గాంధీనగర్: పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బీజేపీకి పటేళ్ల బలం పెరుగుతోందనే భావన వ్యక్తమైంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.. చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు.
పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించి.. శనివారం బీజేపీలో చేరిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్‌లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని విమర్శించింది. అటు, పటేళ్ల సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదంటూ నిఖిల్ సవానీ అనే పటీదార్ నేత కమలం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు.
నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. కోర్టు నేతృత్వంలో విచారణ జరగని పక్షంలో గుజరాత్ ఎన్నికల పవిత్రతపైనే అనుమానాలు తలెత్తుతాయన్నారు. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ భయపడుతోందని.. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేస్తోందన్నారు. ప్రధాని గుజరాత్ ప్రజలకు వరాలు ప్రకటించేందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని మనీశ్ తివారీ ఢిల్లీలో ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment