మండలంలోని మిట్టకందాల గ్రామానికి చెందిన వీఆర్వో శశికళ, వీఆర్‌ఏ హనీఫ్‌లు రూ.12వేలు లంచం తీసుకుంటూ...
పాములపాడు: మండలంలోని మిట్టకందాల గ్రామానికి చెందిన వీఆర్వో శశికళ, వీఆర్‌ఏ హనీఫ్‌లు రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరులకు తెలిపారు. నంద్యాలకు చెందిన నారాయణకు మిట్టకందాల గ్రామంలో సర్వే నంబరు 202లో 3.70 ఎకరాల భూమి ఉంది. అందులో బోరు వేయించాడు. విద్యుత్ మోటారు ఏర్పాటు చేసుకునేందుకు విద్యుత్‌శాఖ అధికారులకు పొలం, బోరు ఉన్నట్లు వీఆర్వో ధ్రువీకరించిన పత్రం ఇవ్వాల్సి ఉంది.
ఇందుకోసం వీఆర్వో శశికళను రైతు నారాయణ సంప్రదించగా రూ.15వేలు లంచం అడిగారు. అయితే రూ.12వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రైతు తెలిపారు. సోమవారం పాములపాడు తహశీల్దార్ కార్యాలయం పక్కన ప్రైవేట్ బిల్డింగ్‌లో వీఆర్వోకు రైతు రూ.12 వేలు ఇచ్చాడు. ఆమె వెంటనే ఆ డబ్బును వీఆర్‌కు ఇచ్చారు. మాటు వేసిన ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొదటి ముద్దాయిగా వీఆర్వో, రెండో ముద్దాయిగా వీఆర్‌ఏలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
లంచం అడిగితే సమాచార మివ్వండి
ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లైతే తమకు సమాచారమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారను కోర్టుకు రావాల్సిన పని లేదని, వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు తమకు సహకరించి అవినీతిని అంతమొందించాలని పేర్కొన్నారు.