కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు బాష పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా సిలికానంధ్ర నిర్వహిస్తున్న 'మనబడి' స్నాతకోత్సవం ఆదివారం శాన్‌హూసేలోని పార్క్‌సైడ్ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనబడి విద్యార్థులకు వారు పట్టాలు ప్రదానం చేశారు. అమెరికా, కెనడా, హాంకాంగ్ మొదలైన దేశాల్లోని 1019 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారు.
ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. మనబడి నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయమైందని చెప్పారు. తెలుగుభాష భవిష్యత్ గొప్పగా ఉండబోతోందని ఆయన అన్నారు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంతా అంటారని, కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలుపెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రశంసించారు. 150 మందితో మొదలుపెట్టిన నేడు ఆరువేల మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ విద్యావ్యవస్థను నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులను కొనియాడారు.
2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్థులకు తెలుగుభాషపై గల అంకితభావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007 లో ప్రారంభమైన 'మనబడి' ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు.
మనబడి పదికి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250కి పైగా శాఖలతో వందకు పైగా భాషా సైనికులతో భాషా ఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని మనబడి అధ్యక్షులు రాజు చామర్తి తెలిపారు. ఈ ఏడాది ఆరువేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి ముందుకు కొనసాగుతోందని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు అన్నారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి వై. రెడ్డి శ్యామల, ప్రజాసంబంధాల అధికారి జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీరాం కోట్నీ, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాషకు అద్భుత భవిష్యత్తు
Published Wed, May 25 2016 6:48 PM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM
Advertisement
Advertisement