ఈజీగానే ఎంసెట్!
ఇంజనీరింగ్‌కు 92 శాతం.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 88.02 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ పరీక్షకు అత్యధికంగా 92.34 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 88.02 శాతం మంది హాజరయ్యారు. నిమిషం నిబంధ న కారణంగా కొందరు పరీక్షకు దూరమయ్యారు. మొత్తమ్మీద ఈసారి ఎంసెట్ ఈజీగానే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం 1,44,510 మంది దరఖాస్తు చేసుకోగా 1,33,442 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 1,02,012 మంది దరఖాస్తు చేసుకోగా 89,792 మంది హాజరయ్యారు.
ఈసారి ఇంజనీరింగ్ కంటే అగ్రికల్చర్ మెడికల్‌లోనే ఎక్కువ మంది గైర్హాజరవడం గమనార్హం. కాగా, ఇంజనీరింగ్ పరీక్షకు సెట్‌కోడ్ ‘క్యూ’ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపిక చేయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు సెట్‌కోడ్ ‘ఎస్’ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన 470 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరి బయో మెట్రిక్ డాటాను (వేలి ముద్రలు, డిజిటల్ ఫొటోలు) సేకరించారు.
సులభంగా ప్రశ్నలు
ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో ప్రశ్నలు గతేడాది కంటే ఈసారి సులభంగా వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌తో పోల్చినా సులభంగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులైతే 160కి 160 మార్కులు పొందే వీలు ఉందని అంచనా వేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీలో డెరైక్ట్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని, దీంతో విద్యార్థులు ఎక్కువ మార్కులను స్కోర్ చేసే వీలు ఏర్పడిందని పేర్కొంటున్నారు. గణితంలో యావరేజ్‌గా చాలా మందికి 55 నుంచి 60 మార్కులు వచ్చే వీలుందన్నారు. ప్రతిభావంతులైతే 80కి 80 మార్కులు సాధిస్తారంటున్నారు.
మ్యాథ్స్‌లో ఆరు ప్రశ్నలు, కెమిస్ట్రీలో ఆరు ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని నిపుణులు వెల్లడించారు. గతేడాది ఈ రెండు సబ్జెక్టుల్లో 20 ప్రశ్నల వరకు ఎక్కువ సమయం తీసుకునేవి వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశ్నల్లో ఎక్కడా తప్పులు లేకపోయినా గణితంలో ‘బీ’ కోడ్ ప్రశ్నపత్రంలో 65వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో జవాబు లేదని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. అదే బీ కోడ్ ప్రశ్నపత్రంలోని 62 ప్రశ్నకు (సీ కోడ్‌లో 16వ ప్రశ్న) ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో రెండు సరైన జవాబులున్న ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక కెమిస్ట్రీలో బీ కోడ్ ప్రశ్నపత్రంలోని 136వ ప్రశ్నకు (సీ కోడ్‌లో 125 ప్రశ్న) ఇచ్చిన ఆప్షన్లలో మూడు సరైన సమాధానాలు ఉన్నవే ఇచ్చినట్లు వివరించారు.
భవిష్యత్తులో ఆన్‌లైన్‌వైపే మొగ్గు
రాష్ట్రంలో మొదటిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. భవిష్యత్తులో ఇక అన్ని ఆన్‌లైన్ పరీక్షలే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రంలో వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తింది. దీంతో జనరేటర్ పనిచేయకపోవడంతో 36 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి వెంటనే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించినట్లు రమణరావు తెలిపారు. ఉస్మానియాలో 154 మందికి 6 ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆన్‌లైన్ సమస్య తలెత్తితే వెంటనే ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముందే చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు 534 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 444 మంది హాజరయ్యారు. కొందరు విద్యార్థులు కొన్ని పరీక్ష కే ంద్రాల్లో పాత హాల్‌టికెట్లతో వచ్చినా వారికి బఫర్ ఓఎంఆర్ జవాబు పత్రం ఇచ్చి పరీక్షకు అనుమతించారు. మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని వెల్లడించారు.
‘కీ’పై 18 వరకు అభ్యంతరాల స్వీకరణ
ప్రాథమిక కీని ఎంసెట్ వెబ్‌సైట్ www.tseamcet.inలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వాటిపై తమ అభ్యంతరాలను ఈ నెల 18 వరకు ఇ-మెయిల్ www.tseamcet.in ద్వారా పంపించవచ్చని ఎంసెట్ కన్వీనర్ వివరించారు.
ఏపీ కేంద్రాల్లో తక్కువ హాజరు
టీఎంసెట్ కోసం ఏపీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో తెలంగాణతో పోలిస్తే హాజరు శాతం తక్కువగా నమోదైంది. కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఇంజనీరింగ్ పరీక్షకు 18,047 మంది దరఖాస్తు చేసుకోగా.. 13,074 మంది (72.44 శాతం) హాజరయ్యారు. 4,973 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 27,029 మంది దరఖాస్తు చేయగా.. 21,301 మంది (78.80 శాతం) హాజరయ్యారు.
20న ఎంసెట్ ర్యాంకులు!
ఎంసెట్ ర్యాంకులను ఈ నెల 20న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను 19న ఖరారు చేయాలని భావిస్తోంది. 19న ఆ పనులు పూర్తయితే 20న ర్యాంకులను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే 21, 22 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వ కేంద్రాల్లో పక్కాగా పరీక్ష
ప్రభుత్వ విద్యా సంస్థలు, శిక్షణ సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంసెట్‌ను పక్కాగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటిసారిగా కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే 470 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు పరీక్ష కేంద్రాలను వెతుక్కోవడంలో అక్కడక్కడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎంసెట్ కమిటీ అధికారులు పరీక్షలకు ముందురోజు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు శనివారం కురిసిన వర్షం, గాలి కారణంగా కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌లో పలు పరీక్ష కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలవడం, వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెస్ట్‌మారేడుపల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ కాలేజీలో వైర్లు తెగి పడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడి ంది. నిమిషం నిబంధనతో కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, నిజాం కాలే జీలో ఇద్దరు అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు.