సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి గురువారం డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం వైద్య శిబిరాలు ప్రారంభించే ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామాల్లో తొలి దశ సర్వే పూర్తయిందన్నారు.
రెండు, మూడో దశ సర్వేలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వేలను పక్కాగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేయించి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని చెప్పారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు.
ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్థోపెడిక్ వైద్యులు ఉండేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులు వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు.
మారిన వైద్య రంగం ముఖచిత్రం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం ముఖచిత్రం మారిపోయిందని మంత్రి విడదల రజిని అన్నారు. వివిధ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్‌లకు అత్యధిక రికార్డులను లింక్ చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి రజినికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment