'మోదీ నినాదాలు, రాళ్లు.. నన్ను ఆపలేవు'
- దాడి చేసిన వాళ్లే ఖండించలేరు కదా!
- మోదీ, ఆరెస్సెస్ రాజకీయాలకు ఈ దాడి నిదర్శనం
- విరుచుకుపడిన రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: గుజరాత్‌లో తన కారుపై జరిగిన దాడి వెనుక బీజేపీ, ఆరెస్సెస్ హస్తముందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. మీపై దాడిని ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ఖండించలేదని మీడియా ప్రశ్నించగా.. 'దాడిలో పాల్గొన్నవాళ్లే ఖండించలేరు కదా?' అని ప్రశ్నించారు. ' ఇది మోదీజీ, బీజేపీ-ఆరెస్సెస్ రాజకీయాలకు నిదర్శనం. దీని గురించి ఎవరేం చెప్పగలరు' అని విమర్శించారు. తనపై దాడి నేపథ్యంలో వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని అంతకుముందు ట్విట్టర్‌లో రాహుల్ పేర్కొన్నారు.
'నరేంద్రమోదీజీ నినాదాలు, నల్లజెండాలు, రాళ్లు నన్ను ఆపలేవు. ప్రజాసేవ కోసం మేం మా సర్వశక్తులు ఒడ్డుతాం' అని ట్వీట్ చేశారు. గుజరాత్‌లో వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై శుక్రవారం రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రత్యేక భద్రత దళం(ఎస్‌పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు. పిరికిపందల చర్యలకు తాను భయపడనని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.