ఒకప్పుడు అష్టైశ్వర్యాలు.. కలరా దెబ్బతో నిర్మానుష్యమైన గ్రామం | Interesting History Behind Reddy Ganapavaram Village In West Godavari | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు అష్టైశ్వర్యాలు.. కలరా దెబ్బతో నిర్మానుష్యమైన గ్రామం

Published Fri, Oct 29 2021 8:43 PM | Last Updated on Fri, Oct 29 2021 8:56 PM

Interesting History Behind Reddy Ganapavaram Village In West Godavari - Sakshi

రెడ్డిరాజుల కాలంలో నిర్మించిన మండపం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న దృశ్యం

బుట్టాయగూడెం: అనగనగా ఓ ఊరు. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు పాలించిన గడ్డ. ఆనాటి చారిత్రక ఆనవాళ్లు నేటికీ ఆ గ్రామంలో పదిలంగా ఉన్నాయి. రెడ్డి రాజుల సామ్రాజ్యంగా ఉన్న ఆ ఊరు రత్నాలు, రాసులతో అలరారినది. అటువంటి ఊరు నేడు నిర్మానుశ్యంగా మారింది. ఇలా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఘనతకెక్కింది రెడ్డిగణపవరం. నాడు రెడ్డి రాజుల సామ్రాజ్య పాలనలో అష్టైశ్వర్యాలతో అలరారిన గ్రామం నేడు నిర్మానుష్యంగా మారడం వెనుక ఉన్న కథను ఒక్క సారి పరిశీలిద్దాం...


            
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఎంతో చారిత్రక నేపథ్యం గలది. ఈ గ్రామం 11వ శతాబ్దంలో ఏర్పడింది. ఓరుగల్లు కాకతీయుల పాలనలో రుద్రమదేవి ఆధీనంలోనే ఈ ప్రాంతమంతా ఉండేదని పూర్వీకులు చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్డి రాజులు వంశానికి చెందిన గణపతి రెడ్డి ఆధీనంలోకి వచ్చి ప్రత్యేక సామ్రాజ్యంగా ఏర్పడింది.

గణపతి రెడ్డి పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధిలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడంతో పాటు అష్టైశ్వర్యాలతో అలలారినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న వారికి నాటి కాలానికి సంబంధించిన గుర్తులు నేటికీ లభిస్తున్నాయి. రెడ్డి రాజులు, సుల్తాన్లు కాలం నాటి నాణాలు, బంగారపు వస్తువులు తవ్వకాల్లో లభించగా ఈ వస్తువులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పునరావస్తు శాఖకు అప్పగించడం జరిగింది. 

గణపతి రెడ్డి పాలన:
రెడ్డి రాజులు పాలన రెడ్డి గణపవరం కేంద్రంగా బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర ప్రాంతాలను సుమారు 65 కిలోమీటర్లు పరిధిలో సాగిందని చరిత్ర తెలిసిన పూర్వీకులు చెపుతున్నారు. రెడ్డి రాజులు పాలనలో ఇక్కడ రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణులు అధికంగా అండగా, ఇతర కులాల వారు తక్కువుగా ఉండేవారని  చెప్తున్నారు.

సుమారు రెండు వందల సంవత్సరాల పాటు సుభిక్షంగా అలరారుతున్న, ప్రశాంతంగా ఉన్న రెడ్డి గణపవరం గ్రామంపై 13వ శతాబ్దంలో ముస్లింలు పలుసార్లు దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలో గణపతి రెడ్డి కట్టించిన ఆలయాలు, మండపాలు ధ్వంసం అయ్యాయి. ముస్లింల దండయాత్రలో విజయం సాధించిన గణపతి రెడ్డి విజయానికి గుర్తుగా రెడ్డి గణపవరంలో కనక దుర్గమ్మ తల్లి గుడి కట్టించారు.

కలరా సోకి ఖాళీ అయిన గ్రామం:
13వ దశాబ్ద కాలంలో ముస్లిం దండయాత్ర తర్వాత రెడ్డిగణపవరం గ్రామంలో కలరాసోకి ఒక్కొక్కరిగా మృత్యువాతన పడుతూవచ్చారు. దీనితో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు ఒక్కొక్కరిగా గ్రామం విడిచి బయటగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినవారిలో ఎక్కువ మంది వైశ్యులు లక్కవరంలోనే స్థిరపడినట్లు పూర్వీకులు చెప్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement