బిల్డర్ల కోసమే ‘రియల్ బిల్లు!
- మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు విషయంలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్డర్ల ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా చేసేందుకే రియల్ ఎస్టేట్ బిల్లును సవరణలతో నీరుగారుస్తున్నారని ఆరోపించారు. రైతులు, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ జాబితాలో మధ్యతరగతిని కూడా చేర్చేసిందని విమర్శించారు. శనివారం ఢిల్లీలో కొందరు ఫ్లాట్ కొనుగోలుదారులతో భేటీ అయిన అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడారు.
రైతులు, గిరిజనుల కోసం పోరాడుతున్నట్లే మధ్యతరగతి ప్రయోజనాలు కాపాడేందుకు వారి వెన్నంటి ఉంటానని చెప్పారు. రియల్ ఎస్టేట్(క్రమబద్ధీకరణ, అభివృద్ధి) బిల్లుకు చేసిన సవరణలను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఈనెల 5న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాహుల్ వ్యతిరేకిస్తుండడంతో.. ప్రభుత్వానికి మెజారిటీ తక్కువున్న పెద్దల సభలో ఇది గట్టెక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ‘మధ్యతరగతికీ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. యూపీఏ హయాం నాటి బిల్లును ఈ ప్రభుత్వం నీరుగారుస్తోంది. పాత బిల్లులో పారదర్శకత ఉండేది. ఇప్పుడు లోపించింది’ అని రాహుల్ అన్నారు.