ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 'ఓరల్ కలరా వ్యాక్సిన్' (OCV) ప్రారంభించింది. 'హిల్‌చోల్' (HILLCHOL) పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. దీనిని సింగపూర్‌కు చెందిన హిల్‌మాన్ లేబొరేటరీస్ లైసెన్స్‌తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
కలరా అనేది నివారించదగినది. అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,479 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.
భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను 200 మిలియన్ డోస్‌ల వరకు ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్, భువనేశ్వర్‌లలో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా కలరా నివారించడానికి 'హిల్‌చోల్' ఓ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. 2030 నాటికి కలరా సంబంధిత మరణాల సంఖ్య 90 శాతం తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.
కలరా ఎలా వ్యాపిస్తుంది?
పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల వల్ల, పరిశుభ్రమైన నీరు లభించని ప్రాంతాల్లో నివసించే ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. కలరా సోకినా తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment