ఇన్నాళ్లకు కూడా బితుకు బితుకే. సిగ్గుతో చితుకు చితుకే. మూడురోజుల నెలసరి తప్పు కాదు. నేరం కాదు. పాపమూ కాదు. అది ప్రకృతి. దేహ ప్రవృత్తి. దానికి శానిటరీ ప్యాడ్ వాడాలని తెలియదు కొందరికి. తెలిసినా ధైర్యంగా కొనే ధీమా ఉండదు అందరికీ. ఊర్లో ఈ పరిస్థితిని భూమా రెడ్డి గమనించాడు. వారికి ధీమా ఇవ్వడానికి సంకల్పించాడు. ఆడపిల్లల పాలిట అతడో ప్యాడ్ మ్యాన్.
‘అంకుల్.. టెన్ రుపీస్‌ది ఒక డెయిరీ మిల్క్ ఇవ్వరా?’ అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చింది ఓ అమ్మాయి.
దుకాణందారు ఆ నోటు తీసుకుంటూండగా అందులోంచి కాగితం మడత కింద పడింది. ‘అంకుల్ ఒక విష్పర్‌ను పేపర్‌లో చుట్టి క్యారీబ్యాగ్‌లో పెట్టివ్వరా?’ అని రాసుంది అందులో. విష్పర్‌ను ప్యాక్ చేసి ఇచ్చాడు షాప్ యజమాని. అతనికిది కొత్తకాదు. చాలా మంది ఆడపిల్లలు అలాగే స్లిప్ మీద రాసిస్తారు. ధైర్యంగా ‘శానిటరీ పాడ్స్’ కావాలని అడగరు. ‘బిస్కెట్‌లు, పెన్‌లు, బిందీల్లా ఇదీ అవసరమే కదా! ఎందుకు గట్టిగా అడగరు. ఎందుకంత సిగ్గు? దీన్నెట్లా పోగొట్టాలి?’ అనే ఆలోచనలో పట్టాడు ఆ షాప్ యజమాని.
అతని పేరు చిట్యాల భూమారెడ్డి. దుకాణదారు. జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలం, లచ్చక్కపేట అతని సొంతూరు. ఆ ఊర్లో మహిళల నెలసరి అవసరం పట్ల ఉన్న సిగ్గును, మొహమాటాన్ని దూరం చేయాలి అనుకున్నాడు అతను. అంతే కాదు శానిటరీ పాడ్స్ తయారు చేయడానికి కూడా సంకల్పించాడు.
అధ్యయనం... ఆచరణ
రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చాక శానిటరీ ప్యాడ్స్‌కు సంబంధించి తన ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాడు. తన ఊళ్లో ఈ ప్యాడ్స్ అడగడానికి మొహమాటపడుతుంటే చుట్టుపక్కల ఊళ్లలో వీటి ఉపయోగం చాలా తక్కువగా ఉందని తెలిసింది అతనికి. నెలసరి సమయంలో శుభ్రత లోపించి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చిన్న వయసులోనే గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకి గురైన కేసులూ ఎక్కువే అని తేలింది. వీటన్నిటికీ పరిష్కారం బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వాడకం మీద చైతన్యం తేవడం, అలాంటి ప్యాడ్స్ తయారు చేసి తక్కువ ధరకు పంపిణీ చేయడమే అనుకున్నాడు. వాటిని తయారు చేయడమెలాగో తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు.
ఇంటి నుంచి మొదలు
భూమారెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి ఒక మిత్రుడికి తెలిసింది. ‘అలాంటి ప్యాడ్స్ తయారు చేసే యూనిట్ మహబూబ్‌నగర్‌లో ఉన్నట్టుంది కనుక్కో’ అని సూచించాడు. ఆ మాటతో మహబూబ్ నగర్ వెళ్లాడు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఓ ఇరవై మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళలకు ఆర్థిక ఆసరా కోసం శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కుటీర పరిశ్రమ పెట్టించారు తన పర్సనల్ ఫండింగ్‌తో. ఆ మహిళలు తయారైతే చేస్తున్నారు కాని వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నట్టు అర్థమైంది భూమారెడ్డికి. దాంతో ప్యాడ్‌ల తయారీ, మార్కెటింగ్‌కు తనెలాంటి ప్రణాళిక చేసుకోవాలో అవగతమైంది. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్, మెటీరియల్ వంటి వివరాలన్నీ తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మెషీన్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు.
తాము తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్‌తో భీమా రెడ్డి బృందం
పరిశుభ్రమైన వాతావరణం మధ్య ఇంట్లోని హాలులోనే మెషిన్ ఫిట్ చేయించాడు. మహబూబ్‌నగర్ యూనిట్‌లో తను, కుమార్తె, భార్య శిక్షణ తీసుకుని అలా దాదాపు పదకొండు నెలల శ్రమ తర్వాత 2019, డిసెంబర్‌లో కుటీరపరిశ్రమ ప్రారంభించాడు. ప్రస్తుతం అతని యూనిట్‌లో నలుగురు మహిళలకు ఉపాధి కలిగిస్తున్నాడు. భూమారెడ్డి తయారు చేస్తున్నవి పూర్తి పర్యావరణహితమైనవి. ఆరు ప్యాడ్స్ ఉన్న ప్యాక్ 35 రూపాయలకు అందిస్తున్నాడు. ఒకవేళ మహిళలు ఎవరైనా వీటిని మార్కెట్ చేయాలనుకుంటే కూడా 30 రూపాయలకే అందిస్తున్నారు. ‘ఈ ప్యాడ్స్‌లో అలోవెరా, వుడ్ పల్ప్, నెట్ షీట్‌ను వాడుతున్నాం. అచ్చం ఈ మెటీరియల్‌తో ఇలాగే తయారైన బ్రాండెడ్ పాడ్స్ ఆరింటి ప్యాక్ ధర 70 రూపాయలు’ అని చెప్తున్నాడు భూమారెడ్డి.
వ్యాపారం కోసం కాదు... ఉపయోగం కోసమే!
‘దీన్నో వ్యాపారంగా చూడట్లేదు మేము. ఆడవాళ్లకు ఉపయోగపడే పనిలా చూస్తున్నాం. అందుకే మా దగ్గరకు ప్యాడ్స్ కోసం వచ్చే అమ్మాయిలు ధైర్యంగా వీటి గురించి అడిగేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మగవాళ్లకూ అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయితీ ఆఫీస్‌లో అవగాహన కార్యక్రమాలు పెట్టడమే కాదు ఇల్లుల్లూ తిరిగీ ప్యాడ్స్ వాడకం మీద, నెలొచ్చినప్పుడు పాటించే శుభ్రత గురిచీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ప్యాడ్స్ వాడండి అని చెప్తున్నాం కాని మా దగ్గర తయారైన ప్యాడ్సే వాడండి అని చెప్పట్లేదు’ అంటున్నారు భర్త బాధ్యతల్లో సమపాలు తీసుకున్న భూమారెడ్డి భార్య లావణ్య. ‘మహిళ అరోగ్యాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి. ఈ ఆలోచన ఉన్నవాళ్లందరితో కలిసి పనిచేయడానికి సిద్ధం’ అంటున్నారు ఈ భార్యాభర్త.
ఫెయిల్యూర్‌లోంచి సక్సెస్
భూమారెడ్డి ఓ మధ్యతరగతి రైతు. 2001లో ఎమ్‌పిటీసీగా, సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ కన్‌స్ట్రక్షన్ లేబర్‌గా, ఫోర్‌మన్‌గా పనిచేసి నాలుగున్నరేళ్లకు మళ్లీ ఇండియా వచ్చాడు. మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. కాని రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకొని కేబుల్ టీవీ సెంటర్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పెట్టుకున్నాడు. అప్పుడే ఆడపిల్లల ఇబ్బంది చూసి శానిటరీ ప్యాడ్స్ కుటీర పరిశ్రమవైపు మళ్లాడు. మొదటి నుంచీ సామాజిక స్పృహ, బాధ్యత ఎక్కువగానే ఉన్న భూమారెడ్డికి భార్య సహకారమూ తోడవడంతో దాన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు.
చిట్యాల భూమారెడ్డి
బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న భీమారెడ్డి, అతని భార్య లావణ్య...
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment