విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ సాహిత్యం ఎన్నోసార్లు నాటకాలుగా రంగస్థల ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా రచయిత, దర్శకుడు మానవ్ కౌల్ ‘కలర్ బ్లైండ్’ పేరుతో రవీంద్రుడి జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ఒక నాటకాన్ని రూపొందించారు. ఈ నాటకం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రదర్శిస్తారు.
బాలీవుడ్ హీరోయిన్ కల్కీ కోహిలిన్ ‘కలర్‌బ్లైండ్’ నాటకం ద్వారా తిరిగి స్టేజి ఎక్కుతున్నారు. గతంలో ఆమెకు నాటకాలు వేసిన అనుభవం ఉంది. విశేషమేమిటంటే ఈ నాటకానికి కల్కీ రచనా సహకారం అందించారు. దీనికోసం పలు పుస్తకాలు చదివారు.
‘‘వివిధ కాలరేఖల మధ్య నాటకం సంచరిస్తుంది. సంగీతం ప్రయోగాత్మకంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి భాషతో పనేమీ లేదు. దృశ్యమే అన్నీ చెప్పేస్తుంది. ముంబాయి ప్రేక్షకుల కోసం బెంగాలీ నాటకంలో కొన్ని భాగాలను హిందీలోకి అనువదించాం’’ అని చెబుతుంది కల్కీ. ‘కలర్ బ్లైండ్’ కోసం రచయితలు చాలా అధ్యయనం చేశారు. ఠాగూర్‌లోని ఆధ్యాత్మిక కోణం, అర్జెంటీనా స్కాలర్ విక్టోరియా ఒకంపోతో ఆయన బంధం గురించి లోతుగా తెలుసుకున్నారు. ఠాగూర్ జీవితంలో వివిధ ఘట్టాలను రచయితలు పంచుకొన్నారు. నోట్స్ తయారుచేసుకున్నారు. ఒకంపో రచనల అధ్యయనం, రవీంద్రుడి సంగీతాన్ని వినడం వారికి నిత్యజీవిత కార్యక్రమంగా మారింది.
నాటకంలో ఠాగూర్ ప్రసిద్ధ పాటలు, ‘మోర్ బిన ఒతే కోన్..’ పాట ఫ్రెంచ్ వెర్షన్‌తో సహా ఉన్నాయి.
‘‘కొత్తవారితో పని చేయడం మంచి అనుభవం. సవాలుగా అనిపించింది. మానవ్‌తో మరోసారి పని చేయాలనుకుంటున్నాను. పరిశోధన, రచన అనేవి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేవి. థియేటర్ అనేది నటుల మాధ్యమం. నటులు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సినిమాలతో పోల్చితే ఇక్కడ ఉండే క్రమశిక్షణ వేరు’’ అంటున్న కల్కీ ‘కలర్ బ్లైండ్’ నాటకంలో ఒకంపో, సమకాలీన భారతీయ యువతిగా రెండు పాత్రలు పోషించారు. సత్యజిత్ శర్మ ఠాగూర్‌గా, స్వనంద్ కిర్‌కిరె ‘మృత్యువు’గా నటించారు. ‘‘కల్కీ తన పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఆమె ఫ్రెంచ్ కూడా మాట్లాడుతుంది. థియేటర్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి’’ అని మెచ్చుకోలుగా అంటున్నారు మానవ్ కౌల్.
థియేటర్ అనేది నటుల మాధ్యమం. నటులు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సినిమాలతో పోల్చితే ఇక్కడ ఉండే క్రమశిక్షణ వేరు.
- కల్కీ
కాలరేఖల మధ్య కలర్ బ్లైండ్!
Published Fri, Dec 6 2013 12:15 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
Advertisement