cholera
-
గుర్లలో కలరా!
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది మరణించడంతో పాటు, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులపాలవ్వడానికి కారణం కలరా అని తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు సమాచారం. వైద్య శాఖ నియమించిన ర్యాపిడ్ రియాక్షన్ టీమ్ సైతం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. గుర్లలో చోటు చేసుకున్న మరణాలను దాచినట్లుగానే, సమస్యకు కారణాలను సైతం బయటకు పొక్కకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆస్పత్రిలో చేరిన కొందరు బాధితుల నుంచి నమూనాలు సేకరించి.. విజయనగరం వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీక్షించారు. కల్చర్ టెస్ట్‌లో విబ్రియో కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం. కలరా సోకిన వారిలో తీవ్ర స్థాయిలో విరోచనాలు అవుతాయి. దీంతో తొందరగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బాగా నీరసించిపోతారు. ఆపై కిడ్నీల పనితీరుపై ప్రభావం పడి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. -
ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసిన భారత్ బయోటెక్
ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 'ఓరల్ కలరా వ్యాక్సిన్' (OCV) ప్రారంభించింది. 'హిల్చోల్' (HILLCHOL) పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. దీనిని సింగపూర్‌కు చెందిన హిల్మాన్ లేబొరేటరీస్ లైసెన్స్‌తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.కలరా అనేది నివారించదగినది. అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,479 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను 200 మిలియన్ డోస్‌ల వరకు ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్, భువనేశ్వర్లలో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కలరా నివారించడానికి 'హిల్చోల్' ఓ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. 2030 నాటికి కలరా సంబంధిత మరణాల సంఖ్య 90 శాతం తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.కలరా ఎలా వ్యాపిస్తుంది?పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల వల్ల, పరిశుభ్రమైన నీరు లభించని ప్రాంతాల్లో నివసించే ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. కలరా సోకినా తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. -
జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలల మూసివేత!
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు. -
ఒకప్పుడు అష్టైశ్వర్యాలు.. కలరా దెబ్బతో నిర్మానుష్యమైన గ్రామం
బుట్టాయగూడెం: అనగనగా ఓ ఊరు. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు పాలించిన గడ్డ. ఆనాటి చారిత్రక ఆనవాళ్లు నేటికీ ఆ గ్రామంలో పదిలంగా ఉన్నాయి. రెడ్డి రాజుల సామ్రాజ్యంగా ఉన్న ఆ ఊరు రత్నాలు, రాసులతో అలరారినది. అటువంటి ఊరు నేడు నిర్మానుశ్యంగా మారింది. ఇలా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఘనతకెక్కింది రెడ్డిగణపవరం. నాడు రెడ్డి రాజుల సామ్రాజ్య పాలనలో అష్టైశ్వర్యాలతో అలరారిన గ్రామం నేడు నిర్మానుష్యంగా మారడం వెనుక ఉన్న కథను ఒక్క సారి పరిశీలిద్దాం... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఎంతో చారిత్రక నేపథ్యం గలది. ఈ గ్రామం 11వ శతాబ్దంలో ఏర్పడింది. ఓరుగల్లు కాకతీయుల పాలనలో రుద్రమదేవి ఆధీనంలోనే ఈ ప్రాంతమంతా ఉండేదని పూర్వీకులు చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్డి రాజులు వంశానికి చెందిన గణపతి రెడ్డి ఆధీనంలోకి వచ్చి ప్రత్యేక సామ్రాజ్యంగా ఏర్పడింది. గణపతి రెడ్డి పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధిలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడంతో పాటు అష్టైశ్వర్యాలతో అలలారినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న వారికి నాటి కాలానికి సంబంధించిన గుర్తులు నేటికీ లభిస్తున్నాయి. రెడ్డి రాజులు, సుల్తాన్లు కాలం నాటి నాణాలు, బంగారపు వస్తువులు తవ్వకాల్లో లభించగా ఈ వస్తువులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పునరావస్తు శాఖకు అప్పగించడం జరిగింది. గణపతి రెడ్డి పాలన: రెడ్డి రాజులు పాలన రెడ్డి గణపవరం కేంద్రంగా బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర ప్రాంతాలను సుమారు 65 కిలోమీటర్లు పరిధిలో సాగిందని చరిత్ర తెలిసిన పూర్వీకులు చెపుతున్నారు. రెడ్డి రాజులు పాలనలో ఇక్కడ రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణులు అధికంగా అండగా, ఇతర కులాల వారు తక్కువుగా ఉండేవారని చెప్తున్నారు. సుమారు రెండు వందల సంవత్సరాల పాటు సుభిక్షంగా అలరారుతున్న, ప్రశాంతంగా ఉన్న రెడ్డి గణపవరం గ్రామంపై 13వ శతాబ్దంలో ముస్లింలు పలుసార్లు దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలో గణపతి రెడ్డి కట్టించిన ఆలయాలు, మండపాలు ధ్వంసం అయ్యాయి. ముస్లింల దండయాత్రలో విజయం సాధించిన గణపతి రెడ్డి విజయానికి గుర్తుగా రెడ్డి గణపవరంలో కనక దుర్గమ్మ తల్లి గుడి కట్టించారు. కలరా సోకి ఖాళీ అయిన గ్రామం: 13వ దశాబ్ద కాలంలో ముస్లిం దండయాత్ర తర్వాత రెడ్డిగణపవరం గ్రామంలో కలరాసోకి ఒక్కొక్కరిగా మృత్యువాతన పడుతూవచ్చారు. దీనితో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు ఒక్కొక్కరిగా గ్రామం విడిచి బయటగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినవారిలో ఎక్కువ మంది వైశ్యులు లక్కవరంలోనే స్థిరపడినట్లు పూర్వీకులు చెప్తున్నారు. -
వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో అవి కలరా తీవ్రంగా విజృంభిస్తున్న రోజులు. 33 ఏళ్ల వాల్డీమర్ హాఫ్కిన్ 1893లో కలరా వ్యాక్సిన్‌తో భారత్‌లో అడుగుపెట్టారు. ఆయన బ్రిటిష్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్య కేంద్రానికి వెళ్లారు. ఆయన తయారు చేసిన వ్యాక్సిన్‌ను గుర్తించేందుకు అక్కడి వైద్యాధికారులు నిరాకరించారు. అందుకు కారణం ఆయన వైద్యుడు కాకపోవడమే. ఆయన వ్యాక్సిన్‌ను భారతీయులు కూడా నమ్మలేదు. వాల్డీమర్ జువాలోజిస్ట్. రష్యా యూదుల జాతికి చెందిన వారవడంతో రాజకీయంగా కూడా భారతీయుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఆయన కనుగొన్న కలరా వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ ద్వారా వారం రోజుల వ్యవధిలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంది. వాటిని తీసుకునేందుకు కొన్ని నెలల వరకు ఆయనకు వాలంటీర్లు దొరకలేదు. ఆ తర్వాత ఆయన ఉత్తర భారత దేశమంతా తిరిగి 23 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసుకొని వారికి కలరా వ్యాక్సిన్లు ఇచ్చారట. వారిలో ఎవ్వరికి కలరా సోకలేదు. వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారు కలరాను సమర్థంగా ఎదుర్కొన్నారా లేదా వారికి నిజంగానే కలరా సోకలేదా? అన్న విషయం తేలక పోవడంతో ప్రజలు ఆయన వ్యాక్సిన్‌ను అంతగా నమ్మలేదు. (వ్యాక్సిన్ వద్దా.. లాక్‌డౌనే ముద్దా?) 1984, మార్చి నెలలో కోల్‌కతాకు చెందిన ఓ వైద్యాధికారి నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఆ వైద్యాధికారి సూచనల మేరకు వాల్డీమర్ నగరంలోని మురికి వాడల్లోని మంచినీళ్ల ట్యాంకుల్లో, నగరం పొలిమేరకు సమీపంలో ఉన్న చిన్న చిన్న పేద గ్రామాలకు వెశ్లి వారి మంచీటి కుంటల్లో, చెరువుల్లో కలరా వ్యాక్సిన్ ఉండలను కలిపారు. ఆయా గ్రామాల్లోని గుడిశె వాసులను కలుసుకొని వారికి వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. ఒకే చోట నివసించే గుడిశె వాసులు వ్యాక్సిన్లు తీసుకోగా, కొందరు తీసుకోలేదు. తీసుకోని వారిలో కలరా పెరగడంతో వాల్డీమర్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఆయన తన సహాయక బృందాన్ని కూడా పెంచుకున్నారు. బెంగాల్‌లోని కట్టాల్ బేగన్ బస్తీలో ఓ ఇద్దరు కలరా సోకి మరణించారనే వార్త తెల్సి వాల్డీమర్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. అక్కడ 200 మందిని పరీక్షించగా, వారిలో 116 మందికి కలరా సోకింది. వారందరికి కలరా డోస్‌లు ఇవ్వగానే వారిలో ఎక్కువ మంది కోలుకున్నారు. అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో కొందరు మృత్యువాత పడ్డారు. వాల్డీమర్ వ్యాక్సిన్ పనిచేస్తున విషయాన్ని కోల్‌కతా జిల్లా వైద్యాధికారి గుర్తించారు. దాంతో వాల్డీమర్, భారతీయ వైద్యులైన చౌదరి, ఘోస్, ఛటర్జీ, దత్ల సహకారంతో దేశమంతా తిరుగుతూ కలరా డోస్‌లను ఇస్తూ కలరా మహమ్మారి నుంచి కొన్ని లక్షల భారతీయుల ప్రాణాలను రక్షించారు. -
మళ్లీ కోరలు చాస్తున్న కలరా!!
ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా మళ్లీ కోరలు చాస్తోంది. తానున్నానంటూ రోగులతో పాటు వైద్యవర్గాలనూ కలవరపరుస్తోంది. చాలా ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ ప్రాంతంలో కలకలం సృష్టించిన ఈ వ్యాధి మళ్లీ అదే ప్రాంతంలో తన ఉనికిని చూపిస్తోంది. చిన్న పిల్లలు సహా ఈ వ్యాధి లక్షణాలున్న 30 మంది రోగులు పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ప్రాథమిక వైద్యకేంద్రంలోను, సమీపంలోని వైద్య శిబిరాల్లోను చేరినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 'సజల్ ధార' పేరుతో వచ్చే రక్షిత మంచినీటి పథకం పైపులు, బోర్ వెల్స్ నీటినే తాగుతున్న ప్రజలకు ఈ వ్యాధి సోకడం గమనార్హం. వీళ్లందరినీ రామకృష్ణాపూర్ పీహెచ్సీలోను, సమీపంలోని వైద్యశిబిరాల్లోను శనివారం రాత్రి చేర్చారు. రోగులందరికీ కలరా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని ప్రధాన వైద్యాధికారి గిరీష్ చంద్ర బేరా తెలిపారు.