ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా మళ్లీ కోరలు చాస్తోంది. తానున్నానంటూ రోగులతో పాటు వైద్యవర్గాలనూ కలవరపరుస్తోంది.
ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా మళ్లీ కోరలు చాస్తోంది. తానున్నానంటూ రోగులతో పాటు వైద్యవర్గాలనూ కలవరపరుస్తోంది. చాలా ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ ప్రాంతంలో కలకలం సృష్టించిన ఈ వ్యాధి మళ్లీ అదే ప్రాంతంలో తన ఉనికిని చూపిస్తోంది. చిన్న పిల్లలు సహా ఈ వ్యాధి లక్షణాలున్న 30 మంది రోగులు పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ప్రాథమిక వైద్యకేంద్రంలోను, సమీపంలోని వైద్య శిబిరాల్లోను చేరినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
'సజల్ ధార' పేరుతో వచ్చే రక్షిత మంచినీటి పథకం పైపులు, బోర్ వెల్స్ నీటినే తాగుతున్న ప్రజలకు ఈ వ్యాధి సోకడం గమనార్హం. వీళ్లందరినీ రామకృష్ణాపూర్ పీహెచ్సీలోను, సమీపంలోని వైద్యశిబిరాల్లోను శనివారం రాత్రి చేర్చారు. రోగులందరికీ కలరా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని ప్రధాన వైద్యాధికారి గిరీష్ చంద్ర బేరా తెలిపారు.