సినీ గేయ రచయిత భువనచంద్ర
తెలుగు సినీ రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి భువనచంద్ర. ఆయన స్వస్థలం చింతలపూడి. 12 సంవత్సరాల తరువాత వస్తున్న పుష్కరాలతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆయన ఇలా వివరించారు..
గలగల పారే గోదావరిని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మగారు చంద్రమౌళీశ్వరి రాజమండ్రిలో చనిపోయారు. ఆమె దహన సంస్కారాలు, కర్మకాండలు అన్నీ గోదావరి ఒడ్డునే చేశాం. అందుకే నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అందుకేనేమో గోదావరి అంటే నాకు అంత ప్రాణం. చిన్నప్పుడు అమ్మ చిటికెన వేలు పట్టుకుని గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పటి సంఘటనలు నాకు అంతగా గుర్తు లేకపోయినా పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసింది.
అమ్మతో కలిసి పుష్కర స్నానం అయ్యాక ఒడ్డుకు వస్తుంటే ఒక సంఘటన జరిగింది. బారు గెడ్డం, తెల్లటి వస్త్రాలు, భుజంపై పసుపు ఉత్తరీయం వేసుకున్న సాధువు ఒకాయన నా తలమీద చెయ్యి పెట్టి ‘మీ అబ్బాయి మంచి పేరు తెచ్చుకుంటాడు’ అని ఆశీర్వదిస్తూ మా అమ్మగారితో అనడం నాకు ఇంకా గుర్తుంది. పుష్కరాల్లో విక్రయించే జీళ్లు, పూతరేకులంటే నాకు చాలా ఇష్టం. జీళ్లు మా ఊళ్లో కూడా దొరుకుతాయి. కానీ, పూతరేకులు మాత్రం ఇక్కడ తినాల్సిందే. ఈ ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు కూడా అమ్మ దగ్గరికి వస్తాను. అమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటాను. అమ్మ భౌతికంగా లేకపోయినా గోదారమ్మ రూపంలో బతికే ఉందనిపిస్తుంది. అందుకే పుష్కరాలు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉండాలని ఉంది. ఇంతవరకూ గోదావరిని కీర్తిస్తూ పాట రాసే భాగ్యం కలగలేదు. అయితే త్వరలో ఒక ఆధ్యాత్మిక నవల రచించే ఆలోచన ఉంది. భగవంతుని ఆశీస్సులతో గోదావరి చెంతనే ఉండి ఈ నవల పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నా చిరకాల కోరిక.
- చింతలపూడి (పశ్చిమ గోదావరి)