మౌనంగా ఎదిగిన మహావృక్షం | may 7th Rabindranath Tagore 125th birth anniversary celebrations | Sakshi
Sakshi News home page

మౌనంగా ఎదిగిన మహావృక్షం

Published Sun, May 3 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

మౌనంగా ఎదిగిన మహావృక్షం

మౌనంగా ఎదిగిన మహావృక్షం

సందర్భం : 7న టాగోర్ జయంతి
ఈ నెల 7 నుంచి రవీంద్రనాథ్ టాగోర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రపంచం ఈ విశ్వకవికి వివిధ కార్యక్రమాల ద్వారా ఘనమైన నివాళి ఇవ్వబోతోంది. పైగా ఇది టాగోర్ ‘నైట్‌హుడ్’ పొందిన శత సంవత్సరం కూడా. 1915లో బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జి ఈ టైటిల్‌ను టాగోర్‌కి ప్రదానం చేశారు. ఆ తర్వాత ఆయన నైట్‌హుడ్‌ను తిరిగి ఇచ్చేయడం వేరే సందర్భం.
 
‘కనస్యూర్’ అనే ఇంగ్లిష్ మాటకు ‘రసహృదయ ప్రావీణ్యుడు’ అని అర్థం. ఈ మాట కూడా అర్థం కాని వాళ్లు ‘రవీంద్రనాథ్ టాగోర్’ అని అర్థం చెప్పుకోవచ్చు. సాహిత్యం, సంగీతం, చిత్రకళల రుచి, శుచి తెలిసిన మనిషి టాగోర్. ‘జనగణమన’కు  జాతీయగీతంగా అంత ప్రాముఖ్యం వచ్చింది టాగోర్ కవితాప్రావీణ్యం వల్లనే. మనదే కాదు, బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా టాగోర్ రాసిందే. శ్రీలంక జాతీయగీతానికి సైతం మూలకణాలు టాగోర్ రచనలోనివే! ఆయన కనస్యూర్ మాత్రమే కాదు. ‘పాలీమేథ్’ కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశీలి.
 
‘రబీ’ ఒంటరి పిల్లవాడు
రవీంద్రనాథ్ టాగోర్ 1891 మే 7న కలకత్తాలో జన్మించారు. అన్నలు, అక్కలు కలిపి ఆయన తలపై ఉన్నవారు మొత్తం 13 మంది. ఇక చూడండి ఆ ‘బాసిజం’ ఎలా ఉంటుందో! సంప్రదాయ బాసిజం అన్నమాట! బాగా సంపన్న కుటుంబం. ప్రతి అన్నకీ, అక్కకీ ఏదో ఒక టాలెంట్ ఉంటేది. నాటకాలు రాసేవారు, కవితలు వినిపించేవారు, బ్రిటిష్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు... ఇలా! పెద్దపెద్ద సంగీతకారులు, సాహితీవేత్తలూ నిర్విరామంగా ఆ ఇంటికి వచ్చిపోతుండేవారు. చిన్నప్పుడు చూడాలి ‘రబీ’ (రవీంద్రనాథ్ టాగోర్) దాక్కుని దాక్కుని తిరిగేవారు.

అమ్మ పోయాక రబీ మరీమౌనంగా అయిపోయాడు. ఒంటరిగా ఉండిపోయేవాడు. టాగోర్ పదమూడో ఏట తల్లి శారదాదేవి చనిపోయారు. ఎస్టేట్ పనుల మీద తండ్రి దేవేంద్రనాథ్ టాగోర్ ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరిగేవారు. టాగోర్‌కి స్కూల్ అంటే ఇష్టం లేదు, ద్వేషం కూడా! ఇక లాభం లేదని పెద్దన్నయ్య టాగోర్‌ని ఇంట్లోనే ఉంచి లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, మేథ్స్, శాంస్క్రిట్, ఇంగ్లిష్, డ్రాయింగ్ నేర్పారు. ఇంట్లో నేర్చుకోవడం కూడా టాగోర్‌కి ఇష్టం లేదు. అతడి దృష్టంతా బయటి ప్రకృతి మీదే. గంగానదిలో ఈదాలని, కొండలు గుట్టలు ఎక్కాలనీ.. అదో లోకంలో ఉండేవాడు. ఆ లోకంలోంచి ఆవిర్భవించిందే, పెద్దయ్యాక టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ పాఠశాల. చెట్ల మధ్య ఆరుబయటి తరగతి గదుల స్కూల్ అది.
 
ఇరవై ఏళ్లలో రెండు వేలు!
టాగోర్ ప్రధానంగా రచయిత. కవి. చిన్నచిన్న కథలు చాలా రాశారు. గొప్పగొప్ప కవితలల్లారు. పాటలు రాశారు. నాటక రచయితగా కూడా ప్రసిద్ధులయ్యారు. ఆయన కవితా సంకలం ‘గీతాంజలి’ ఆయనకు నోబెల్ బహుమతి సంపాదించిపెట్టింది. అలా ఆసియా ఖండానికి తొలి నోబెల్ దక్కింది. టాగోర్ మంచి చిత్రకారుడు కూడా. కానీ ఆయనకు ఆ అభిరుచి 60 యేట మొదలైనది! ఆయన 80 ఏళ్లు బతికారు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో టాగోర్ రెండు వేల చిత్రాలు గీశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా అవన్నీ జీవ కళ ఉట్టిపడేవి. ఆర్ట్ ఆయన నేర్చుకున్నది కాదు. తనకు తానుగా తీర్చిదిద్దుకున్నది.
 
ఆర్ట్‌ను అధ్యయనం చేయడం కోసం టాగోర్ ఐరోపా ఖండం తిరిగొచ్చారు. పాల్ క్లీ, హెన్రీ మెటిస్సీ, కాండిన్‌స్కీ వంటి మహనీయుల చిత్రలేఖన రీతులను సునిశితంగా పరిశీలించారు. ఆ అవగాహనతో ప్రకృతి దృశ్యాలు, పోట్రెయిట్‌లు, నైరూప్య చిత్రాలు గీశారు. టాగోర్ చిత్రాలు గాఢమైన రంగుల కలగాపులగంలా ఉంటాయి. ‘‘ఏంటీ మనిషి, వర్ణాల వ్యత్యాసాన్ని గుర్తించలేడా’’అని టాగోర్‌ని విమర్శించినవారూ ఉన్నారు.
 
నైట్‌హుడ్ తిరస్కారం
టాగోర్‌లోని రసహృదయ ప్రావీణ్యాన్నీ, బహుముఖ ప్రజ్ఞాశీలతను గుర్తించిన బ్రిటిష్ రాజు ఆయనకు ‘నైట్‌హుడ్’ను ప్రదానం చేశారు. అంటే టాగోర్ అప్పటి నుంచి ‘సర్’ టాగోర్ అని. అయితే 1919తో జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్న వందలాదిమంది భారతీయులను బ్రిటిష్ ప్రభుత్వం కాల్చిచంపడంతో టాగోర్ తీవ్రమనస్థాపానికి గురయ్యారు. తన నైట్ హుడ్‌ను తిరిగి ఇచ్చేశారు. టాగోర్ 1941 ఆగస్టు 7న చనిపోయారు. ఆయన పుట్టిన రోజు, మరణించి రోజు 7వ తేదీ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement