నేడు మీనాకుమారి జయంతి
మరణించే ముందు ‘నూర్జహాన్’ కవిత రూపంలో ‘‘మిత్రులారా దయచేసి నా సమాధి పక్కన ‘గుర్తుగా’ నా కోసం మొక్కను నాటకండి అని కోరిందట. ఎందుకంటే వసంతకాలంలో కోయిలలు వచ్చి గీతాన్ని ఆలపిస్తాయి. అలా ఆలపించే సమయం లో వాటి కన్నులలోంచి వెచ్చని కన్నీరు జారి నా సమాధి మీద పడుతుంది... ఎవరైనా కన్నీరు కారిస్తే నా కళ్లు చూడలేవు’’ అని రాసింది. ఎంత గొప్ప కవిత! కోయిల కన్నీరు కారిస్తే చూసి సహించలేని బేల హృదయం నూర్జహాన్‌దేతై... జీవితాన్ని ‘నలిపి’ వేసిన వారిని కూడా క్షమించి ‘‘మిగిలిన ‘సినిమా’ షూటింగ్‌ని పూర్తి చేసుకో, నేనెక్కువ కాలం బతకను’’ అని చివరి కాల్‌షీట్లనిచ్చి తన గుర్తుగా ‘పాకీజా’లాంటి సినిమాని మిగిల్చిపోయిన బేల హృదయం ‘మెహజబీన్‌బానో’ అన్న పేరు పెట్టబడిన మీనాకుమారిది.
తల్లి ఇక్వాల్ ఉన్నీసా... తండ్రి ఆలీ బక్ష్. తల్లి స్వచ్ఛమైన హిందువు. రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడి మనవరాలు. అసలు పేరు ప్రభావతి. ఆమె నృత్యకళాకారిణి కూడా. దాంతో మెహజబీన్‌కి అటు సంగీతం, ఇటు నృత్యం రెండూ అబ్బాయి. ‘నటి’ కావాలనే తల్లి ఆశ మీనాకుమారి ద్వారా తీరుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. మీనాకుమారిని ‘గుర్తించి’ వేషమిచ్చింది విజయ్ భట్. మొదటి పారితోషికం పాతిక రూపాయలు. సినిమా పేరు లెదర్‌ఫేస్! మెహజబీన్‌ని ‘బేబీ మీనా’గా మార్చిందీ విజయ్ భట్‌గారే.
మీనాకి హీరోయిన్‌గా మొదటి సినిమా కేదార్ శర్మగారి ‘దాదాజీ’. దురదృష్టం ఏమంటే సినిమా పూర్తయ్యాక ‘నెగటివ్’ పూర్తిగా కాలిపోయింది. తమాషా అనే పిక్చర్ షూటింగ్‌లో మీనాకుమారి కమాబ్ అమ్రోహీని కలిసింది. ఆయన ‘మవాల్’ (అశోక్ కుమార్, మధుబాల) సినీ చరిత్రని తిరగరాసింది.
తండ్రి ఆలీబక్ష్‌కి తెలియకుండా సోదరి ‘మధు’ సాయంతో ‘సయ్యద్ అమీర్ హైదర్ కమాల్, నభ్వీ (కమాల్ అమ్రోహీ)ని పెళ్లి చేసుకుంది మీనా కుమారి. కమల్‌కి అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు.
1953లో ఫిలింఫేర్ పత్రిక ప్రవేశ పెట్టిన తొట్ట తొలి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు మీనాకుమారిని వరించింది. ‘బైజూ బావ్‌రా’ ఆమెని సూపర్‌స్టార్‌ని చేస్తే, ‘ఫుట్‌పాత్’ చిత్రం నెగిటివ్ కాలిపోయి మీనాకి దుఃఖాన్ని మిగిల్చింది. 1553లో కమాల్ అమ్రోహీ నిర్మించిన ‘దాయ్‌రా’లో నటిస్తూ ‘ఇంటి’ని వదిలి కమాల్ దగ్గరికి కట్టు బట్టల్తో వెళ్లిపోయింది మీనా. అది ఫ్లాప్.
శరత్‌చంద్ర నవల ‘పరిణీత’లో నటించి (అశోక్ కుమార్ మీరా) 1954 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది. ఒక పక్క సినిమా తర్వాత సినిమా, మరో పక్క కమాల్ అమ్రోహీ పెడుతున్న ఆంక్షలతో మీనాకుమారి నలిగిపోయింది.
జీవితంలో ఒక్కో అడుగూ దిగిపోతూ మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ‘సాహబ్ బీబీ గౌర్ గులామ్’లో సహజత్వం కోసం మొట్టమొదట గొంతులో పోసుకున్న ‘బ్రాందీ’ మీనాకుమారికి జీవిత సహచరిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేగాదు, కమల్ అమ్రెహ ప్రొడక్షన్ మేనేజర్ బాకర్ ‘పింజ్‌డే కీ పంభీ’ (పంజరంలో పక్షి) షూటింగ్‌లో మీనాని చెంపదెబ్బ కొట్టడం. టాప్ హీరోయిన్ని ఆఫ్ట్రాల్ మేనేజర్ కొట్టడమా? ప్రేమ దొరక్క... ప్రేమ అనే ఆకలి తీరక మీనా ‘మందు’లో ప్రేమను వెదుక్కుంది. మీనా సహజ రచయిత్రి. కవితలల్లేది.
మేరీ అప్నే - దుష్మన్... ఇవన్నీ అనారోగ్యంతో చేసిన సినిమాలే. అయినా ఆమెకి ఆమే సాటి అని నిరూపించాయి. మళ్లీ కమాల్‌కి ఫోన్ చేసి ‘నీ సినిమా పూర్తి చేసుకో’ అని ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఎవరికి ఏది ఎలా ఎప్పుడు ఇవ్వాలని ‘అల్లా’ నిర్ణయించాడో అంతిమ ‘గమ్యా’న్ని చేరింది మెహజబీన్‌బానో (సాటిలేనిది అని అర్థం). ఏదయితేనేం పాకీజా అద్భుత విజయాన్ని విన్న మీనా ‘ఇన్షా అల్లా’ అంది. ఇది ఆమె భూమి మీదకొచ్చిన తొలి దినం! అందుకే ఆమెను మళ్లీ మళ్లీ స్మరించుకుందాం! మన జ్ఞాపకాలలో ఆమెను బతికించుకుందాం!!
- భువనచంద్ర (సినీ గీత రచయిత)
సాటిలేని పరిణీత నటి
Published Thu, Jul 31 2014 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM
Advertisement
Advertisement