ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, సాపేక్షతా సిద్ధాంత కర్త అల్‌బర్ట్ ఐన్‌స్టీన్ (1879–1955)కు భారతీయ ప్రముఖుల్లో రవీం ద్రనాథ ఠాగోర్ బాగా తెలుసు. ఆ తరువాత మహాత్మాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరి పారు. మరో ఇద్దరు ముగ్గురు సైంటిస్టులతో పరిచయం వున్నది. అయితే సైంటిస్టు కాని మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్ (1887–1954)తో పరిచయం వుండటం ఆశ్చర్యకరమైన విషయం. 1930లో ఎమ్.ఎన్. రాయ్ 17 సంవత్సరాల తర్వాత బొంబాయిలో మహమ్మూద్ అనే మారుపేరుతో అడుగు పెట్టాడు. ఆయన 1920 నుంచి 1930 వరకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రష్యాలలో ఉన్నాడు. అప్పట్లో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విదేశాల నుండే వివిధ రీతులలో జరిపించారు. కానీ, 1931 జూలై 31న బొంబాయిలో బ్రిటిష్ పోలీసులు ఎమ్.ఎన్.రాయ్‌ను అరెస్టు చేశారు. ఆ వార్త తెలిసి ఐన్‌స్టీన్ వెంటనే భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి పూర్వక లేఖ రాశారు. అది జర్మన్ భాషలో ఉన్నది.
జెరూసలేంలోని ఐన్‌స్టీన్ పురావస్తు పుస్తక పరిశోధనాలయంలో ఉంది. ఎమ్.ఎన్.రాయ్‌ను హింసిం చకుండా మానవ దృక్పథంతో చూడాలని కోరారు. మేథావులపై క్రూరంగా పగతీర్చుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అప్పటికే ఐన్‌స్టీన్ జర్మనీలో హిట్లర్ భయానికి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎమ్.ఎన్.రాయ్‌తో పరి చయం అయిందో తెలియదు. కానీ ఒక అసాధారణ సైంటిస్టు అలా రాయటం ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా ఐన్‌స్టీన్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోడు. దీనిని బట్టి వారిరువురికీ సన్నిహిత పరిచయం ఉండి ఉండాలి. ఎమ్.ఎన్.రాయ్ సైన్సు పట్ల తీవ్రస్థాయిలో ఆసక్తి కనబరిచినట్లు సైంటిస్టులతో పరిచయం ఉన్నట్లు జైలు నుంచి ఆయన రాసిన లేఖలను బట్టి తెలుస్తున్నది. జైలులో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాత్విక ఫలితాలు అనే అంశాన్ని ఐదువేల పేజీలలో రాశారు. అందులో ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని చర్చించారు. తనకున్న సందేహాలను రాసి పారిస్‌లో ఉన్న ఎలెన్‌కు పంపి ఆయా సైంటిస్టులకు అందజేసి సమాధానాలు తెప్పించమన్నారు. దానినిబట్టి కూడా సైన్స్ లోతుపాతులు గ్రహించిన వ్యక్తిగా స్పష్టపడింది. కొందరు సైంటిస్టులు సమాధానాలిచ్చారు కూడా. జైలులో రాసిన రచనల సారాంశాన్ని ‘సైన్స్ అండ్ ఫిలాసఫీ’ పేరిట 1948లో చిన్న పుస్తకంగా వెలువరించారు. మిగిలిన రచన ఎడిట్ చేసి ప్రచురించవలసి ఉంటుందని ఆయన అనుచరుడు సైన్సు రచయిత అమృతలాల్ బిక్కుషా అభిప్రాయపడ్డారు. ఐన్‌స్టీన్‌తో ఎమ్.ఎన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ (1892–1970)కు పరిచయం ఉంది. అణ్వాయుధ నిషేధ ఉద్యమం చేపట్టిన ఐన్‌స్టీన్ విరాళాల కోసం ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కొంత వరకు సహాయపడింది. ఎమ్.ఎన్.రాయ్‌తోపాటు ఎవిలిన్ కూడా 1926 వరకు యూరోప్‌లో ఉంది. అప్పుడు ఐన్‌స్టీన్‌తో పరిచయం ఉండే అవకాశం ఉన్నది. ఆ పరిచయం వల్లనే 1950లో ఐన్‌స్టీన్ విరాళాలకై అమెరికాలో ఉంటున్న ఎవిలి న్‌కు విజ్ఞప్తి చేశాడు. వీటన్నిటి బట్టి చూస్తే ఎమ్.ఎన్.రాయ్ యూరోప్‌లో ఐన్‌స్టీన్‌ను కలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు. రీజన్–రొమాంటిసిజమ్, రివల్యూషన్ అనే శీర్షికతో రెండు సంపుటాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రచురించినప్పుడు సుప్రసిద్ధ సైకాలజిస్టు ఎరిక్ ఫ్రాం తన పుస్తకం సేన్ సొసైటీలో–ఎవరైనా యూరోప్ పునర్వికాసాన్ని గురించి అవగాహనకు రావాలి అంటే ఎమ్.ఎన్.రాయ్ గ్రంథం చదవమనటం పెద్ద విశేషం. ఈ విధంగా ఒక వైపున రాజకీయాలలో నిమగ్నుడై సతమతమైనా, మరొకవైపు సైన్సు పట్ల సైంటిస్టుల పట్ల ఆసక్తి చూపటమే కాక ప్రజోపయోగకరమైన రచనలు వెలువరించటం గమనార్హం. ఐన్‌స్టీన్ – రాయ్ పరిచయాలపై లోతైన పరిశీలన జరగవలసి ఉన్నది.
(మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్‌ని 1931 జూలై 31న ముంబైలో అరెస్టు చేసిన ఘటనపై తక్షణ స్పందనగా భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్ లేఖ రాసిన సందర్భంగా)
-నరిసెట్టి ఇన్నయ్య సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : innaiah@gmail.com
Comments
Please login to add a commentAdd a comment