భూబిల్లు, పటేల్ ఉద్యమం తదితర కీలక అంశాలపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: ఆరెస్సెస్, బీజేపీల మధ్య సమన్వయ సమావేశం ఢిల్లీ వేదికగా బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే భేటీలో భూసేకరణ ఆర్డినెన్సులో మోదీ సర్కారు ఓటమి, క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ, ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ పేరిట మాజీ సైనికులు నిర్వహిస్తున్న ఆందోళన, గుజరాత్ కేంద్రంగా ఉద్భవించి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరిస్తున్న పటేల్ ఉద్యమం, ధరల నియంత్రణలో వైఫల్యం తదితరాలపై మేధోమథనం జరుగుతోంది.
రైతులను పట్టించుకోవడంలేదనే విమర్శలు, ప్రజల అసంతృప్తిని మూటగట్టుకుంటున్న పార్టీని గాడిలో పెట్టడం, బిహార్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహాల రూపకల్పనపైనా చర్చించనున్నారు. భేటీలో తొలిసారి కేంద్ర మంత్రులు పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, బీజేపీ చీఫ్ అమిత్‌షా, సంఘ్‌పరివార్‌లోని 15 సంస్థల కీలక పదాధికారులు, బీజేపీ ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
మోదీ సర్కారు పాలనతీరును సమీక్షిస్తున్నట్లు సమాచారం. వివిధ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై శాఖల వారీగా సంఘ్ సంస్థలకు అవగాహన కల్పించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన రామ మందిరం నిర్మాణం అంశాన్ని వీహెచ్‌పీ నేతలు లేవనెత్తినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో మొదలైన పటేల్ ఉద్యమంపై ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
కాగా, కేంద్ర మంత్రులతో ఆరెస్సెస్ సమావేశమవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కాషాయ సంస్థలకు కాదని మండిపడింది. సంఘ్ జోక్యం చేసుకుంటూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని దుయ్యబట్టింది. ఈ భేటీలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుగుతోందన్న ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తోసిపుచ్చారు.
మోదీ పాలనపై సంఘ్ చర్చ
Published Thu, Sep 3 2015 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM
Advertisement