ఒక వ్యక్తి.. వంద బృందాలు | Bollywood Producer Chitra Subramaniyan Distributing | Sakshi
Sakshi News home page

ఒక వ్యక్తి ..వంద బృందాలు

Published Sun, Nov 22 2020 4:45 AM | Last Updated on Sun, Nov 22 2020 4:48 AM

Bollywood Producer Chitra Subramaniyan Distributing  - Sakshi

ఆమె లాక్‌డౌన్‌ సమయంలో మహిళా పోలీసుల టాయ్‌లెట్‌ అవసరాలకు 20 వానిటీ వాన్‌లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ బాధిత మహిళల కోసం సహాయానికి ‘దాన ఉత్సవం’ అంటూ పిలుపు ఇచ్చి సహాయం అందేలా చూసింది. ఇప్పుడు ఆమె ‘పాడ్‌ స్క్వాడ్‌’ పేరుతో దేశంలోని దిగువ మధ్యతరగతి స్త్రీలకు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్‌ అందేలా మొదలెట్టిన ఉద్యమం అనేక  బృందాలుగా ఎదిగి ప్యాడ్స్‌ పంపకం చేస్తోంది.ఆమె పేరు చిత్రా సుబ్రమణియన్‌. బాలీవుడ్‌లో నిర్మాత. సామాజిక కార్యకర్త.

మార్చిలో లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్‌ భయోత్పాతం సృష్టిస్తూ ఉంది. అయినా సరే పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. మహిళా పోలీసులకు మినహాయింపు లేదు. ముంబై నగరంలో వందల మంది మహిళా పోలీసులు లాక్‌డౌన్‌ అమలు కోసం గస్తీ తిరుగుతున్నారు. వారు కొంత ఫ్రెష్‌ అవడానికి, టాయిలెట్‌ అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పాటు ఏమిటి అనే అక్కర వచ్చింది చిత్రా సుబ్రమణియన్‌కు. ఆమె బాలీవుడ్‌లో నిర్మాత. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వం వహించిన ‘కార్పొరేట్‌’కు, అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ‘రిటర్న్‌ ఆఫ్‌ హనుమాన్‌’ సినిమాలకు ఒక నిర్మాతగా వ్యవహరించింది.

అయితే సినిమా రంగంతో పాటు సామాజిక రంగాలలో కూడా ఆమె పని చేస్తోంది. అందుకని వెంటనే ఆమె ముంబై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మాట్లాడి ప్రొడక్షన్‌ కోసం పని చేస్తూ లాక్‌డౌన్‌ వల్ల ఖాళీగా ఉన్న 20 వానిటీ వ్యాన్లను తన ఖర్చు మీద ముంబై వీధుల్లోకి దింపింది. దీనికి ఆమె చేసిన నామకరణం ‘మిషన్‌ సురక్ష’. నగరంలోని మూలమూలకు తిరుగుతూ మహిళా డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు వీటిని ఉపయోగించే విధంగా చేయడంతో చిత్రా సుబ్రమణియన్‌ పేరు విశేషంగా ప్రశంసకు నోచుకుంది.

ప్యాడ్‌ స్క్వాడ్‌
లాక్‌డౌన్‌ సమయంలో ‘అత్యవసర వస్తువుల’ పట్టికలో శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వం చేర్చకపోవడం వల్ల వాటిని తయారు చేసే చిన్న పెద్ద తరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వం మేల్కొని వాటిని చేర్చే లోపల ప్యాడ్స్‌ ఉత్పత్తికి చెప్పుకోదగ్గ విఘాతమే జరిగింది. ఆ సమయంలో కొనుగోలు శక్తి ఉన్నవారికి ప్యాడ్స్‌ దొరక్కపోవడాన్ని చిత్ర సుబ్రమణియన్‌ గమనించింది. వీరి పరిస్థితే ఇలా ఉంటే ఆర్థిక వెనుకబాటుతనం ఉన్న వర్గాల స్త్రీలు, బాలికలు ఏం ఇబ్బందులు పడుతున్నారో అని ఆమెకు అనిపించింది. దాని నుంచి ఆమెకు వచ్చిన ఆలోచనే ‘ప్యాడ్‌ స్క్వాడ్‌’ స్థాపన. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక వెనుకబాటు వర్గాల స్త్రీలకు, యువతులకు, బాలికలకు ప్యాడ్స్‌ అందాలన్న లక్ష్యంతో జూన్‌లో ఆమె ప్యాడ్‌ స్క్వాడ్‌ను ముంబైలోని తోటి మిత్రులతో స్థాపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో మౌలిక స్థాయిలో పని చేస్తున్న ఎన్‌.జి.ఓలను సంప్రదించి తాము ప్యాడ్స్‌ పంపుతామని, అవసరమున్న ప్రతి ఒక్కరికీ అందించాలని కోరింది. వారు ఒప్పుకున్నారు.

సోషల్‌ మీడియా ఆయుధంగా
చిత్రా సుబ్రమణియన్‌ సోషల్‌ మీడియా ఆధారంగా ‘ప్యాడ్‌ స్క్వాడ్‌’ గురించి ప్రచారంలోకి తెచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు ఆమె తమ వంతు సహాయంగా ముందుకు వచ్చారు. వీరికి ‘ప్యాడ్‌ స్క్వాడర్స్‌’ అనే పేరు పెట్టింది. వీరు విరాళాల రూపంలో వివిధ బృందాల నుంచి, వ్యక్తుల నుంచి, దాతల నుంచి ప్యాడ్స్‌ సేకరించారు. ఇప్పటి వరకూ మొత్తం 5 లక్షల ప్యాడ్స్‌ను ఇప్పటి వరకూ పంపిణీ చేశారు. ముంబై, పూణె, ఢిల్లీ, జబల్‌పూర్, హుబ్లీ, సుందర్‌బన్స్, కోల్‌కటా ఇత్యాది ప్రాంతాల్లో చిత్రా సుబ్రమణియన్‌తో చేతులు కలిపిన బృందాలు ఎక్కడికక్కడ ప్యాడ్స్‌ను పంచాయి.

ఇంటింటా ప్యాడ్‌ పెట్టె
స్త్రీల నెలసరి అవసరాలు ఒక నెలతో తీరేవి కాదు. ప్రతి నెలా ప్యాడ్స్‌ కావాల్సిందే. అలాగే ఎప్పటికప్పుడు రుతుచక్రంలోకి ప్రవేశించే బాలికలు కూడా ఉంటారు. ‘బహిష్టు సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి ప్రచారం చేయడం ఒక పని అయితే శానిటరీ ప్యాడ్స్‌ వాడాల్సిన అవసరాన్ని తెలియచేయడం వారికి అవి అలవాటు చేయడం మరో పని’ అంటారు చిత్రా సుబ్రమణియన్‌. అందుకే ఆమె తన ప్యాడ్‌ స్క్వాడర్స్‌ను ఒక చిట్కా పాటించమని చెప్పారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్లలో కాలనీల్లో అందరికీ తెలిసేలా ఒకచోట ‘ప్యాడ్‌ పెట్టె’ను పెట్టమని చెప్పారు. పురుషులైనా స్త్రీలైనా తమ వంతుగా తాము విరాళం ఇవ్వదగినన్ని ప్యాడ్స్‌ కొని ఆ పెట్టెలో వేయాలి. పెట్టె నిండాక వాటిని పంచడానికి తీసుకు వెళతారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే చిత్రకు తోడు నిలిచిన మిత్రులు తమ ఇళ్లల్లో కాలనీల్లో ప్యాడ్‌ పెట్టెను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘డబ్బులు ఇస్తే దుర్వినియోగం అవుతాయని కొందరికి సందేహం ఉంటుంది. ఇవి ప్యాడ్స్‌ కాబట్టి అందరూ కొని డబ్బాలో వేశారు’ అని చిత్రా చెప్పారు.

ఇది మాత్రమే కాక చిత్రా సుబ్రమణియన్‌ మహారాష్ట్రలో సాగుతున్న ‘శ్రామిక్‌ సమ్మాన్‌’ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వలస కూలీలకు ఉపాధి చూపే కార్యక్రమం ఇది. అంతే కాక లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ముంబైలో సాగుతున్న కమ్యూనిటీ కిచెన్స్‌కు కూడా తన వంతు సహాయం అందిస్తున్నారు.
చిత్రా సుబ్రమణియన్‌ చేస్తున్నది మంచిపని. ఏ మంచిపని అయినా ఒంటరిది కాదు. కదిలి వస్తున్న చేతులతో ఈ పని రోజురోజుకూ విస్తృతం అవుతూనే ఉంది. అవడమూ ఖాయమే.

డింపుల్‌ కౌర్‌ ప్యాడ్‌ దీదీ
భిలాయ్‌ మురికివాడల్లోని మహిళలు డింపుల్‌ కౌర్‌ను అభిమానంగా ‘ప్యాడ్‌ దీదీ’ అని పిలవడం వెనుక ఉన్న కారణం లక్షల మందికి ఆమె ఉచితంగా ప్యాడ్‌లను పంపిణీ చేయడం మాత్రమే కాదు. స్త్రీల ఆరోగ్య సమస్యలపై ఆమె ఆ మహిళలను చైతన్యవంతులను చేయడం కూడా. 

కుటుంబంలో ఒక అక్క ఉంటే చెల్లెళ్లకు చాలా సమస్యలకు పరిష్కారాలు తెలుస్తాయి. ఛత్తీస్‌గడ్‌లోని భిలాయ్‌లో ఉంటున్న 49 ఏళ్ల డింపుల్‌ కౌర్‌ తన కుటుంబంలోని వారు కాని ఎంతోమంది చెల్లెళ్ల సమస్యలను పరిష్కరించాలనుకుంది. వారు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలనుకుంది. పాఠశాలలు, కళాశాలలు, మురికివాడలలో ఉన్న మహిళలను, బాలికలను కలిసి ఇప్పటివరకు 5 లక్షల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాదు, రుతుక్రమంలో వచ్చే సమస్యలు, సలహాలు సూచనలు ఇస్తోంది. దీంతో ఇక్కడి మహిళలంతా డింపుల్‌ కౌర్‌ను అభిమానంగా ‘ప్యాడ్‌ దీదీ’ అని పిలుస్తున్నారు!

డిపుల్‌ కౌర్‌ ‘అనుభూతి శ్రీ ఫౌండేషన్‌’ పేరుతో 2016 లో ఎన్జీవోను ప్రారంభించింది. ఈ ఎన్జీవో ద్వారా చత్తీస్‌గడ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ మురికివాడల్లోని మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిలను పంపిణీ చేస్తోంది. ‘జీవితంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు, వాటి నుండి బయటకు రావడానికి పరిష్కారాలు మాత్రమే చూడాలి’ అంటుంది కౌర్‌. నాలుగేళ్లలో డింపుల్‌ కౌర్‌ పాఠశాలలు, కళాశాలలు, మురికివాడల్లో 5 లక్షల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. 

ఏడు నెలల్లో మూడు ఆపరేషన్లు!
రుతుక్రమ సమస్య వల్ల డింపుల్‌కి ఏడు నెలల్లో మూడు ఆపరేషన్లు జరిగాయి. తన సమస్య గురించి ప్రస్తావించిన డింపుల్‌ – ‘నేను చాలా కాలం రుతుక్రమ సమస్యతో బాధపడ్డాను. దీని గురించి మా కుటుంబంలో పెద్దలకు అవగాహన లేదు. రుతుక్రమ లోపాల వల్ల కలిగే హాని గురించి తెలియకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను. నేటికీ చాలా మంది విద్యావంతులైన మహిళలకూ రుతుక్రమ లోపాల గురించి సరిగా తెలియదని గమనించాను.

మీకు రుతుక్రమంలో సమస్య ఉంటే, సరైన సమయంలో వైద్యుడిని కలిసి వారి సూచనలు తీసుకోండి. నిర్లక్ష్యం చేయకండి’ అని తను వెళ్లిన ప్రతీచోటా చెబుతోంది డింపుల్‌. నాలుగేళ్లుగా మూడు రాష్ట్రాల్లోని 40 పాఠశాలల్లో ప్యాడ్లను పంపిణీ చేసింది కౌర్‌. ఆమె ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ బ్రాంచీలు కుజబల్‌పూర్, జంషెడ్‌పూర్‌లలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆమె తన మిషన్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించింది. తన బృందంతో కలిసి వలస కార్మిక మహిళలకు 20,000 ప్యాడ్లను పంపిణీ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది.  
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement