మద్దిలపాలెం (విశాఖపట్నం): జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విశాఖ నగరం 16వ వార్డులోని ఇసుకతోట అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలకు విశేషస్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 10,032 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 542 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో 45 రోజులపాటు 10,574 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత నెల 30న వైద్యశిబిరాలు ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 611 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో 1.57 లక్షలమందికి వైద్యపరీక్షలు చేశామని, వీరిలో 6,089మందికి మెరుగైన వైద్యచికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేశామని వివరించారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ శిబిరాల్లో నాలుగువేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషలిస్టు వైద్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు.
పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,257 వ్యాధులకు వర్తింపజేశామని, వైద్యంతోపాటు చికిత్స తర్వాత దినసరి భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారన్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాలుగేళ్ల పాలనలో కేవలం వైద్యానికి రూ.3,600 కోట్లకుపైగా ఖర్చుచేశామని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment