మన పిల్లల తలరాతలో తెలుగు రాత లేదా? | Telugu Language Day on the occasion of August 29, ... | Sakshi
Sakshi News home page

మన పిల్లల తలరాతలో తెలుగు రాత లేదా?

Published Sat, Aug 27 2016 10:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

మన పిల్లల తలరాతలో తెలుగు రాత లేదా? - Sakshi

మన పిల్లల తలరాతలో తెలుగు రాత లేదా?

కవర్ స్టోరీ
ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా...

 
 
దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన తెలుగువాడు కాదు. మాతృభాష తుళు. అయినా తెలుగును ఎంతగానో ప్రోత్సహించాడు. తన ఆస్థానంలో అష్టదిగ్గజాలను పోషించి ఆంధ్రభోజుడిగా ఖ్యాతిగాంచాడు. అంతేనా? తానే స్వయంగా ‘ఆముక్త మాల్యద’ కావ్యాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు ఉజ్వలంగా వెలిగింది. తర్వాత కొన్ని శతాబ్దాలకు దేశంలో బ్రిటిష్ పాలన మొదలైంది. దేశంలో ఇంగ్లిష్ ప్రభావం పెరిగింది. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెనుమార్పులే వచ్చిపడ్డాయి. అలాంటి గడ్డు కాలంలో కూడా తెలుగు భాష మనుగడకు ముప్పేమీ ఏర్పడలేదు. ఇప్పుడిక తెలుగు భాషకు ప్రాచీన హోదాను కూడా సాధించేసుకున్నాం. ఏముందిలే! ఇక తెలుగు దివ్యంగా వెలిగిపోతుందనే భరోసా మాత్రం కనిపించడం లేదు.


పరిస్థితులను గమనిస్తుంటే తెలుగు వెలుగులు కొడిగట్టేసే కాలం దాపురిస్తోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు భాష అభివృద్ధికి ఒరగబెడుతున్నదేమీ కనిపించడం లేదు. రకరకాల కుంటి సాకులతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతుంటే, విత్తాపేక్షతో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును తోసిరాజని ఇంగ్లిష్ చదువులు రాజ్యమేలుతున్నాయి. తెలుగు రాత మన పిల్లల నుదిటిరాత కాలేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
 
 ప్రాచీన నేపథ్యం
 రాజరాజ నరేంద్రుడి ఆస్థానకవి నన్నయ పదకొండో శతాబ్దిలో ఆంధ్ర మహాభారత రచనకు పూనుకున్నా, అప్పటికి శతాబ్దాల ముందు నుంచే తెలుగు భాష, ఛందస్సు, సాహిత్యం ఉనికిలో ఉండేది. భట్టిప్రోలు వద్ద లభించిన క్రీస్తుపూర్వం 400-100 సంవత్సరాల నాటి శాసనాల్లో తెలుగు పదాలు కనిపించాయి. నన్నయ కంటే ముందే తెలుగులో పద్యరచన జరిగిందనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాశి గ్రామ శివార్లలో శిథిలావస్థలో ఉన్న శిలాశాసనంపై సీసపద్యం నన్నయ కాలానికి మునుపటిదేనని పరిశోధకులు చెబుతున్నారు. కన్నడ ఆదికవి పంపన తెలుగులోనూ కవిత్వం రాశాడు. నన్నయకు మునుపటి వాడైన పంపన తెలంగాణలోని వేములవాడ ప్రాంతానికి చెందినవాడేనని తెలంగాణ ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు ఆధారాలు సమర్పించింది. నన్నయ తర్వాత తిక్కన, ఎర్రనలు వేర్వేరు కాలాల్లో ఆంధ్ర మహాభారత రచనలో పాలు పంచుకున్నారు. పాల్కురికి సోమనాథుడు జాను తెలుగులో కావ్యరచన చేశాడు. తర్వాతి కాలంలో శ్రీనాథుడు కవిసార్వభౌముడిగా వెలుగొందితే, పోతన భాగవతాన్ని తెలుగుజాతికి కానుకగా అందించాడు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయల కాలం తెలుగు భాషా సాహిత్యాలకు స్వర్ణయుగమే. ఆయన ఆస్థానంలో ఆశ్రయం పొందిన అష్టదిగ్గజ కవులు రచించిన ప్రబంధాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.
 
 ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్

 తెలుగు అజంత భాష. పాశ్చాత్య ప్రపంచంలో ఇటాలియన్ కూడా అజంత భాషే. విజయనగర సామ్రాజ్య కాలంలోనే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటి అజంత పదాలతో కూడిన తెలుగు భాష సొగసుకు అబ్బురపడ్డాడు. ఆయన తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’గా అభివర్ణించాడు. తెలుగు ఘనతను చెప్పుకోవడానికి చాలామంది ఇప్పటికీ నికోలో మాటలను ఉటంకిస్తూ ఉంటారు. తొలినాళ్లలో తెలుగుపై సంస్కృత, ప్రాకృతాలు మినహా ఇతర భాషల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. పద్యరచన పరిఢవిల్లిన కాలం అది. ఎందరో కవులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. శతకాలు రాశారు. అన్నమాచార్యుడు, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు సంకీర్తనలను, పదాలను రాశారు. వారు సృష్టించిన సాహిత్యమంతా తెలుగువారి జాతి సంపద.
 
సుల్తానుల పాలనలో...
తుగ్లక్ వంశీయుల కాలం నుంచి తెలుగునేలపై సుల్తానుల ప్రభావం పడింది. 14వ శతాబ్దిలో తుగ్లక్ హయాంలో దక్కను పీఠభూమిలోని ఉత్తర ప్రాంతం సుల్తానుల పాలన కిందకు వచ్చింది. మొఘల్ వంశీయుల హయాంలో 17వ శతాబ్ది నాటికి దక్షిణాదిన సుల్తానుల ప్రాబల్యం మరింత విస్తరించింది. సుల్తానుల హయాంలో తెలుగు భాష అరబ్బీ, పారశీ భాషల ప్రభావానికి లోనైంది. హైదరాబాద్‌లో అసఫ్ జాహీ వంశీయుల పాలన 1724 నుంచి మొదలవడంతో తెలుగుపై అరబ్బీ, పారశీ భాషల ప్రభావం మరింత పెరిగింది. క్రమంగా ఉర్దూ వాడుక కూడా పెరిగింది. సుల్తానుల పరిపాలన కొనసాగిన తెలుగు ప్రాంతాల్లో విలక్షణ మాండలికాలు ఏర్పడ్డాయి. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. అయినా అప్పట్లో సైతం తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు సాహిత్యం బలంగానే వెలువడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి వారు ఈ ప్రాంతంలో తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికి, తెలుగు గ్రంథాలయాల స్థాపనకు చిరస్మరణీయమైన కృషి చేశారు.
 
బ్రిటిష్ పాలనలో...
బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రభావం పెరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. నిజాంల హయాంలోని హైదరాబాద్ ప్రాంతం మినహా మిగిలిన తెలుగు ప్రాంతమంతా మద్రాసు ప్రావిన్స్ పరిధిలోకి చేరింది. ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో తెలుగు సాహిత్యం ఆధునికతను సంతరించుకుంది. అప్పట్లోనే పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక వంటి రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు వంటివారు ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. తెలుగు భాషను పామరులకు చేరువ చేయాలనే సంకల్పంతో గిడుగు వెంకటరామమూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమానికి నాంది పలికారు. గిడుగు వారి ప్రభావంతోనే గురజాడ తన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వాడుక భాషలో రాశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకం ఒక మైలురాయి. తర్వాతి రచయితల్లో చాలామంది గురజాడ అడుగుజాడలనే అనుసరించారు. ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో పద్యరచన మాత్రమే ప్రధానంగా ఉండేది. బ్రిటిష్ పాలన మొదలయ్యాక పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో తెలుగు సాహిత్యంలోనూ కొత్త కొత్త ప్రక్రియలు మొదలయ్యాయి. కథానిక, నవల వంటి ఆధునిక ప్రక్రియలు అప్పట్లో మొదలైనవే. ఇక గిడుగు వారి శిష్యుడైన తాపీ ధర్మారావు పత్రికా రచనలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇంగ్లిష్ చదువుల ప్రభావం గణనీయంగానే ఉన్నా, తెలుగు భాషా సాహిత్యాలకు పెద్ద ఇబ్బందులేవీ కలగలేదు. పైగా ఆ కాలంలో కొందరు కవులు విరివిగా పద్య కావ్యాలను విరచించారు. ఇంకొందరు కవులు అష్టావధానాలు, శతావధానాలు వంటి సాహితీ విన్యాసాలతో తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు.
 
తెలుగు భాషా సేవకుడు బ్రౌన్

బ్రిటిష్ రాజ్యంలో తెలుగు ప్రాంతాల్లో పనిచేసిన బ్రిటిష్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాడు. మరుగునపడ్డ వేమన పద్యాలను, పలు ప్రాచీన కావ్యాల లిఖిత ప్రతులను వెలికితీసి, వాటిని పండితుల చేత పరిష్కరింపజేశాడు. పండితులకు తన సొంత డబ్బుతోనే ఆయన జీతాలు చెల్లించేవాడు. రాజమండ్రి, మచిలీపట్నం, కడప ప్రాంతాల్లో పనిచేసిన బ్రౌన్ తెలుగు విద్యావ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డాడు. తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువును రూపొందించాడు. రిటైర్మెంట్ తర్వాత బ్రిటన్‌కు వెళ్లిన బ్రౌన్ కొంతకాలం లండన్ వర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
 
 ప్రాచీన హోదాకు తెలంగాణ కృషి
 తెలుగు భాషకు ప్రాచీన హోదాలపై తలెత్తిన చట్టపరమైన చిక్కులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో కృషి చేసింది. మద్రాసు హైకోర్టుకు తగిన ఆధారాలను సమర్పించడంతో పాటు తన వాదనలను బలంగా వినిపించింది. ఇదే వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం ఉదాసీనతను ప్రదర్శించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని ముందుకు తీసుకుపోయేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కనీసం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమైనా ప్రయత్నించడంతో తీర్పు అనుకూలంగా వచ్చింది.
 
 స్వాతంత్య్రం వచ్చాక...
 స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు సాహిత్యంపై శ్రీశ్రీ చెరగని ముద్రవేశారు. ‘ఈ యుగం నాది’ అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహితీ జగత్తును ఓ కుదుపు కుదిపింది. నిజానికి ఆయన ‘మహాప్రస్థానం’ స్వాతంత్య్రానికి ముందే రాసినా, స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకు పుస్తకరూపంలో వెలువడింది. శ్రీశ్రీ కవిత్వంతో తెలుగు సాహిత్యంలో సామ్యవాద భావజాలం ఒక ప్రధాన స్రవంతిగా అవతరించింది. అంతేకాదు, శ్రీశ్రీ ప్రభావంతో తెలుగు కవిత్వంపై ఛందోబంధాల పట్టు సడలింది. మరోవైపు విశ్వనాథ సత్యనారాయణ వివిధ సాహితీ ప్రక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ‘రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి రచనలు చేసిన విశ్వనాథ జ్ఞానపీఠ అవార్డును అందుకున్న తొలి తెలుగు రచయితగా ఖ్యాతి పొందారు. ఆయన తర్వాత డాక్టర్ సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ ఈ అవార్డును పొందారు. విశ్వనాథ వారికి సమకాలికుడైన గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో దళిత వాణిని వినిపించారు. అప్పట్లోనే చలం స్త్రీల పక్షాన నిలిచి చేసిన రచనలు ఓ కుదుపు కుదిపాయి. స్వాతంత్య్రానంతర కాలంలో వివిధ భావజాలాలు, సిద్ధాంతాల ప్రభావంతో వివిధ ప్రక్రియల్లో విరివిగా వెలువడిన సాహిత్యం తెలుగు భాషను మరింత సుసంపన్నం చేసింది. గ్రాంథిక భాష నుంచి వ్యావహారానికి మళ్లిన సాహిత్యం అక్కడికే పరిమితం కాకుండా ప్రాంతీయ మాండలికాలకూ విస్తరించింది. అత్యాధునిక కాలంలో సైతం తెలుగు సాహిత్యంలో అవధాన కళ ఇంకా కొనసాగుతూ ఉండటం విశేషం. మరోవైపు దిగంబర కవిత్వం తెలుగు సాహిత్యంలో కొన్నాళ్లు కలకలం రేపింది. ఇక అభ్యుదయవాదం, విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదం వంటి అస్తిత్వవాదాలు కూడా తెలుగు సాహిత్యంపై తమదైన ముద్ర వేశాయి.
 
 
చదువుల్లో సన్నగిల్లిన ప్రోత్సాహం
 
భాషాపరమైన అస్తిత్వం కోసమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత నిజాం అధీనంలోని ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు చదువుల్లో ప్రోత్సాహమే సన్నగిల్లింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాభవం కొనసాగిన కొద్ది దశాబ్దాల కాలం మాత్రమే చదువుల్లో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం లభించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఊరూరా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకు రావడం మొదలైనప్పటి నుంచి చదువుల్లో తెలుగు భాషకు గడ్డుకాలం దాపురించింది. ఇంగ్లిష్ మీడియం చదువులు అనివార్యమనే దుస్థితి వాటిల్లింది. పట్టుమని పది తెలుగు పద్యాలు నోటికొచ్చిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తెలుగు నేల మీద తెలుగు చదువుకోకుండానే ఉన్నత చదువులకు ఎగబాకగల సౌలభ్యం అందుబాటులోకి వచ్చాక ఉన్నత, మధ్యతరగతి వర్గాల్లో తెలుగుపై తృణీకార భావం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి దుస్థితి ఉంటే, ఇక సరిహద్దు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటోందో ఊహించుకోవాల్సిందే! ఇలాంటి గడ్డుకాలంలో తెలుగు భాషకు ప్రాచీనహోదా దక్కడం కొంత ఊరట. అయితే, తెలుగు భాష పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యమస్ఫూర్తితో చర్యలు చేపట్టక తప్పదు. ప్రాచీన హోదా దక్కింది కదా అని సంబరపడిపోయి, అంతటితో సరిపెట్టేసుకుంటే తెలుగు భాష మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తడానికి ఎంతోకాలం పట్టదు. మన పిల్లల తలరాతలో తెలుగురాత చెరిగిపోకుండా ఉండాలంటే అందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికైనా మెలకువ తెచ్చుకుని చిత్తశుద్ధితో తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలి. ఇందుకు తమ తమ స్థానిక భాషలపై శ్రద్ధ చూపుతున్న పొరుగు రాష్ట్రాల విధానాల నుంచి స్ఫూర్తి పొందాలి. తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో అక్కడి స్థానిక భాషలను నేర్చుకోవడం తప్పనిసరి. త్రిభాషా సూత్రంలో భాగంగా ఏ స్థాయి విద్యార్థులైన అక్కడి స్థానిక భాషలను నేర్చుకోవడం ఆ రాష్ట్రాలలో తప్పనిసరి.
 
 ప్రాచీనహోదాకు వైఎస్ కృషి

 మన దేశంలో ప్రాచీన హోదా లభించిన భాషలు ఇప్పటికి నాలుగే ఉన్నాయి. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ భాషలకు మాత్రమే ప్రాచీన హోదా దక్కింది. ఉత్తరాది భాషల్లో దేనికీ ఈ హోదా దక్కకపోవడం గమనార్హం. మన దేశంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. హిందీ, బెంగాలీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలుగువారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై లేరు. మన దేశంలోని పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాలలో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగానే ఉంది. క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉనికిలో ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలనే డిమాండు ఎప్పటి నుంచో ఉన్నా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ దిశగా గణనీయమైన కృషి జరిగింది. వైఎస్ హయాంలో ఎంతో చరిత్ర కలిగిన తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ శాసనసభలోను, శాసనమండలిలోనూ తీర్మానాలను ఆమోదించారు. ఈ రెండు తీర్మానాలనూ వైఎస్ స్వయంగా ప్రతిపాదించారు. తెలుగుకు ప్రాచీన హోదా సాధించడం కోసం ఆయన ఢిల్లీ స్థాయిలోనూ చర్చలు జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement