న్యూఢిల్లీ: జాతీయ గీతం 'జన గణ మన అధినాయక జయ హే' పై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో 'అధినాయక జయ హే'అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వాస్తవానికి వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది.
ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జన గణ మన అధినాయక జయ హే' అన్న గీతాన్ని తొలిసారిగాబాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది.
'బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911'.
'ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911'.
'1911 డిసెంబర్ 27 తేదీ బుధవారం నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపరర్‌ను స్వాగతిస్తూ బెంగాలీలో పాడిన పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎంపరర్‌ను స్వాగతిస్తూ కాంగ్రెస్ సదస్సు ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది-ది ఇండియన్, డిసెంబర్ 29, 1911'
'దేవుడిని పొగుడుతూ పాడిన బెంగాలీ ప్రార్థనా గీతంతో కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ఐదవ కింగ్ జార్జికి విధేయతను ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. అనంతరం ఆయన్ని ప్రశంసిస్తూ హిందీలో ఓ గీతాలాపన చేశారు-ది అమృత బజార్ పత్రిక, డిసెంబర్ 28, 1911'
ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం'ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరుకనుక) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు.
1937, నవంబర్ 10వ తేదీన పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ తాను స్వయంగా రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంతటి దౌర్భాగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదాన్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు. ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుందని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదవి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికి వాదిస్తారు.
ఎప్పుడో సద్దుమణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే. అందుకనే ఆయనకు మళ్లీ ఈ వివాదం గుర్తొంచి మాట్లాడుతున్నట్టున్నారు.
జాతీయ గీతం వివాదం వెనుక..
Published Thu, Jul 9 2015 6:28 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement