bhuvanacandra
-
ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు..
ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఆయనతో తమ అనుబంధాన్ని రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్నారు. బుల్లబ్బాయ్ నా తోడబుట్టని తమ్ముడు 34 ఏళ్ల పరిచయంలో ఏనాడూ మేం రైటర్స్లా మాట్లాడుకోలేదు. నన్ను ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. నన్ను ‘అన్నయ్యా’ అంటే నేను ‘బుల్లబ్బాయ్’ అనేవాణ్ణి. నిన్న (సోమవారం)నే మాట్లాడుకున్నాం. ‘ఈ ఏడాది ఇంకా కలుసుకోలేదు, కలుద్దాం అన్నయ్యా’ అన్నాడు. సరే అన్నాను. ఇలా కలుసుకున్నాను తమ్ముణ్ణి. మనిషి లేడని ఊహకు కూడా అందటం లేదు. ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడో తెలిస్తే బావుండు.. ఆ పేరుతో పిలుస్తాను. మనిషి చక్కగా నిద్రపోతున్నాడు. వెన్నెలకంటి అంటే వస్తాడా, బుల్లబ్బాయ్ అంటే వస్తాడా... ఎలా పిలిచినా రాకుండా అందనంత దూరం వెళ్లిపోయాడు. ‘ఈ రోజు వెళ్లిపోతున్నాను’ అన్నట్లుగా చూస్తున్నాడు. ఎవరైనా కొంతకాలానికి వెళ్లవలసిన వాళ్లమే అని తెలుసు కానీ, ఎందుకో అంతా శూన్యంలా ఉంది. కన్నతల్లి కడుపునుండి నేలతల్లి వొళ్లోకొచ్చి ఆట, పాటలాడి ఎన్నో బంధాలను పేర్చుకుని చేసే ప్రయాణమే కదా జీవితం. మళ్లీ నేలతల్లిని ముద్దాడాడు తమ్ముడు. ఈ ఇద్దరమ్మల ప్రయాణంలో తన శరీరానికి పెట్టుకున్న పేరు ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్’. ఇక లేడు అనే వార్త కలా? నిజమా? అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏ సభకెళ్లినా, సన్మానాలకెళ్లినా, ఆంధ్రా క్లబ్లో పురస్కారాలకెళ్లినా అందరూ మమ్మల్ని అన్నతమ్ములొచ్చారు అనేవాళ్లు. ‘అన్నయ్యా.. మనిద్దరం నెల్లూరు వెళుతున్నాం. అక్కడ సభ ఉంది. మనిద్దరి పేరు ఇచ్చేశాను’ అనేవాడు. తిరిగొచ్చేటప్పుడు మా కబుర్లు ప్రపంచమంతా తిరిగేవి. మా రెండు గొంతుల్లో ఒక గొంతు మూగబోయింది, మరో గొంతు పక్కన నిలబడి మౌనంగా రోదిస్తోంది. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు.. అన్నింటినీ ఇక్కడే వదిలి ఈ రోజు నింగిలో కలిసిపోయాడు. పదివేల కోట్లున్నా ఏం చేసుకుంటాం? అనుభవించటానికి పక్కన సరైన మనిషి కావాలి కానీ.. ఆయన కోప్పడటం నేను చూడలేదు, ఏ సభలోనైనా అందరినీ గలగలా నవ్విస్తాడు. ప్రతిరోజూ నవ్వించే ఆ మనిషి ఈ రోజు ఏడిపిస్తున్నాడు (ఏడుస్తూ). మనసులో ఏదో తెలియని వెలితి. ‘ఐ మిస్ యు ఫర్ ఎవర్.. బుల్లబ్బాయ్’. – రచయిత భువనచంద్ర నలుగురం ఒక్కసారే వచ్చాం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు 1985లో, నేను 1986 సెప్టెంబర్‌లో, 1987 జనవరి 1న భువనచంద్ర వచ్చాం. వెన్నెలకంటి కూడా అప్పుడే పరిశ్రమలోకొచ్చారు. దాదాపు నలుగురం ఒకేసారి ఏడాది వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు వచ్చాం. వెన్నెలకంటి నాకు అత్యంత ఆత్మీయుడు. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వెన్నెలకంటి చనిపోయిన విషయం తెలియగానే ఆయన శ్రీమతితో మాట్లాడాను. మాట్లాడుతూనే గుండెపోటుతో పోయారట, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదని చెప్పారామె. డబ్బింగ్ చిత్రాల్లో వండర్స్ క్రియేట్ చేసింది వెన్నెలకంటిగారే. పద్యకవిగా, పాటల కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో నాకు ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. ‘మైనే ప్యార్ కియా’ డబ్బింగ్ చిత్రానికి ఈయన రాసిన మాటలకు ముగ్ధుడైన ఆ హిందీ చిత్ర నిర్మాత తారాచంద్ బర్జాత్యా ఈయనకు పాదాభివందనం చేయటం నాకింకా గుర్తుంది. ఏదేమైనా ఈ రోజు అత్యంత ఆత్మీయుడిని కోల్పోవటం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు -
గోదావరిని చూస్తే అమ్మ గుర్తుకొస్తుంది
సినీ గేయ రచయిత భువనచంద్ర తెలుగు సినీ రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి భువనచంద్ర. ఆయన స్వస్థలం చింతలపూడి. 12 సంవత్సరాల తరువాత వస్తున్న పుష్కరాలతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆయన ఇలా వివరించారు.. గలగల పారే గోదావరిని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మగారు చంద్రమౌళీశ్వరి రాజమండ్రిలో చనిపోయారు. ఆమె దహన సంస్కారాలు, కర్మకాండలు అన్నీ గోదావరి ఒడ్డునే చేశాం. అందుకే నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అందుకేనేమో గోదావరి అంటే నాకు అంత ప్రాణం. చిన్నప్పుడు అమ్మ చిటికెన వేలు పట్టుకుని గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పటి సంఘటనలు నాకు అంతగా గుర్తు లేకపోయినా పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసింది. అమ్మతో కలిసి పుష్కర స్నానం అయ్యాక ఒడ్డుకు వస్తుంటే ఒక సంఘటన జరిగింది. బారు గెడ్డం, తెల్లటి వస్త్రాలు, భుజంపై పసుపు ఉత్తరీయం వేసుకున్న సాధువు ఒకాయన నా తలమీద చెయ్యి పెట్టి ‘మీ అబ్బాయి మంచి పేరు తెచ్చుకుంటాడు’ అని ఆశీర్వదిస్తూ మా అమ్మగారితో అనడం నాకు ఇంకా గుర్తుంది. పుష్కరాల్లో విక్రయించే జీళ్లు, పూతరేకులంటే నాకు చాలా ఇష్టం. జీళ్లు మా ఊళ్లో కూడా దొరుకుతాయి. కానీ, పూతరేకులు మాత్రం ఇక్కడ తినాల్సిందే. ఈ ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు కూడా అమ్మ దగ్గరికి వస్తాను. అమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటాను. అమ్మ భౌతికంగా లేకపోయినా గోదారమ్మ రూపంలో బతికే ఉందనిపిస్తుంది. అందుకే పుష్కరాలు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉండాలని ఉంది. ఇంతవరకూ గోదావరిని కీర్తిస్తూ పాట రాసే భాగ్యం కలగలేదు. అయితే త్వరలో ఒక ఆధ్యాత్మిక నవల రచించే ఆలోచన ఉంది. భగవంతుని ఆశీస్సులతో గోదావరి చెంతనే ఉండి ఈ నవల పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నా చిరకాల కోరిక. - చింతలపూడి (పశ్చిమ గోదావరి) -
సాటిలేని పరిణీత నటి
నేడు మీనాకుమారి జయంతి మరణించే ముందు ‘నూర్జహాన్’ కవిత రూపంలో ‘‘మిత్రులారా దయచేసి నా సమాధి పక్కన ‘గుర్తుగా’ నా కోసం మొక్కను నాటకండి అని కోరిందట. ఎందుకంటే వసంతకాలంలో కోయిలలు వచ్చి గీతాన్ని ఆలపిస్తాయి. అలా ఆలపించే సమయం లో వాటి కన్నులలోంచి వెచ్చని కన్నీరు జారి నా సమాధి మీద పడుతుంది... ఎవరైనా కన్నీరు కారిస్తే నా కళ్లు చూడలేవు’’ అని రాసింది. ఎంత గొప్ప కవిత! కోయిల కన్నీరు కారిస్తే చూసి సహించలేని బేల హృదయం నూర్జహాన్దేతై... జీవితాన్ని ‘నలిపి’ వేసిన వారిని కూడా క్షమించి ‘‘మిగిలిన ‘సినిమా’ షూటింగ్‌ని పూర్తి చేసుకో, నేనెక్కువ కాలం బతకను’’ అని చివరి కాల్షీట్లనిచ్చి తన గుర్తుగా ‘పాకీజా’లాంటి సినిమాని మిగిల్చిపోయిన బేల హృదయం ‘మెహజబీన్బానో’ అన్న పేరు పెట్టబడిన మీనాకుమారిది. తల్లి ఇక్వాల్ ఉన్నీసా... తండ్రి ఆలీ బక్ష్. తల్లి స్వచ్ఛమైన హిందువు. రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడి మనవరాలు. అసలు పేరు ప్రభావతి. ఆమె నృత్యకళాకారిణి కూడా. దాంతో మెహజబీన్కి అటు సంగీతం, ఇటు నృత్యం రెండూ అబ్బాయి. ‘నటి’ కావాలనే తల్లి ఆశ మీనాకుమారి ద్వారా తీరుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. మీనాకుమారిని ‘గుర్తించి’ వేషమిచ్చింది విజయ్ భట్. మొదటి పారితోషికం పాతిక రూపాయలు. సినిమా పేరు లెదర్ఫేస్! మెహజబీన్ని ‘బేబీ మీనా’గా మార్చిందీ విజయ్ భట్గారే. మీనాకి హీరోయిన్గా మొదటి సినిమా కేదార్ శర్మగారి ‘దాదాజీ’. దురదృష్టం ఏమంటే సినిమా పూర్తయ్యాక ‘నెగటివ్’ పూర్తిగా కాలిపోయింది. తమాషా అనే పిక్చర్ షూటింగ్లో మీనాకుమారి కమాబ్ అమ్రోహీని కలిసింది. ఆయన ‘మవాల్’ (అశోక్ కుమార్, మధుబాల) సినీ చరిత్రని తిరగరాసింది. తండ్రి ఆలీబక్ష్‌కి తెలియకుండా సోదరి ‘మధు’ సాయంతో ‘సయ్యద్ అమీర్ హైదర్ కమాల్, నభ్వీ (కమాల్ అమ్రోహీ)ని పెళ్లి చేసుకుంది మీనా కుమారి. కమల్‌కి అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. 1953లో ఫిలింఫేర్ పత్రిక ప్రవేశ పెట్టిన తొట్ట తొలి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు మీనాకుమారిని వరించింది. ‘బైజూ బావ్రా’ ఆమెని సూపర్‌స్టార్‌ని చేస్తే, ‘ఫుట్‌పాత్’ చిత్రం నెగిటివ్ కాలిపోయి మీనాకి దుఃఖాన్ని మిగిల్చింది. 1553లో కమాల్ అమ్రోహీ నిర్మించిన ‘దాయ్రా’లో నటిస్తూ ‘ఇంటి’ని వదిలి కమాల్ దగ్గరికి కట్టు బట్టల్తో వెళ్లిపోయింది మీనా. అది ఫ్లాప్. శరత్చంద్ర నవల ‘పరిణీత’లో నటించి (అశోక్ కుమార్ మీరా) 1954 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది. ఒక పక్క సినిమా తర్వాత సినిమా, మరో పక్క కమాల్ అమ్రోహీ పెడుతున్న ఆంక్షలతో మీనాకుమారి నలిగిపోయింది. జీవితంలో ఒక్కో అడుగూ దిగిపోతూ మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ‘సాహబ్ బీబీ గౌర్ గులామ్’లో సహజత్వం కోసం మొట్టమొదట గొంతులో పోసుకున్న ‘బ్రాందీ’ మీనాకుమారికి జీవిత సహచరిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేగాదు, కమల్ అమ్రెహ ప్రొడక్షన్ మేనేజర్ బాకర్ ‘పింజ్డే కీ పంభీ’ (పంజరంలో పక్షి) షూటింగ్లో మీనాని చెంపదెబ్బ కొట్టడం. టాప్ హీరోయిన్ని ఆఫ్ట్రాల్ మేనేజర్ కొట్టడమా? ప్రేమ దొరక్క... ప్రేమ అనే ఆకలి తీరక మీనా ‘మందు’లో ప్రేమను వెదుక్కుంది. మీనా సహజ రచయిత్రి. కవితలల్లేది. మేరీ అప్నే - దుష్మన్... ఇవన్నీ అనారోగ్యంతో చేసిన సినిమాలే. అయినా ఆమెకి ఆమే సాటి అని నిరూపించాయి. మళ్లీ కమాల్‌కి ఫోన్ చేసి ‘నీ సినిమా పూర్తి చేసుకో’ అని ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఎవరికి ఏది ఎలా ఎప్పుడు ఇవ్వాలని ‘అల్లా’ నిర్ణయించాడో అంతిమ ‘గమ్యా’న్ని చేరింది మెహజబీన్బానో (సాటిలేనిది అని అర్థం). ఏదయితేనేం పాకీజా అద్భుత విజయాన్ని విన్న మీనా ‘ఇన్షా అల్లా’ అంది. ఇది ఆమె భూమి మీదకొచ్చిన తొలి దినం! అందుకే ఆమెను మళ్లీ మళ్లీ స్మరించుకుందాం! మన జ్ఞాపకాలలో ఆమెను బతికించుకుందాం!! - భువనచంద్ర (సినీ గీత రచయిత)