పాటల వీడియోలు..పిపిఇ కిట్లు | Special Story About Ankita From Pune | Sakshi
Sakshi News home page

పాటల వీడియోలు..పిపిఇ కిట్లు

Published Mon, Aug 10 2020 1:41 AM | Last Updated on Mon, Aug 10 2020 4:28 AM

Special Story About Ankita From Pune - Sakshi

ఈ మహమ్మారి కాలంలో ఓ చిన్న సాయం కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల కష్టాలకు చలించిన ఓ వైద్య విద్యార్థి వినూత్నంగా ఆలోచించి తన వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. కరోనా పోరాటంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు ఉచితంగా పిపిఇ కిట్లు ఇవ్వాలని నిశ్చయించుకుంది. అందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంది. స్నేహితులతో కలిసి ‘సౌండ్‌’ అని పేరుతో రెండు నెలలుగా పాటల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అంకిత పూణేలోని భారతీయ విద్యాపీఠ్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని. రెండు నెలలుగా సోషల్‌ మీడియాలో ఆమె చేస్తున్న సంగీత ప్రచారం సక్సెస్‌ అయ్యింది. ఈ ప్రచారంలో వచ్చిన మొత్తంతో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్‌ షీల్డ్, పిపిఇ కిట్లు ఇచ్చింది.  

ఎనిమిది మంది బృందంగా
తన ఎనిమిది మంది స్నేహితులతో అంకిత ఈ సంగీత ప్రచారాన్ని ప్రారంభించింది. అందుకు కాలేజీ బ్యాండ్‌ సభ్యుల సహాయాన్ని తీసుకుంది. 60 కి పైగా వివిధ భాషలలో గల ప్రసిద్ధ పాటల వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ప్రజల కోరిన విధంగా ఈ వీడియోలను రూపొందించింది. ఒక అమ్మాయి తన ప్రేమికుడికి ఇష్టమైన పాటల వీడియో పంపించాలనుకుంటే, అంకిత తన స్నేహితులతో కలిసి వారికి ఆ పాటల వీడియోను పంపుతుంది. దీనికి బదులుగా, ఆమె ఒక కస్టమర్‌ నుండి 55 రూపాయలు తీసుకుంటుంది. ఆ మొత్తంతో ఒక ఫేస్‌ షీల్డ్‌ వస్తుంది. 
ఉచితంగా పిపిఇ కిట్లు
అంకిత తన ప్రచారం ద్వారా మొదటి రోజు రూ. 28,000 వసూలు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ మొత్తం పెరిగింది. ఈ వీడియోలు 3,000 మంది వరకు కొనుగోలు చేశారు. ఈ విధంగా నిధులను కూడబెట్టి, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణా సెషన్ల కోసం కర్ణాటక ప్రభుత్వానికి అంకిత 300 ఫేస్‌ షీల్డ్‌లను అందించింది. గ్రేటర్‌ ముంబై మున్సిపల్‌ కమిషన్‌ హెల్త్‌ కేర్‌ వైద్యుల కోసం 1000 పిపిఇ కిట్లను సరఫరా చేసింది. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్‌ కాలేజీకి 300 పిపిఇ కిట్లను ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పాల్ఘర్‌లోని కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డ్‌ కోసం 500 పిపిఇ కిట్లను ఇవ్వడానికి ప్లాన్‌ చేస్తోంది.  

ఒంటరితనం దూరం
అంకితకు చాలా మంది కాలేజీ స్నేహితులు ఉన్నారు. మొదటి విరాళం కాలేజీ విద్యార్థి నుండే తీసుకుంది. కరోనా కాలంలో అందరూ వారి వారి ఇళ్లలోనే ఉన్నారు. స్నేహితుల ఒంటరితనం, చింతను అధిగమించడానికి అంకిత మొదట్లో వారికి నచ్చిన పాటలను తయారు చేసి వీడియోలను ఇచ్చింది. ఈ విధంగా వారిని సంతోషపెట్టడంలో తను ఆనందం పొందింది. ఈ ఆలోచన నుంచే వీడియోలను సామాజిక మాధ్యమంలో ఉంచి నిధుల సేకరణకు పూనుకుంది.

కస్టమర్‌ ఫొటోలు
ఎవరైనా తమకు నచ్చినవిధంగా వీడియోలు కావాలంటే అలాగే తయారుచేసి ఇస్తుంది. పైగా కస్టమర్లు తమ ఫొటోలను షేర్‌ చేస్తే వాటిని సరైన విధంగా డిజైన్‌ చేసి, వీడియోల మీద అతికించి ఇస్తుంది. రెండు నెలల క్రితం ఫ్రెండ్‌ వని ఘాయ్‌తో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న స్నేహితులనూ చేర్చింది. ఆ తర్వాత ప్రజలను తమ వీడియోల వైపు ఆకర్షించేలా డిజైన్‌ చేసింది. ఈ వీడియోలు లాక్డౌన్‌ జ్ఞాపకంగా దాచుకోవచ్చని తన వ్యూవర్స్‌కి చెప్పింది. ఈ వీడియోలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అంకిత అనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కష్టకాలంలో ఇతరులకు సాయం చేయాలన్న ఒక చిన్న ఆలోచన అంకితను సేవా మార్గంలో ఆనందంగా పయనింపజేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement