సిస్కొ: తెలుగు భాష అభ్యున్నతికి బాటలు వేసి, తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేసిన వైతాళికులను మరిచిపోకుండా గుర్తుంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శుక్రవారం బే-ఏరియాలోని రాయల్ ప్యాలెస్ సమావేశ మందిరంలో తానా, బాటా, మన-పాఠశాల సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ మాతృభాషకు సేవ చేసిన వారి గృహాలు, వాడిన వస్తువులను పదిలపరిచి వాటిని ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాయని.. కానీ మనదేశంలో ఇలా జరగకపోవటం దారుణమని యార్లగడ్డ ఆవేదన చెందారు. భాషాభివృద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో త్యాగధనులను సరైన రీతిలో గౌరవించుకొవడానికి ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా 1875 నుండి 2000 కాలం మధ్య తెలుగు భాష ప్రేమికులుగా, వైతాళికులుగా వెలుగొందిన 40మంది తెలుగువారి జాబితాను సభకు విడుదల చేశారు. ప్రతి ప్రవాసుడు తమ జేబులో నుంచి కేవలం 10డాలర్లు విరాళంగా అందిస్తే అటు మహానుభావులకు గౌరవమే కాకుండా భావితరాలకు ఓ అమూల్యమైన బహుమానం అందించిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని యార్లగడ్డ తెలిపారు. ఈ విధంగా పర్యాటక ప్రదేశాలుగా మారిన ఆయా గృహాలను సందర్శించే పర్యాటకులతో గ్రామాల అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన వెల్లడించారు. ఈ పిలుపుకు స్పందించిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి.. కృష్ణా జిల్లా బెజవాడలోని "కవిసామ్రాట్" విశ్వనాథ సత్యానరాయణ నివాస గృహ పరిరక్షణకు రూ.10లక్షలు ప్రకటించారు. ఈ సొమ్మును ఖర్చు చేసే బాధ్యతను అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పర్యవేక్షిస్తారని లకిరెడ్డి వెల్లడించారు.
శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో డాక్టరేట్లు, గ్రాడ్యుయేట్లు అందుకున్న తెలుగువారు ఇక్కడ అమెరికన్ల ఆదరాభిమానాలు చూరగొనటమే గాక భారతదేశంలో కూడా కథానాయకులుగా గౌరవం పొందడం సంతోషించదగ్గ విషయమన్నారు. 10వతరగతి కూడా పూర్తి చేయని సినీహీరోల కోసం కులాలు, ప్రాంతాల పేరిట దెబ్బలాడుకోవడం హాస్యాస్పదంగా ఉందని యార్లగడ్డ తెలిపారు. అనంతరం యార్లగడ్డను నిర్వాహకుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోమటి జయరాం, వేమూరు సతీష్, తోట రాం, నందిపాటి హేమారావు, ఆసూరి విజయ, కుదరవల్లి యశ్వంత్, కోగంటి వెంకట్, తానా, బాటా, మనపాఠశాల సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.