సంధ్యాకాశంలా జీవితం...
గ్రంథపు చెక్క
జీవితమంటే సుఖదుఃఖాలు రెండూ కలిసి ఉంటాయి. సంధ్యాకాశంలా ఉంటుంది జీవితం. వెలుగు చీకట్లు కలిసి. అయితే ఒక్కొక్కడి బ్రతుకు ఉదయసంధ్యలాగ ఉంటుంది. మరొక్కడిది సాయం సంధ్యలాగ ఉంటుంది.
మొదటి రకం జీవితాన్ని చూస్తే మనకు ఉల్లాసం కలుగుతుంది. దానిలో వెలుగు పాలెక్కువ. రెండో రకపు దానిలో రక్తఛాయ ఎక్కువ. చీకట్ల పాలెక్కువలా ఉంటుంది. అందరి జీవితాల్లాంటిదే కవి జీవితమూను. ఎంత అల్పమైనదైనా ఒక్కొక్క అనుభూతి కవిని ఎక్కువ ఊపేయవచ్చు. కానీ, మొత్తం మీద, రకరకాల సుఖదుఃఖాలతో, ఇతర మానవ జీవితాల్లాగానే ఇతని జీవితమూ ఉంటుంది. అలాగే కొందరు కవుల జీవితాలను గూర్చి వివరాలను తెలుసుకున్నా, వారి రచనలు చదివినా... ఏదో చల్లగా, నిదానంగా అతగాడు నిండుగా బ్రతికాడనిపించి మనకు హాయిగా అనిపిస్తుంది.
వర్డ్స్‌వర్త్, టెన్నీసన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కవులలాగ. మరి కొందరి జీవితగాథలు తెలుసుకుంటే దిగులు వేస్తుంది. తమ బ్రతుకుల్ని కాలరథచక్రాల క్రింద పారేసి, మార్గానికి కూడా రక్తపు మరకల్ని అంటించి, బలవంతంగా ముగించినట్టు తోస్తుంది. వీళ్ల రచనలు కూడా చెప్పలేని బెంగా, భయం కలిగిస్తాయి.
- దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’ నుంచి.