
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు యూకే ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యూకే, భారత్ వ్యాపార సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సివిల్ డివిజన్) పురస్కారంతో యూకే ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.
చంద్రశేఖరన్‌తోపాటు భారతీ ఎంటర్‌ప్రైజ్ ఫౌండర్, చైర్మన్ సునిల్ భారతీ మిట్టల్‌కు కూడా ఈ పురస్కారం లభించింది. అలాగే మరికొందరు భారతీయ వ్యాపార ప్రముఖులకు యూకే ప్రభుత్వం ఇతర ఉన్నత అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు బ్రిటిష్ రాజు చార్లెస్ ఈ పురస్కారాలకు ఆమోదం తెలిపినట్లుగా పేర్కొంది.
“ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు కింగ్ చార్లెస్‌కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాలవ్యాప్తంగా యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్‌నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలో మా సంస్థల్లో 70,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు” అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.