పుణే: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్ డెలవరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్‌కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.
పార్క్‌లు క్లోజ్..
పుణే పట్టణంలో ఉన్న అన్ని రకాల పార్కులు సాయంత్రం వెళల్లో మూసివేయాలని, ఉదయం సమయాల్లో వాకర్స్ కోసం తెరవాలని కమిషనర్ సౌరభ్ రావు ఆదేశించారు. మాల్స్, మల్లీప్లెక్స్‌లకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన విషయాలపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పుణే నగరంలో కేసుల సంఖ్య, ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నందున 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలన్న విధాన నిర్ణయం కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని అధికారులు యోచిస్తున్నామని ఆయన వివరించారు. ఒకవేళ పుణేకు అదనపు వ్యాక్సిన్ డోసులు కేంద్రం కేటాయించాలని నిర్ణయం తీసుకుంటే, దానికి అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేస్తామని తెలిపారు. చదవండి: (కేసులు పెరిగితే లాక్‌డౌన్ తప్పదు: సీఎం)
నిబంధనలు పాటించకపోవడం వల్లే..
కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే పుణే నగరంలో కేసుల సంఖ్య పెరుగుతోందని, దీని కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కోవిడ్–19 చికిత్స కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో సరిపడినంత పడకలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెరుగుతున్నందున, 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, దీని కోసం అత్యధిక డోసులు అవసరమవుతాయని పేర్కొన్నా రు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పుణే ఎంపీ గిరీశ్ బాపట్, మార్వెల్‌ఎంపీ శ్రీరాగ్ బర్నేలను కోరుతానని, అలాగే ఎంపీలు అమోల్ కోల్హే, సుప్రియా సూలేల వద్ద కూడా ఈ విషయాన్ని లెవనెత్తుతానని పేర్కొన్నారు.
పెద్ద భవనాల్లోనే 90 శాతం కేసులు
►మొదటి 2 నెలల్లో ఎక్కువ కేసులు అక్కడి నుంచే
►మార్చి నుంచి మురికివాడల్లోనూ పెరుగుతున్న కేసులు
ముంబై: నగరంలోని ఆకాశహర్మ్యాల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని నగర పాలక సంస్థ తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొత్తగా కరోనా సోకినవారిలో 90 శాతం మంది ఎత్తయిన భవంతుల్లో ఉంటున్నవారేనని పేర్కొంది. మిగతా 10 శాతం మంది మురికివాడలు, ఇతర ప్రాంతాలవారని వివరించింది. అయితే, ఈ నెలలో మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందని, ఈసారి మురికివాడల్లో ఉంటూ కోవిడ్–19 సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 23,002 మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందని, ఇందులో 90 శాతం మంది పెద్దపెద్ద భవంతుల్లో నివసించేవారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ నెల ప్రారంభం నుంచి నగరంలో కంటైన్మెంట్ జోన్లు 170 శాతం, సీల్ చేసిన భవంతుల సంఖ్య 66.42 శాతం పెరిగినట్లు పేర్కొంది. బీఎంసీ కోవిడ్–19 డ్యాష్‌బోర్డు ప్రకారం మార్చి 1 నాటికి నగరంలో 10 కంటైన్మెంట్ జోన్లు, 137 సీల్ చేసిన భవంతులు ఉన్నాయని, కానీ మార్చి 10నాటికి కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 27కు, సీల్ చేసిన భవంతుల సంఖ్య 228కి పెరిగింది. ఈ జోన్ల్ల పరిధిలో నివసించే 7.46 లక్షల మందిలో 23 శాతం మంది మురికివాడల నుంచి, మిగతా 77 శాతం సీల్ చేసిన భవంతుల నుంచి ఉన్నారు. కాగా, మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దీన్ని భారీ పెరుగుదల అనలేమని బీఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కోవిడ్ బాధితులు అన్ని మురికివాడల్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకు ముంబైలో 3,38,631 మంది కరోనా సోకగా, 11,515 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment