patel movement
-
ముగిసిన హార్ధిక్ పటేల్ ఆమరణ దీక్ష
అహ్మదాబాద్ : పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నేత హార్థిక్ పటేల్ ఆగస్ట్ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్ దీక్షకు కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది -
కోటి ఇస్తామన్నారు
గాంధీనగర్: పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బీజేపీకి పటేళ్ల బలం పెరుగుతోందనే భావన వ్యక్తమైంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.. చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించి.. శనివారం బీజేపీలో చేరిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్‌లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని విమర్శించింది. అటు, పటేళ్ల సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదంటూ నిఖిల్ సవానీ అనే పటీదార్ నేత కమలం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. కోర్టు నేతృత్వంలో విచారణ జరగని పక్షంలో గుజరాత్ ఎన్నికల పవిత్రతపైనే అనుమానాలు తలెత్తుతాయన్నారు. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ భయపడుతోందని.. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేస్తోందన్నారు. ప్రధాని గుజరాత్ ప్రజలకు వరాలు ప్రకటించేందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని మనీశ్ తివారీ ఢిల్లీలో ఆరోపించారు. -
హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం!
హార్దిక్ పటేల్.. దేశంలో ఈ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పటేళ్లను బీసీలలో చేర్చాలంటూ ఆయన సాగించిన ఉద్యమం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, అసలు హార్దిక్ పటేల్ ఆ ఉద్యమం ఎందుకు చేశాడన్న విషయమై ఒకప్పుడు ఆయనకు సన్నిహిత సహచరులుగా ఉన్నవాళ్లు వెల్లడిస్తున్న అంశాలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఒక్క ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యమం మొదలుపెట్టాడని అంటున్నారు. గతంలో హార్దిక్ పటేల్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ ఈ విషయాలు వెల్లడించారు. నియంత వ్యవహారం మానకపోతే అతడి చీకటి నిజాలను బయటపెడతామని హెచ్చరించారు. దీనిపై హార్దిక్‌కు బహిరంగ లేఖ రాశారు. ''మీరు నాయకుడిగా ఎదగాలని, భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్, ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్, ఆయన మామ విపుల్భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. సాధారణంగా జైలుకు వెళ్లారంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడమే కష్టమని, కానీ హార్దిక్ మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడని చిరాగ్, కేతన్ అన్నారు. గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత హార్దిక్ పటేల్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతానికి వెళ్లాడు. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని కోర్టు ఆదేశించడంతో అలా చేశాడు. ఇక కేతన్, చిరాగ్ చేసిన ఆరోపణలపై హార్దిక్ గానీ, ఆయన అనుచరులుగానీ ఏమీ స్పందించలేదు. హార్దిక్ పటేల్ తొమ్మిది నెలల పాటు జైల్లో ఉండగా, చిరాగ్.. కేతన్ కూడా దాదాపు 8 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. గుజరాత్లో 2015 ఆగస్టు 25న పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నిర్వహించిన ర్యాలీలో భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అహ్మదాబాద్ పోలీసులు వీరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. హార్దిక్ పటేల్ ఇటీవల చిరాగ్, కేతన్‌లను పక్కనపెట్టి వేరే బృందాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. హార్దిక్ నియంతలా వ్యవహరిస్తాడని, పటేళ్లు రిజర్వేషన్లు పొందే అవకాశాలను సర్వనాశనం చేశాడని వాళ్లు ఆరోపిస్తున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అతడు మాత్రమే జైల్లో ఉన్నట్లు మీడియాకు చెప్పాడని, అతడితోపాటు తాము కూడా జైల్లోనే ఉన్నామన్న విషయం మర్చిపోయాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలా వ్యవహరించడం మానకపోతే అతడికి సంబంధించిన మరిన్ని 'చీకటి నిజాలను' వెల్లడిస్తామని హెచ్చరించారు. -
మోదీ పాలనపై సంఘ్ చర్చ
భూబిల్లు, పటేల్ ఉద్యమం తదితర కీలక అంశాలపై చర్చ సాక్షి, న్యూఢిల్లీ: ఆరెస్సెస్, బీజేపీల మధ్య సమన్వయ సమావేశం ఢిల్లీ వేదికగా బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే భేటీలో భూసేకరణ ఆర్డినెన్సులో మోదీ సర్కారు ఓటమి, క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ, ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ పేరిట మాజీ సైనికులు నిర్వహిస్తున్న ఆందోళన, గుజరాత్ కేంద్రంగా ఉద్భవించి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరిస్తున్న పటేల్ ఉద్యమం, ధరల నియంత్రణలో వైఫల్యం తదితరాలపై మేధోమథనం జరుగుతోంది. రైతులను పట్టించుకోవడంలేదనే విమర్శలు, ప్రజల అసంతృప్తిని మూటగట్టుకుంటున్న పార్టీని గాడిలో పెట్టడం, బిహార్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహాల రూపకల్పనపైనా చర్చించనున్నారు. భేటీలో తొలిసారి కేంద్ర మంత్రులు పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, బీజేపీ చీఫ్ అమిత్‌షా, సంఘ్‌పరివార్‌లోని 15 సంస్థల కీలక పదాధికారులు, బీజేపీ ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. మోదీ సర్కారు పాలనతీరును సమీక్షిస్తున్నట్లు సమాచారం. వివిధ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై శాఖల వారీగా సంఘ్ సంస్థలకు అవగాహన కల్పించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన రామ మందిరం నిర్మాణం అంశాన్ని వీహెచ్‌పీ నేతలు లేవనెత్తినట్టు తెలుస్తోంది. గుజరాత్లో మొదలైన పటేల్ ఉద్యమంపై ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, కేంద్ర మంత్రులతో ఆరెస్సెస్ సమావేశమవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కాషాయ సంస్థలకు కాదని మండిపడింది. సంఘ్ జోక్యం చేసుకుంటూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని దుయ్యబట్టింది. ఈ భేటీలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుగుతోందన్న ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తోసిపుచ్చారు. -
'హింసతో పరిష్కారం ఉండదు.. శాంతి ముఖ్యం'
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉంటూ శాంతియుతంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లకోసం పోరుబాట పట్టిన పటేళ్లకు విజ్ఞప్తి చేశారు. హింసతో ఎవరికీ ఎలాంటి మేలు జరగదని ఆయన గుర్తు చేశారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడి నాయకత్వంలో ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే. తొలుత శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అనంతరం కొంత హింసాత్మక రూపం దాల్చింది. పలు చోట్ల వాహనాలు తగులబెట్టారు. అక్కడక్కడ ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బంద్‌కు పిలుపునివ్వడం, అంతకుముందు హార్దిక్ పటేల్ అరెస్టు అనంతరం విడుదల వంటి ఘటనల నేపథ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదువేల బలగాలను కూడా దించింది. ఈ నేపథ్యంలోనే అంతా శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మరోపక్క, హార్దిక్ పటేల్ ఓ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ హింసకు పాల్పడటం తమ ఉద్దేశం కాదని, తమ డిమాండ్‌ను అమలుచేయాలని శాంతియుతంగానే కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వమే అనవసరంగా పోలీసులను దించి తమపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.