లాక్‌డౌన్ తర్వాత అందరూ బయటికొచ్చారు. కానీ లాక్‌డౌన్ సమయంలో బాధలు పడిన వారి మాటేమిటి? ప్రచారం మరిచిన కోవిడ్ సంగతి ఏమిటి? అసలు దేశం ఎలా ఉంది? చూద్దాం పద అనుకున్నారు ఢిల్లీకి చెందిన నేహా చతుర్వేది. ముంబై నుంచి ఇద్దరు స్నేహితులు మేమూ వస్తాం అన్నారు. వాహనమే ఇల్లుగా 60 రోజుల్లో 25000 కిలోమీటర్లు ప్రయాణించి ముప్పై రాష్ట్రాలు చుట్టి లాక్‌డౌన్ బాధితుల కోసం ఫండ్స్ రైజ్ చేసే పని మొదలెట్టారు. అక్టోబర్ 4న మొదలైన వారి ప్రయాణం ప్రస్తుతం నాగాలాండ్‌కు చేరింది. ఇంతకూ వీరు ఏం చూశారు?
ఆ మనుషులు ఏమయ్యారో. వేల కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వెళ్లిన మనుషులు. లాక్‌డౌన్ సమయంలో హటాత్తుగా మూతపడిన పనిస్థలాల్లో జరుగుబాటు లేక ఆకలికి తాళలేక ఉన్నది మూటగట్టి నెత్తిన పెట్టుకొని తమ కాళ్లనే వాహనంగా చేసుకొని వేలాది కిలోమీటర్లు నడిచిన వలస కూలీలు. పిల్లల్ని మోసిన తల్లులు. తండ్రుల్ని వీపున మూటగట్టుకుని నడిచిన పిల్లలు. వారంతా ఏమయ్యారు.. ఎలా ఉన్నారు... వారికి ఎలాంటి సాయం కావాలి... అని సందేహం వచ్చింది ఢిల్లీకి చెందిన నేహా చతుర్వేదికి. ఆమె ఎన్.జి.ఓ కార్యకలాపాలలో పాల్గొంటుంది. ఢిల్లీలోని వివిధ సమూహాల్లో పని చేస్తుంటుంది. కానీ లాక్‌డౌన్ సమయంలో అంతో ఇంతో అందిన సాయం అన్‌లాక్ మొదలయ్యాక అందడం లేదని గ్రహించింది.
తనకు అనుబంధం ఉన్న కోవిడ్ బాధితుల కోసం పని చేస్తున్న ఎన్.జి.ఓలను అడిగితే సాయం పొందాల్సిన వారు చాలామంది ఉన్నా తగినంత సాయం అందడం లేదని చెప్పారు. పైగా లాక్‌డౌన్ సమయంలో ఆకలితో బాధ పడిన వారు ఇప్పుడు కోవిడ్ సోకి బాధలు పడుతున్నారని కూడా తెలిపారు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. దేశమంతా లాక్‌డౌన్ బాధితుల కోసం, కోవిడ్ బాధితుల కోసం సాయం అందించమని ప్రచారం చేయడం, వారికి నచ్చిన సాయం చేసిన సరే, తాము చెప్పిన సంస్థలకు ఫండ్ ఇచ్చినా సరే... ఏదైనా కోవిడ్ కష్టాల్లో ఉన్న వారికి సాయం అందడమే ముఖ్యమనుకుంది. అందుకు ఏం చేయాలి? దేశమంతా తిరగాలి. ఆ మేరకే ప్లాన్ చేసుకుంది. బయలు దేరింది.
రోడ్ ఆశ్రమ్
దేశం లోపల ఉన్నవారికి కోవిడ్ గురించి ఎలాగూ తెలుస్తుంది. కాని సరిహద్దుల్లో ఉన్నవారిలో అవగాహన కల్పించాలి, వారి కోసం సాయం అందుతుందని ధైర్యం చెప్పాలి అనుకుంది నేహా చతుర్వేది. అందుకోసం కేంద్రపాలిత ప్రాంతాలతో సహా ముప్పై రాష్ట్రాలలో తిరగాలని నిశ్చయించుకుంది. అంతా రోడ్ టూర్. ఢిల్లీ నుంచి బయలు దేరి తిరిగి ఢిల్లీకి చేరడానికి 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు ఉజ్జాయింపుగా 54 రోజులు పడుతుందని లెక్క వేసింది. అయితే అన్ని చోట్ల బస దొరక్కపోవచ్చు. అందుకే వాహనమే బసగా అంటే ఇంటిగా పనికి వచ్చేలా తనకున్న వాహనాన్ని కొద్దిపాటి మార్పులు చేయించింది. దానికి ‘రోడ్ ఆశ్రమ్’ అని పేరు పెట్టింది. ఇలా తాను బయలు దేరబోతున్నాను అని చెప్పేసరికి ముంబైలో ఎన్.జి.ఓల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు తామూ వస్తామని, కరోనా బాధితుల కోసం దేశమంతా తిరగడానికి తామూ రెడీ అని చెప్పారు. వారి పేర్లు సిద్దార్థా దత్, అహమర్ సిద్దిఖీ. అహమర్‌ది కోల్‌కతా అయినా ముంబైలో మార్జినలైజ్డ్ వర్గాల కోసం పని చేస్తున్నాడు. సిద్దార్థది ముంబై ప్రాంతమే. ముగ్గురూ యాత్ర మొదలెట్టారు.
అక్టోబర్ 4 నుంచి
నేహా చతుర్వేది, సిద్దార్థా దత్, అహమర్ సిద్దిఖీలు ఈ యాత్ర చేసే ముందు మొదట గా పెట్టుకున్న నియమం విరాళాలనుంచి ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడకూడదని, ప్రతి రూపాయి కోవిడ్ బాధితులకు చేరాలని. యాత్ర జరగడానికి కావలసిన సాయం దారిలో కనిపించే ప్రజల నుంచే పొందుదామని అనుకున్నారు. కలిసే మనుషుల గురించి పొందిన అనుభవాల గురించి దేశంలో కనిపించే ప్రజల అవసరాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 4, 2020 నుంచి వారి సుదీర్ఘ యాత్ర మొదలైంది. ఢిల్లీ నుంచి గంగోత్రి మీదుగా అది సాగింది. ముగ్గురే డ్రైవర్లుగా వాహనం నడపసాగారు.
సమస్యలు – సహృదయాలు
ఢిల్లీ నుంచి బయలు దేరినప్పటి నుంచి దారి పొడుగునా ఆమె గమనించింది... వేలాదిమందికి పని లేదు. చేతి వృత్తులు కోల్పోయిన చాలామంది రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్లు తెరిచి బతికే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది చిన్న ఉద్యోగాల వారు కూరగాయల వెండర్స్‌గా మారారు. నేత పని వారు సరుకు ఆర్డర్ లేక చేపలు అమ్మేవారుగా మారారు. ఆడవారు ఇళ్లకే పరిమితమవగా ఈ పని, సంపాదన లేని మగవారు ఫ్రస్ట్రేషన్‌లో వారిని బాధిస్తున్నారు. కరోనా వచ్చిన పేదలు దేవుడి మీద భారం వేసి ప్రభుత్వం ఇచ్చిన గోలీలు మింగుతుంటే రోజు గడవక కుటుంబ సభ్యులు పస్తులుంటున్నారు. ‘ఇన్ని సమస్యల్లో కూడా జనం తమ కోసం మేం ముగ్గురం ఏదో చేయడానికి బయలుదేరాం అని తెలుసుకుని ఎన్నో చోట్ల ఆదరించి అన్నం పెట్టారు. బస చూపారు’ అని నేహా చెప్పారు.
మారని భావజాలం
నేహా ప్రయాణమంతా పల్లెదారుల్లో సాగింది. కాని ప్రతి చోటా ఆమెను గుర్తించినవారు లేరు. ప్రయాణం రూపకర్త ఆమే అయినా పల్లెల్లో అందరూ ఆ ఇద్దరు మగవారితోనే మాట్లాడారు. ‘ఈమె మీ భార్యా? లేదంటే చెల్లెలా?’ అని అడిగినవారే అందరూ. అంటే విడిగా ఆమెను గుర్తించే చైతన్యంలో వారు లేరు. ‘స్త్రీలకు కనీసం టాయిలెట్ సౌకర్యం లేని విధంగా ఉంచిన మన పల్లెల్లో వారికి వ్యక్తిత్వం, ఆలోచన, పని ఉంటుందని మగవారు ఎలా తెలుసుకుంటారు?’ అని నేహా అంది. ‘అన్ని చోట్లా ఆడవారు తక్కువ కనిపించినా నాగాలాండ్ రాగానే అన్ని షాపులూ స్త్రీల నిర్వహణలో కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఈశ్యాన్య రాష్ట్రాల స్త్రీలే ఉత్తరాది రాష్ట్రాల స్త్రీలతో పోల్చినప్పుడు స్వతంత్రంగా ఉన్నారు’ అని నేహా అంది.
జరిగేది జరగనిస్తూ ఉండాలా?
లాక్‌డౌన్ వల్ల కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఫ్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వారి ఆకలి బాధను తీర్చడం లేదు. జరిగేది జరగనిస్తూ ఉండటం బాధ్యత గల పౌరులు చేసే పని కాదు. వారి సాయానికి ఎన్ని విధాల ప్రయత్నాలు వీలైతే అన్ని విధాల ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రశ్నించడం మంచిది.. అంటుంది నేహా. సెకండ్ వేవ్ రాబోతున్నదని అందరూ భయపడుతున్న ఈ సమయంలో పేదల గురించి, ఉపాధి కోల్పోయినవారి గురించి, కొత్త నిరుద్యోగుల గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరాన్ని వీరి దుమ్ముదారుల ప్రయాణం మనకు గుర్తు చేస్తోంది.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment