దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేసిన 'మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం' కార్యక్రమానికి.. 'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్' 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లో గౌరవ స్థానం దక్కింది. సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో తానా, వంగూరి ఫౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సీపీ బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్), దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, వేగేశ్న ఫౌండేషన్ వారి సమిష్టి సౌజన్యంతో.. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా 'మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం' అత్యంత వైభవంగా నిర్వహించారు. నవంబర్ 1 ఆదివారం రోజున 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది.
కళాబ్రహ్మ సేవామహాత్మ శిరోమణి వంశీ రామరాజు స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ సభకు దేవులపల్లి మనుమరాళ్ళు, ప్రముఖ కార్టూనిస్ట్ బుజ్జాయి కుమార్తెలు అయిన రేవతి అడితం (అమెరికా), రేఖ సుప్రియ (చెన్నై) జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా తమ తాతగారి జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మక మైనది అని అభినందనలు తెలుపారు. కృష్ణ శాస్త్రితో వారికున్న అనుబంధాన్ని గురించి సభాముఖంగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సాహితీవేత్త కేవీ రమణ.. దేవులపల్లి రచనా వైశిష్ట్యం గూర్చి తెలుపుతూ అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేశారు. వారు రచించిన 'జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ' పాటకు జాతీయగీతం కావాల్సిన స్థాయి ఉంది' అన్నారు. సింగపూర్ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. దేవులపల్లి వంటి మహానుభావులకు నివాళిగా ఇటువంటి కార్యక్రమం చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవం అన్నారు.
భారత్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి 58 మంది గాయనీ గాయకులు పాల్గొని దేవులపల్లి వారు రచించిన 100 పాటలతో రాత్రి 11 గంటల వరకు శతగీతార్చన గావించారు. ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనా గీతం ఆలపించగా, దేవులపల్లి వారిపై వీరుభొట్ల హరి శ్రీనివాస్ విరచిత గీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం 12 గంటల పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడి, ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది కృష్ణశాస్త్రి అభిమానులకు వీనులవిందు చేసింది.
రాధిక మంగిపూడి నిర్వహణలో సాయంత్ర సభలో.. సురేఖ మూర్తి, సీతా రత్నాకర్, విజయలక్ష్మి, శశికళ మొదలగు ప్రముఖ గాయనీ మణులు కృష్ణశాస్త్రి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి అలరించారు. సింగపూర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు అక్షర మరో ఇద్దరు పిల్లలు కలసి 'నారాయణ నారాయణ' అనే బృందగానం ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం సాహితీవేత్త, ప్రముఖ సినీ రచయిత భువన చంద్రకి 'దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం' సగౌరవంగా అందజేశారు.
ఈ సందర్భంగా భారత్ నుండి సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు, వెన్నెలకంటి, మహాభాష్యం చిత్తరంజన్, అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్, శారద, దేవులపల్లి కుటుంబ సభ్యులు రత్నపాప, ఆస్ట్రేలియా నుంచి కొంచాడ రావు, మధు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత, లండన్ నుంచి జొన్నలగడ్డ మూర్తి, వీపీ కిల్లీ, దక్షిణాఫ్రికా నుంచి సీతారామరాజు మొదలగు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం దేవులపల్లికి నివాళులర్పించి, భువనచంద్రకి శుభాకాంక్షలు అందజేశారు. రాధిక మంగిపూడి సింగపూర్, విజయ గొల్లపూడి- ఆస్ట్రేలియా, జయ పీసపాటి- హాంకాంగ్, రాధికా నోరి- అమెరికా నుంచి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
దేవులపల్లి సంగీత సాహిత్య సమ్మేళనానికి అరుదైన గౌరవం
Published Mon, Nov 2 2020 8:36 PM | Last Updated on Mon, Nov 2 2020 8:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment