రవీంద్రనాథ్ టాగోర్ జీవనయానంలో, కీర్తి పతాకలో మూడు మైలు రాళ్ళుగా చెప్పుకోవలసినవి : (1) 1911లో రాసి ఆలపించిన ‘జనగణమన’ జాతీయగీతం, (2) ‘గీతాంజలి’ గేయ సంకలనానికి 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం, (3) 1921లో శాంతినికేతన్‌లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. టాగోర్‌కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మూడవ దాని గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
(1) ‘జనగణమన’ గేయాన్ని రవీంద్రుడు 11–12–1911న రాసి, స్వరకల్పన చేస్తే, 17 రోజుల తరువాత అంటే 28–12–1911న కలకత్తాలో జరిగిన 28వ జాతీయ కాంగ్రెస్ మహాసభలో రవీంద్రుడు స్వయంగా పాడే అవకాశం వచ్చింది. హిందీ, ఉర్దూ భాషల్లోకి ‘జనగణమన’ గేయాన్ని 1912లోనే అబీద్ ఆలీ అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోని బెసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కజిన్స్ అభ్యర్థన మేరకు మదనపల్లెలోనే 28–02–1919వ తేదీన ఆంగ్లంలోకి ‘భారతదేశ సూర్యోదయ గీతం’ అనే పేరుతో రవీంద్రులే స్వయంగా అనువదించగా, డాక్టర్ కజిన్స్ భార్య మార్గరేట్ స్వరకల్పన చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో 1941 నవంబర్ 2వ తేదీన జరిగిన ‘ఆజాద్ హింద్’ సమావేశంలో ‘జనగణమన’ను జాతీయగీతంగా, ‘జైహింద్’ను జాతీయ నినాదంగా ఆమోదిం చారు. 1950 జనవరి 24న జనగణమన భారత జాతీయగీతంగా రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది.
2) గీతాంజలిని బెంగాలీలో మొదటగా 1910లో రవీంద్రుడు రచించారు. 1912లో దీనిని టాగోర్ ఆంగ్లం లోకి ‘గీతాంజలి : సాంగ్ ఆఫరింగ్స్’ అనే పేరుతో అనువదించగా, విలియమ్ బట్లర్ ఏట్స్ అనే బ్రిటిష్ కవి 20 పేజీల ముందుమాటను రాశారు. 1913లోనే ఈ గీతాంజలి ఆంగ్ల అనువాదానికి నోబెల్ బహుమతి వచ్చింది. గీతాంజలిని చలం రమ్యంగా అనువదించారు.
(3) విశ్వభారతి విశ్వవిద్యాలయం : ప్రస్తుతం నూరు వసంతాలు (శతాబ్ది) నిండిన ఈ విశ్వవిద్యాలయం రవీం ద్రుని కలల సాకారం, ఆయన ఆశయాలకు ప్రతిరూపం, ఆయన సామాజిక çస్పృహకు, సేవాతత్పరతకు నిదర్శనం. తన సొంత నిధులతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం గురించి ఒక్కసారి తెలుసుకుంటే టాగోర్‌కు విద్య మీద ఎటువంటి ఉన్నత భావాలు కలవో, ఎటువంటి నాణ్యత గల విద్యను అందించాలనుకున్నారో, యువతను ఏవిధంగా, ఎటువంటి విద్యావంతులుగా తయారు చేయాలనుకున్నారో అర్థమవుతుంది.
శాంతినికేతన్, శ్రీనికేతన్‌ల ప్రాంగణాలలో స్థాపించిన ఈ విద్యా సంస్థలలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ శాస్త్రాల విజ్ఞానాన్ని, వివిధ రంగాల, వృత్తివిద్యా నైపుణ్యాలను విద్యార్థులకు అందించే ధ్యేయంతో స్థాపించిన విద్యాలయం ఇది. ఒక వ్యక్తి ఏ రంగంలో నిష్ణాతులవ్వాలనుకున్నా ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విద్య సాగేది. శాంతి నికేతన్‌లోని విభాగాలు అన్ని రకాల శాస్త్రాల, కళల అధ్యయనానికి తోడ్పడితే, శ్రీనికేతన్ మాత్రం వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కోర్సులను అందిస్తుంది.
నిజానికి విశ్వవిద్యాలయం ఎలా ఉండాలి, ఎటువంటి విద్య, కళలను విద్యార్థులకు నేర్పించాలి అనే ప్రశ్నలకు సమాధానమే కలకత్తాకు సుమారుగా 212 కిలోమీటర్ల దూరంలో ‘విశ్వ గురువు’ స్థాపించిన ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం. ‘విశ్వభారతి’ అంటేనే ప్రపంచాన్నంతటినీ ఒకే రకపు విశ్వాసం, నమ్మకం, ఆశయం కల సమూహంగా తయారుచేయడం. ఈ లక్ష్యసాధన కోసమే ‘ప్రపంచమంతా నివసించగలిగే ఏకైక గూడు’ను విశ్వ భారతి ఆశయంగా ఎంపిక చేశారు. ఇక్కడ బెంగాలీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, సంస్కృతం లాంటి భారతీయ భాషలలోను, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పెర్షియన్, రష్యన్, టిబెటన్ లాంటి విదేశీ భాషలలోను బోధన జరుగుతుంది.
సత్యజిత్‌రే, మహాశ్వేతాదేవి, ఇందిరాగాంధీ, అమర్త్యసేన్ లాంటి దేశీయ ప్రముఖులతో పాటు, ఎంతో మంది విదేశీ ప్రముఖులు కూడా ఇక్కడ విద్యనభ్యసిం చారు. 1951లో దీనిని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చారు. 1905లో టాగోర్ రాసిన ‘నా బంగారు బంగ్లా’నే బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా స్వీకరించిన కారణంగా ప్రపంచంలో రెండు దేశాల జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తిగా టాగోర్ చరిత్రలో నిలిచిపోయారు. సర్వదేశాల సంస్కృతీసంప్రదాయాలను మన సంస్కృతీసంప్రదాయాలతో సమ్మిళతం చేయడానికి కృషిసల్పిన విశ్వ గురువు, విశ్వ కవి, గురు దేవుడాయన.
-ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు
వ్యాసకర్త మాజీ ఉపకులపతి,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
ఈ–మెయిల్ : mnaidumurru@gmail.com
(మే 7న, శత వసంతాల విశ్వభారతి విశ్వవిద్యాలయ సృష్టికర్త టాగోర్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment