
ఒక సంఘటన
ఆపిల్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ నీలిమ ఆ మధ్య విమానంలో వెళ్తుండగా.. అకస్మాత్తుగా రుతుక్రమం వచ్చింది. శానిటరీ ప్యాడ్ కావాలి. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులనూ అడిగారు..అందరి నోట ఒకటే మాట... లేదని. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బంది అంతా ఇంతా కాదు.
ఒక ఆలోచన..
ఈ ఘటన డాక్టర్ నీలిమలో ఆలోచనను రేకెత్తించింది. ప్రకృతి సిద్ధంగా వచ్చే రుతు క్రమాన్ని బయటకు చెప్పుకోలేని, శానిటరీ ప్యాడ్ గురించి మాట్లాడలేని స్థితిలో చాలా మంది ఉన్నారని గ్రహించారు. ‘పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు ఎంతో మంది నెలసరి సమయంలో బడి మానేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రకృతి సిద్ధంగా వచ్చే నెలసరి గురించి మాట్లాడుకునేందుకు సిగ్గుపడాల్సిన పని లేదు’ అని ఆమె భావించారు. పరిష్కారం ఏమిటని ఆలోచించారు..
ఒక పరిష్కారం..
షీ నీడ్.. యస్.. ఇదే సరైనదని నిర్ణయించుకున్నారు డాక్టర్ నీలిమ. నగరానికొచ్చేవారు, పేద విద్యార్థులు, యువతులు, మహిళలు శానిటరీ ప్యాడ్ కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీతో కలిసి ‘ షీ నీడ్’ను ప్రారంభించి ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలనుకున్నారు. జస్ట్.. బటన్ నొక్కితే చాలు.. ప్యాడ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక బాక్స్‌లో కియోస్క్ యంత్రాన్ని ఉంచుతారు. అవసరమైన వారు బటన్ నొక్కితే శానిటరీ ప్యాడ్ వస్తుంది. రోజూ బాక్సులో 50 ప్యాడ్స్ ఉంచు తారు. ప్రస్తుతానికి వెస్ట్‌జోన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. విజయవంతమైతే..ప్రధాన కూడళ్లు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. అంతే కాదు.. డాక్టర్ నీలిమ ఏం చెబుతున్నా రంటే.. ‘‘షీ నీడ్ నిర్వహణపై ఆసక్తి గల మహిళలకు అవగాహన కల్పించి.. ఫ్యాన్సీ స్టోర్, కుట్టు మిషన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తాం. కరెంటు ఉచితంగా ఇస్తాం. షీ నీడ్‌కు వచ్చే వారి వివరాలను రిజిస్టర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. ఈ నెల చివరినాటికి శేరిలింగంపల్లి సర్కిల్‌లో షీ నీడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి చెప్పారు. – హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment