సాక్షి, ముంబై : కరోనా సృష్టించిన వినాశనం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న దేశం మరోసారి లాక్‌డౌన్ బాటపట్టక తప్పదనిపిస్తోంది. గడిచిన పదిరోజులుగా దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా.. పాజిటివ్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసుల్లో అకస్మాత్తుగా పెరగడం వైద్యశాఖ అధికారులకు తలనొప్పగా మారింది. ఒక్క మహారాష్ట్రలోనే శనివారం 6 వేలకుపైగా నమోదుకాగా, కేరళలో 4,820 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధపడుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరడటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కోవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడంలేదు. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌ను అరికట్టేందుకు మరోసారి లాక్‌డౌన్ మంత్రాన్నే పాటించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గతవారం రోజులుగా పూణెలో పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూణె పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతుందని స్థానిక అధికారులు తెలిపారు. అలాగే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలను సైతం మూసివేశారు. ఫిబ్రవరి 28 వరకు మూసివేత కార్యక్రమం కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే నాగపూర్, యావత్‌మాల్, అమరావతిలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ శనివారం పలు సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా ఆదేశాలు జారీచేయాలన్నారు.
మహారాష్ట్రలో కొత్తగా 6,281 కోవిడ్ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,93,913 కు చేరుకుంది. 27 శాతం ముంబై, అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అలాగే, శనివారం ఒక్కరోజే 2,567 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 19,92,530కి పెరిగింది. కొత్తగా 40 కరోనా మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 51,753కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,52,742 కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 48,439 క్రియాశీల కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఒక్క ముంబైలోనే కొత్తగా 897 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ ఇప్పటివరకు అక్కడ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 3,18,207 అయింది. మహారాష్ట్ర రికవరీ రేటు 95.83 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.50 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. తెలిపారు.
థానేలో ఇప్పటివరకు 2,49,566 మంది కరోనా బాధితులు కోలుకున్నారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో రికవరీ రేటు 96.11 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక థానేలో శనివారం 471 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 2,59,668 కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. శనివారం జిల్లాలో ఎనిమిది మంది కోవిడ్ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 6,227 కి చేరిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3,875 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.40 గా ఉంది. పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఇప్పటివరకు 45,646 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 1,202 మంది మరణించినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు.
ముంబై నగరంలో పెరుగుతున్న కొత్త కరోనా కేసుల్లో భవనాల్లో నివసించే వారిలో ఎక్కువ నమోదవుతున్నాయని బీఎంసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు మురికివాడల్లో ఎక్కువ నమోదైన కేసులు ఇప్పుడు భవనాల్లో వెలుగుచూస్తున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన నగరంలో 328 కొత్త కేసుల్ని గుర్తించగా 18వ తేదీన 66 శాతం పెరుగుదలతో ఆ సంఖ్య 823కు చేరుకుందనే ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త కేసుల్లో 90 శాతం భవనాల్లో నివసించేవారే ఉన్నారని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణీ వెల్లడించారు. ముంబైకర్లు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment