ఆంధ్ర నాటకానికి నవ వసంతాలు
ఆంధ్ర నాటక కళాపరిషత్... నాటక కళ క్షీణ దశకు చేరుతున్న తరుణంలో నాటక పునరుజ్జీవం లక్ష్యంతో భారతదేశంలోనే తొలిగా తెనాలిలో ఏర్పాటైన నాటక సంస్థ. రంగస్థల నాటకానికి పునర్వికాసం కల్పించి తెలుగుదేశాన నాటక కళ పరిఢ విల్లేందుకు అవిరళ కృషే చేసింది. ఆధునిక సమాజంలో ఇంకా నాటకం అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నదంటే ఇలాంటి సంస్థల కృషి ఫలితమే. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంస్థను దశాబ్దకాలం కిత్రమే పునరుద్ధరించారు. ఎనిమిది దశాబ్దాల ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 90 వసంతాల వేళ, విజయవాడ మొగల్రా జపురంలోని సిద్ధార్థ కళాపీఠంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు జాతీయ బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నందున ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆవిర్భావం, కృషిని గుర్తు చేసుకోవటం సందర్భోచితం...
ఇతర రాష్ట్రాల నుంచి...
పూర్వం ఇతర రాష్ట్రాల నుంచి నాటక కంపెనీలు వచ్చి ఆంధ్ర దేశంలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. 1880 తర్వాత తెనాలితో సహా అయిదారు పట్టణాల్లో నాటక కంపెనీలు ఏర్పాటయ్యాయి. పురాణాల నుంచి కథాంశాలను ఎన్నుకొని నాటకాలను తీసుకొచ్చారు. జాతీయోద్యమ ప్రభావంతో పౌరాణిక అంశాలతో నాటకాలను రూపొందించి, సందర్భోచితంగా బ్రిటిష్ వారిని దుయ్యబడుతూ వచ్చారు. ఆ రకంగా తెలుగునాట నాటక ప్రదర్శనలు విస్తారంగా జరుగుతున్న 1919లోనే నాటక పోటీలు ఆరంభమయ్యాయి. నాటక ప్రాభవం క్రమేపీ తగ్గిపోవడానికి, అపసవ్య ధోరణులకు ఈ పోటీలే దారితీయటం విశేషం! ఏ నటుడు ఎక్కువసేపు రాగం తీస్తే, ఆ నటుడికే ప్రేక్షకుల నుంచి ‘వన్స్‌మోర్’ వస్తుండటంతో నాటకానికి అర్ధం మారింది. నటనకు ప్రాధాన్యత తగ్గి గానం, సంగీతమే ప్రధానమైంది.
నాటకాలు పాటకచేరీలు అన్నట్టుగా తయారయ్యాయి. నటులను సంస్కరిస్తే నాటకాలు బాగుపడతాయన్న భావనతో 1924లో తొలిసారిగా విజయవాడలో నాటక పాఠశాల ఏర్పాటుచేసి శిక్షణనిచ్చిన తర్వాత కూడా పద్ధతి మారలేదు. నటులు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడారు. వైషమ్యాలు పెరిగి, నాటక సమాజాలు నష్టాల్లో పడ్డాయి. క్రమంగా మూతపడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నందున కొందరు ఆ రంగానికి వెళ్లారు. నాటకరంగం అధోగతిలో పడింది. నాటక రంగంలోని అపసవ్య ధోరణులను అరికట్టడానికి అనేకులు రకరకాలుగా ప్రయత్నించారు. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే ఆశయంతో ఔత్సాహికులు రంగంలోకి దిగి తెలుగు నాటకం ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిచేశా రు. నాటక సంస్కరణలకు మార్గాలను అన్వేషించారు. ఇలాంటి తరుణంలో ‘సురభి’ నాటక కంపెనీ పితామహుడు వనారస గోవిందరావు ఆరునెలలపాటు కష్టపడి రాష్ట్రంలోని ప్రముఖులను కూడగట్టి, ఎంతో వ్యయంచేసి ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ ఆవిర్భావానికి దోహదపడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్ 19, 20, 21 తేదీల్లో తెనాలిలో వైభవంగా నిర్వహించారు.
దశమార్చిన మారిన సభలు
మూడురోజుల సభలతో ఆంధ్ర నాటక కళాపరిషత్, తెలుగు నాటక రంగానికి దశ, దిశానిర్దేశం చేసింది. స్పష్టమైన నియమాలను రూపొందించింది. పరిషత్ నిర్వహణతో రాష్ట్రంలో ఔత్సాహిక సమాజాలు వందలకొద్దీ పుట్టుకొచ్చాయి. కొత్త రచయితలు, నటీ నటులు, సంగీత కళాకారులు నాటక రంగంలోకి అడుగుపెట్టారు. పరిషత్తుల్లో బహుమతులు సాధించిన రచయితలు, నటులకు సినిమారంగంలో ప్రవేశం లభించింది.
మొదటి సభలకు అతిథులు వీరే..
బుర్రా శేషగిరిరావు, వక్కలంక అచ్యుతరావు, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు సుబ్బారావు, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కాళ్లకూరి గోపాలరావు, బళ్లారి రాఘవ ప్రభృతులు హాజరయ్యారు. మొదటిరోజు ‘నాటక రచన’, రెండోరోజు ‘నటన’, చివరిరోజున ‘నాటక ప్రయోగం’ అంశంపై చర్చలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి నాటకాలను ప్రదర్శించారు. ముగింపు సభలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు, గోవిందరావు, ఆచంట సాంఖ్యాయన శర్మ, చట్టి చినపూర్ణయ్య పంతులు, విశ్వనాధ కవిరాజు, కొత్తపల్లి లక్ష్మయ్య, నీలంరాజు వేంకట శేషయ్యతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనారస గోవిందరావును ‘ఆంధ్ర నాటక కళోద్ధారక’ బిరుదుతో సత్కరించారు.
తెనాలి నేపధ్యమే ప్రేరణ..
‘సురభి’ నాటక సమాజం నాటక ప్రదర్శనలిస్తూ తెనాలికి వచ్చిన సందర్భంలో ఆ కంపెనీ నిర్వాహకుడు వనారస గోవిందరావుకు ఇక్కడి సాంస్కృతిక వాతావరణం నచ్చింది. అందుకే ఇక్కడ కళాపరిషత్ ఆవిర్భావానికి కృషి చేశారు. సాహితీ సమితి ఏర్పాటై ఉంది. రచయితలు, కళాకారులు, నాటక సమాజాలు ఉన్నాయి. తెనాలి నుంచి అప్పట్లో 20 వరకు దిన, వార, మాసపత్రికలు వెలువడుతుండేవి. ఇంత అనుకూలంగా ఉన్నందునే పరిషత్ విజయవంతమైంది.
– నేతి పరమేశ్వరశర్మ, సీనియర్ కళాకారుడు
పరిషత్ అనుమతిస్తే గొప్పే!
ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో ప్రదర్శనకు ఏదైనా నాటకానికి అనుమతి లభించిందంటే గొప్ప గౌరవంగా భావించేవారు. ‘కాళరాత్రి’, ‘మరో మొహంజదారో’, ‘ఎన్జీవో’, ‘ఈనాడు’, ‘దొంగవీరడు’, ‘పల్లెపడుచు’, ‘అన్నాచెల్లెలు’, ‘మావూరు’, ‘ఎదురీత’, ‘పెత్తందారు‘, ‘నటనాలయం’, ‘కనక పుష్యరాగం’, ‘కళ్లు’ వంటి అద్భుత కళాఖండాలు తెలుగు నాటక రంగంలో వెలుగులోకి రావడానికి కళాపరిషత్ దోహదపడింది. తర్వాత 1951 లో మున్సిపల్ చైర్మన్ నన్నపనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మళ్లీ తెనాలిలో నాలుగురోజులు ఆంధ్ర నాటక కళాపరిషత్ సభలు జరిగాయి.
ఆవిర్భావ సభల్లో పాల్గొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సభలను, పోటీ నాటకాలను సినిమా దర్శకుడు వైవీ రావ్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, ఆ నాటి సభల్లో నృత్యం చేయటం మరో విశేషం. కళారంగంలో జాజ్వలమానంగా ప్రకాశించేందుకు ఎంతో కృషిచేసిన ఈ పరిషత్ పదేళ్లు విరామం అనంతరం, బొల్లినేని కృష్ణయ్య, అన్నమనేని ప్రసాదరావు సారధ్యంలో పూర్వవైభవానికి కృషిని కొనసాగిస్తోంది. ఆ క్రమంలో 2009లో తెనాలిలో ఎనిమిది పదుల నాటకోత్సవాలను జరుపుకోవటం విశేషం.