Land bill
-
‘భూబిల్లు’ కమిటీ గడువు పొడిగింపు!
నేడు లోక్‌సభలో తీర్మానం న్యూఢిల్లీ: వివాదాస్పద భూబిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ) నివేదిక సమర్పణకు మళ్లీ గడువు పొడిగించాలని కోరే అవకాశముంది. చాలా రాష్ట్రాలు భూసేకరణ పరిహారానికి సంబంధించి సమాచారం ఇవ్వనందున వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం వరకు గడువు పొడిగించాలని కోరనుంది. కమిటీ గడువు వచ్చే బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఎస్ఎస్ అహ్లూవాలియా(బీజేపీ) మంగళవారం గడువు పొడిగింపు కోరుతూ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కమిటీ సోమవారం సమావేశమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పలువురు కమిటీ సభ్యులు హాజరుకాలేదు. వానాకాల సమావేశాలు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇప్పటికే కమిటీ గడువును ఐదుసార్లు పొడిగించారు. -
మోదీ పాలనపై సంఘ్ చర్చ
భూబిల్లు, పటేల్ ఉద్యమం తదితర కీలక అంశాలపై చర్చ సాక్షి, న్యూఢిల్లీ: ఆరెస్సెస్, బీజేపీల మధ్య సమన్వయ సమావేశం ఢిల్లీ వేదికగా బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే భేటీలో భూసేకరణ ఆర్డినెన్సులో మోదీ సర్కారు ఓటమి, క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ, ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ పేరిట మాజీ సైనికులు నిర్వహిస్తున్న ఆందోళన, గుజరాత్ కేంద్రంగా ఉద్భవించి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరిస్తున్న పటేల్ ఉద్యమం, ధరల నియంత్రణలో వైఫల్యం తదితరాలపై మేధోమథనం జరుగుతోంది. రైతులను పట్టించుకోవడంలేదనే విమర్శలు, ప్రజల అసంతృప్తిని మూటగట్టుకుంటున్న పార్టీని గాడిలో పెట్టడం, బిహార్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహాల రూపకల్పనపైనా చర్చించనున్నారు. భేటీలో తొలిసారి కేంద్ర మంత్రులు పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, బీజేపీ చీఫ్ అమిత్‌షా, సంఘ్‌పరివార్‌లోని 15 సంస్థల కీలక పదాధికారులు, బీజేపీ ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. మోదీ సర్కారు పాలనతీరును సమీక్షిస్తున్నట్లు సమాచారం. వివిధ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై శాఖల వారీగా సంఘ్ సంస్థలకు అవగాహన కల్పించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన రామ మందిరం నిర్మాణం అంశాన్ని వీహెచ్‌పీ నేతలు లేవనెత్తినట్టు తెలుస్తోంది. గుజరాత్లో మొదలైన పటేల్ ఉద్యమంపై ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, కేంద్ర మంత్రులతో ఆరెస్సెస్ సమావేశమవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కాషాయ సంస్థలకు కాదని మండిపడింది. సంఘ్ జోక్యం చేసుకుంటూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని దుయ్యబట్టింది. ఈ భేటీలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుగుతోందన్న ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తోసిపుచ్చారు. -
భూ బిల్లు కీలకాంశాలపై నేడు జేపీసీ భేటీ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకుగానూ దీనిపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం తుదిసారి భేటీ కానుంది. ఇందులో కీలకాంశాలపై చర్చించనుంది. వినియోగించని భూమిని ఐదేళ్ల తర్వాత అసలు యజమానికి అప్పగించే నిబంధనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ బిల్లును బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని 30 మంది సభ్యుల సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత బిల్లులో రైతుల సమ్మతి, సామాజిక ప్రభావ అంచనా తదితర ఆరు అంశాలను చేర్చేందుకు ఇప్పటికే కమిటీ ఏకాభిప్రాయానికి రావడం తెలిసిందే. అయితే మరో మూడు అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కోసం ఈ భేటీలో ప్రయత్నించనుంది. మంగళవారం కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉన్నందున కీలకాంశాలపై ఏకాభిప్రాయం సాధించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ బిల్లులో మార్పులకు సోమవారం ఆమోదముద్ర వేయనుంది. కాగా, లోక్‌పాల్ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి మరో రెండు నెలల గడువు లభించింది. ఈ బిల్లుకు సంబంధించి కమిటీకి గడువును పొడిగించడం ఇది రెండోసారి. మరోపక్క.. జీఎస్టీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక బిల్లులో సవరణలు చేసేందుకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
భూ బిల్లుపై 11న నివేదిక
న్యూఢిల్లీ: భూ బిల్లుపై తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈనెల 11న పార్లమెంటుకు సమర్పించనుంది. కీలకాంశాలపై ఏకాభిప్రాయం వచ్చినందున ఈనెల 10న చివరిసారిగా సమావేశమై నివేదికకు తుదిరూపునిచ్చి 11న పార్లమెంటుకు సమర్పించాలని నిర్ణయించిన ట్లు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్.అహ్లూవాలియా గురువారం వెల్లడించారు. శుక్రవారంతో కమిటీకి ఇచ్చిన గడువు ముగుస్తుం డటంతో 11వ తేదీ దాకా గడువు పొడిగించాలని లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 2013లో యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టంలోని ‘70 శాతం రైతుల అనుమతి, సామాజిక ప్రభావాన్ని అంచనా’ నిబంధనలను తొలగిస్తూ కేంద్రం సవరణలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యాబలం లేని కారణంగా 3సార్లు ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చింది. బిల్లు గట్టెక్కే మార్గం కనపడకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతుల అనుమతి, సామాజిక ప్రభావం అంచనాలను బిల్లులో పొం దుపర్చేలా కమిటీలోని 11మంది బీజేపీ సభ్యులు మంగళవారం ప్రతిపాదించారు. -
'భూసేకరణ చట్ట సవరణకు పూర్తి మద్దతు'
భూసేకరణ సంపూర్ణ చట్ట సవరణ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. దాంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న అంశంపై సభలో చర్చకు పట్టుబడతామన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇంకా అనేక అంశాలు అమలు కాలేదని, ఇప్పటికి రాష్ట్రం విడిపోయి 14 నెలలు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. ఇలా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆ బాధ్యత అందరిదీ: మోదీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అయితే ఈ బాధ్యతను అన్ని పార్టీలు పంచుకోవాల్సిన అవరసముందని అభిప్రాయపడ్డారు. భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. -
‘భూసేకరణ’పై కొత్త ఎత్తు
ఉత్సాహం ఉండటంలో తప్పులేదుగానీ...అలా ఉత్సాహపడేవారికి దాని ప్రయోజనం, పరమార్థం విషయంలో స్పష్టత ఉండాలి. వాటిని సాధించడానికి అవసరమైన సాధనాసంపత్తులు తమకున్నాయో లేదో అవగాహన ఉండాలి. కేంద్రంలో అధికారంలోకొచ్చిన వెంటనే ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ చట్టంపై దృష్టి సారించింది. ఎక్కడలేని చురుకుదనాన్నీ ప్రదర్శించి దానికి సవరణలు చేయ డానికి పూనుకున్నది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనిపై చర్చించి ఆర్డినెన్స్ జారీచేసింది. కాలపరిమితి ముగిసిన రెండు సందర్భాల్లోనూ ఆర్డినెన్స్‌కు ప్రాణప్రతిష్ట చేసింది. ఈమధ్యలో ఒకసారి లోక్‌సభలో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందారు. రాజ్యసభలో సహ జంగా విపక్షానిదే మెజా రిటీ గనుక ఆ ప్రయత్నం అక్కడ వీగిపోయింది. ఆ బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఈలోగా కేంద్రం స్వరం మార్చింది. అభివృద్ధిలో దూసుకుపోద ల్చుకున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రస్తుత భూ సేకరణ చట్టం స్థానంలో మెరుగైన చట్టాన్ని తీసుకురాదల్చుకుంటే అందుకు తాము సహకరిస్తామని ప్రకటించింది. విపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చినా వెనక్కి తగ్గకుండా ఆర్డినెన్స్‌ల మీద ఆర్డినెన్స్‌లు జారీచేసిన ఎన్డీయే సర్కారు... ఇప్పుడు మధ్యలో కాడి పారేసి ‘మీలో ఎవరైనా చట్టాలు చేసుకుందామనుకుంటే చేసుకోండ’ని రాష్ట్రాలకు సూచిస్తున్నది. బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో విఫలమైతే ఇది తప్ప ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అలాగని చాలామంది నుంచి సూచనలొస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా ఏ చట్టంపైన అయినా అభ్యంతరాలొచ్చినప్పుడూ, దాని అమలుకు ఆటంకాలెదురవుతున్నప్పుడూ, అది ఆశించిన ప్రయోజనాన్ని నెరవే ర్చడం లేదని రుజువవుతున్నప్పుడూ దాన్ని సవరించాలని ఏ ప్రభుత్వమైనా భావి స్తుంది. భూసేకరణ చట్టానికి అలాంటి అభ్యంతరాలో, ఆటంకాలో ఎదురైన దాఖ లాలు లేవు. దాని కారణంగా ఏ ప్రాజెక్టు అయినా ఆగిపోయినట్టు లేదా మొద లెట్టిన ప్రాజెక్టు నత్తనడకన సాగినట్టు ఎవరూ చెప్పలేదు. అసలు ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆర్నెల్లముందు యూపీఏ హయాంలో ఆ చట్టం వచ్చింది. ఎన్డీయే వచ్చాక ఆ చట్టంకింద భూసేకరణ చేసింది లేదు. ఆచరణకే రాని చట్టం గురించి ఫిర్యాదులుండటానికీ ఆస్కారం లేదు. పారిశ్రామికాభివృద్ధికి ఈ చట్టం ఆటంకంగా మారిందని కేంద్రం అనడమే తప్ప దాన్ని సమర్థించే ఉదంతాలను చూపలేదు. మరి ఎందుకని ఆర్డినెన్స్ జారీలో అత్యుత్సాహం చూపినట్టు? పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి అవసరాలకు భూములు సేకరించే సందర్భంలో భూ యజమానుల అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్‌లో ఎందుకు పేర్కొన్నట్టు? ఆయా ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా(ఎన్ఐఏ) నిబంధనను ఎందుకు తొలగించినట్టు? ఎవరు అడిగారని ఈ సవరణలకు పూనుకున్నారు? ఈ ఆర్డినెన్స్‌ల వ్యవహారాన్ని కాంగ్రెస్, వామపక్షాలు, మరికొన్ని ఇతర పార్టీలు మాత్రమే కాదు...ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్, పీడీపీ కూడా వ్యతిరేకిం చాయి. స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్వంటి సంఘ్ పరివార్ సంస్థలు సైతం ఆర్డినెన్స్ నిబంధనలు రైతు వ్యతిరేకమైనవని ఆరోపించాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలనూ తెలుసుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ అవసరమైందో వివరిస్తుంది. తన ప్రతిపాదనల్లోని లోపాలను పరిహరించడానికి సిద్ధపడుతుంది. కానీ ఏ దశలోనూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు. లోక్‌సభలో బిల్లుపై చర్చ జరిగిన మాట వాస్తవమే అయినా చివరకు అధికార పక్షానికున్న సంఖ్యాబలమే దాన్ని గెలిపించింది. రాజ్యసభలో గెలవడం అసాధ్యమైన ఈ పరిస్థితుల్లో ఇతరత్రా వేదికలపై భూసేకరణ ఆర్డినెన్స్ గురించి చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే మొన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ‘సహకార ఫెడరలిజం’లో భాగంగానే ఈ చర్చకు చోటిస్తున్నట్టు కేంద్రం చెప్పడం బాగానే ఉన్నా... వరసబెట్టి మూడుసార్లు ఆర్డినెన్స్ జారీచేసినప్పుడు అది ఎందుకు గుర్తుకురాలేదో వివరించలేదు. నిజానికి బీజేపీ వ్యవహరించిన ఇలాంటి తీరువల్లే కాంగ్రెస్‌కు ఎక్కడలేని బలమూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 స్థానాలు మాత్రమే గెల్చుకుని ఎటూ పాలుబోని స్థితిలో పడిన ఆ పార్టీ చేతికి ఆయుధాన్నందించి దాన్ని నిత్యమూ వార్తల్లో ఉండేలా చేసిన ఘనత ఎన్డీయే సర్కారుకు దక్కుతుంది. నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలంతా బహిష్కరించి పార్టీ రైతుల పక్షాన ఉన్నదని ప్రకటించడానికి దాన్నొక సందర్భంగా ఎంచుకున్నారు. భూసేకరణ చట్ట సవరణ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న సవాళ్లకు బీజేపీ నేతల వద్ద జవాబు లేదు. 56 అంగుళాల ఛాతి ఆర్నెల్లు తిరిగేసరికల్లా 5.6 అంగుళాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేస్తుంటే బీజేపీ ఆత్మరక్షణలో పడిన స్థితికి చేరుకుంది. లోక్‌సభలో 282 స్థానాలున్న పాలక పార్టీ కీలకమైన బీహార్ ఎన్నికల ముందు ఇలా బలహీనంగా కనబడటం మంచిది కాదని ఆ పార్టీ నేతలకే అనిపిస్తున్నది. అందువల్లే ఈ సవరణ బిల్లు సంగతిని పూర్తిగా పక్కనబెట్టి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చునని జైట్లీ చెబుతున్నారు. సవ రణ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంటు సంయుక్త సమావేశానికి సిద్ధమని దూకుడు ప్రదర్శించినవారు ఇప్పుడిలా స్వరం మార్చడం వింతగొలుపుతుంది. అయితే జైట్లీ ప్రతిపాదన చిక్కులతో కూడుకున్నది. భూ సేకరణ అంశం ఉమ్మడి జాబితాలోనిదే అయినా... ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టం చేయడం ఆచరణ సాధ్యమేనా? న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా? భూసేకరణ చట్టం విషయంలో ఇన్నాళ్లూ అనుసరించిన వైఖరి సరైంది కాదనుకుంటే ఆ సంగతిని బహిరంగంగా ప్రకటించాలి. బీహార్ ఎన్నికల్లో నష్టపోతామన్న భయంతో ఇలాంటి ఎత్తులకు దిగడమంటే నైతికంగా బలహీనం కావడమేనని బీజేపీ తెలుసుకోవాలి. ఈ మాదిరి ఎత్తుగడలే కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాయని గ్రహించాలి. -
భూ సేకరణపై అన్నా నిరశన
రాలెగావ్ సిద్ధి: సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగబోతున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లు, రక్షణ శాఖలో ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అంశాలపై ఆయన ఆందోళన చేపట్టనున్నారు. అక్టోబర్ 2న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను దీక్ష చేపట్టనున్నట్లు తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నెల 26న షహీద్ దిన్ సందర్భంగా అన్నాను అమర జవాన్ల కుటుంబ సభ్యులు సన్మానించనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత దేశ వ్యాప్తంగా రైతులు, మాజీ సైనికోద్యోగులు భూ బిల్లును నిరసిస్తూ, ఓఆర్ఓపీ త్వరగా అమలు చేయాలని కోరుతూ ర్యాలీలు నిర్వహిస్తారని అన్నా తెలిపారు. -
బిహార్ ఎన్నికల తర్వాతే భూబిల్లు!
బిల్లుపై సిఫారసుల సమర్పణకు వారం గడువు పొడిగింపు కోరిన జేపీసీ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై సెప్టెంబర్‌లో జరగబోయే బిహార్ ఎన్నికల తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ).. తన సిఫారసులను అందించటానికి మరో వారం రోజులు గడువు పొడిగించాలని కోరింది. బిల్లుపై జేపీసీలో ఏకాభిప్రాయం లేకపోవటం, మరోవైపు లలిత్‌గేట్ వివాదం సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భూసేకరణ బిల్లును తెస్తే విపక్షాల దాడికి మరో ఆయుధాన్ని అందించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లును ప్రవేశపెట్టకపోతే.. బిహార్ ఎన్నికల అనంతరం జరిగే శీతాకాల సమావేశాల్లో దానిని ప్రవేశపెడతారు. అయితే.. రాజ్యసభలో తనతో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ తదితర పార్టీలు భూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఎగువ సభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం వంటి పరిస్థితులను బట్టి.. ఈ బిల్లును దాని వాస్తవ రూపంలో ఆమోదించుకోవాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహించటం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. 30 మంది సభ్యులున్న జేపీసీలో బీజేపీ ఎంపీలు కేవలం 11 మందే ఉన్నారని.. మెజారిటీ ఓటుతో బిల్లును అంగీకరించాలంటే అధికారపక్షానికి మరో ఐదు ఓట్లు అవసరమవుతాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాల అసమ్మతి ప్రకటనలతో ఈ బిల్లు జేపీసీ నుంచి పార్లమెంటు ముందుకు వస్తుందని పేర్కొంటున్నాయి. భూ బిల్లుపై స్వదేశీ జాగర ణ్ మండిపాటు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లుపై ఆరెస్సెస్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) కూడా మండిపడింది. అందులో ఆమోదయోగ్యంకాని అనేక సెక్షన్లు ఉన్నాయని విమర్శించింది. జీపీసీ ముందు ఎస్జేఎం జాతీయ కన్వీనర్ అశ్వనీ మహాజన్ నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు హాజరై అభిప్రాయాలు తెలిపారు. -
భూ బిల్లు 'వర్షా' ర్పణం కానుందా?
- వర్షాకాల సమావేశాల్లో భూ సేకరణ సవరణ బిల్లు సభ ముందుకు అనుమానమే - ప్రభుత్వానికి ఇంకా చేరని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తుది నివేదిక - జేపీసీలో స్పష్టతవస్తేగానీ బిల్లుకు సహకరించబోమని విపక్షాల పట్టు - మరోవైపు లిలిత్ గేట్ పోటు.. మల్లగుల్లాలు పడుతోన్న మోదీ సర్కార్ న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ భూ సేకరణ సవరణ బిల్లు ఎన్డీఏ ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగల్చనుందా? అసలా బిల్లు సభ ముందుకు రాకుండానే సమావేశాలు ముగుస్తాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. బిల్లు ఆమోదం కోసం ఎగువ, దిగువ సభల సభ్యులతో ఏర్పాటయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సమయానికి అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అహ్లువాలియా నేతృత్వంలో ఇరు సభల సభ్యులతో ఏర్పాటయిన జేపీసీ.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై బిల్లులో చేయాల్సిన మార్పులపై సమాలోచనలు జరిపింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని, మరిన్ని భేటీల తర్వాతగానీ బిల్లులో మార్పులపై స్పష్టత వస్తుందని, అందుకోసం మరో మూడు, నాలుగు వారాలు గడువు అవసరం ఉందని జేపీసీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసెకెళ్లింది. జులై 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే జేపీసీ నివేదిక పూర్తవుతుందని, దాంతో భూ బిల్లును సులభంగా గట్టెక్కించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. కాగా మరింత గడువు కావాలని జేపీసీ కోరడంతో మోదీ సర్కారు ఇరుకున పడ్డట్టయింది. ఒకవేళ వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లు చర్చకు రాకుంటే మరో సారి ఆర్డినెన్స్ తప్ప మరో మార్గంలేదు బీజేపీకి. ఎందుకంటే పార్లమెంట్ శీతకాల సమావేశాలు డిసెంబర్ లో జరుగుతాయి. ఆలోపు ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. అప్పుడు మరోసారి ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి ఆగస్లు 13 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో భూబిల్లుతోపాటు లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్టీ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. -
భూ బిల్లుపై వెనక్కి తగ్గం: గడ్కారీ
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తేల్చిచెప్పారు. ‘రైతులకు ప్రయోజనకరమైన సవరణలేమైనా ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తే ఆ మేరకు బిల్లులో మార్పులు చేస్తాం కానీ బిల్లుపై వెనకడుగు వేయబోం. దేశానికి మేలు చేసే అంశాలపై బలవంతంగానైనా ముందుకువెళ్తాం’ అని అన్నారు. విక్షాల మద్దతు కూడగట్టే బృందంలో ఒకరైన గడ్కారీ.. రాజకీయ కారణాలతో, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికే కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తోంది అతి తక్కువ శాతమన్నారు. ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లుపై పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే బీజేడీ మద్దతు ప్రకటించిందని మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. -
భూ బిల్లుపై దీక్షకు సిద్ధం : అన్నా హజారే
-
భూ బిల్లుపై దీక్షకు సిద్ధం
విలాస్ టొకాలే లాతూ(మహారాష్ట్ర): సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ రైతులకన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. భూసేకరణ బిల్లులోని రైతు వ్యతిరేక అంశాలను తొలగించని పక్షంలో మరో నిరశన దీక్ష చేపట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం బిల్లులో మార్పులు చేయని పక్షంలో 2011లో లోక్‌పాల్ అంశంపై చేసినట్టే నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. దేశవ్యాప్తంగా జైల్ భరో ఆందోళన చేపడతామన్నారు. రైతు అనుకూల మార్పులు చేయాల్సిందిగా తాను ఇప్పటికే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. -
ఇప్పుడున్నది షూటూ, బూటూ సర్కార్: రాహుల్
-
నాటి చట్టాన్ని హడావుడిగా చేశారు
2013 భూసేకరణ చట్టానికి మద్దతిచ్చి బీజేపీ తప్పు చేసింది కార్పొరేట్లకు మేలు చేయట్లేదు భూసేకరణ బిల్లుపై ప్రధాని న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో 2013లో తీసుకువచ్చిన భూసేకరణ చట్టం హడావుడిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టానికి నాడు మద్దతునివ్వటం ద్వారా భారతీయ జనతాపార్టీ కూడా పొరపాటు చేసిందని ఆయన అన్నారు. దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీరు 120 ఏళ్ల చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకోండి. పాత చట్టాన్ని సమీక్షించటం కోసం కనీసం 120 గంటలైనా ప్రయత్నించారా? లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పిదమేం కాదు.. ఇందులో బీజేపీకి కూడా బాధ్యత ఉంది అని మోదీ చెప్పారు. 2013లో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో హడావిడిగా భూసేకరణ చట్టాన్ని ఆమోదింపజేశారని మోదీ అన్నారు. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు అందరు ముఖ్యమంత్రులు ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా నా దగ్గర ఉన్నాయి అని మోదీ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం భూసేకరణకు సంబంధించి అపోహలు సృష్టిస్తున్నారన్నారు. నిజం ఏమిటంటే, 2013 నాటి చట్టంలో కార్పొరేట్లకు సంబంధించి ఉన్న నిబంధనల్లో ఏ ఒక్క మార్పూ మేం చేయలేదు. ఈ చట్టానికి సవరణ చేయటం ద్వారా కార్పొరేట్లకు ఇంచు భూమి కూడా లబ్ధి చేకూర్చటం లేదు. అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు అని ఆయన అన్నారు. -
లోక్‌సభలో 'భూ'బిల్లు
నినాదాలు.. వాకౌట్ల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్ కు బిల్లు 30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు! న్యూడిల్లీ: నిరసనలు.. నినాదాలు.. వాకౌట్ల మధ్య కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద భూసేకరణ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, వామపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్పీకర్ సుమిత్రామహాజన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఇదే బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదన్న ప్రతిపక్షాల వాదనను స్పీకర్ తిరస్కరించారు. ఒకే విషయంపై లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టకూడదన్న నియమం ఏదీ లేదని మహాజన్ రూలింగ్ ఇవ్వటంతో విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న ఓ బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి సభ ఓటింగ్ సరిపోతుందని స్పీకర్ అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓటింగ్ ప్రకటించగానే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, వామపక్షాలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో మెజారిటీ ఉండటంతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఓటింగ్ సహజంగానే అనుకూలంగా వచ్చింది. ఆ వెంటనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ సరైన పరిహారాన్ని పొందే హక్కు, భూసేకరణలో పారదర్శకత, పునరావాస రెండో బిల్లు-2015 ను ప్రవేశపెట్టారు. జాయింట్ కమిటీకి భూ బిల్లు: భూసేకరణ బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపాలని నిర్ణయించింది. మంగళవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ నేతృత్వంలో ఉభయ సభల్లోని మొత్తం 30 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఓ తీర్మానాన్ని లోక్‌సభలో మంగళవారం ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ సంయుక్త కమిటీకి బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వం వహించే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లుపై కూడా ప్రభుత్వం అంగీకరించిన మేరకు 15 నుంచి 21 మందితో సెలెక్ట్ కమిటీని నియమిస్తారు. ఈ బిల్లుకు అన్నాడీఎంకే ఒక్కటే వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ జీఎస్టీ బిల్లు యూపీఏ మానసపుత్రిక కాబట్టి వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదానికి సహకరిస్తామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదించిన తరువాత దీనిపై 29 రాష్ట్రాలు తమ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. నల్లధనం బిల్లుకు ఆమోదం: నల్లధనంపై ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెడుతూ, ఇప్పటిదాకా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఉంచిన ఆదాయ వివరాలను పొందుపరచటానికి రెండు నెలల కాలావధితో ఒక వెసులుబాటును ఏర్పాటు చేస్తామని, ఈ వెసులుబాటును వినియోగించుకుని ఆదాయ వివరాలు తెలియజేసిన వారు ఆరు నెలల వ్యవధిలో 30 శాతం జరిమానా, 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలు తెలియజేయని వారిపై 90 శాతం జరిమానా, 30 శాతం పన్నుతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. కాగా దేశంలో నల్లధనాన్ని నియంత్రించేందుకు త్వరలోనే బినామీ బిల్లును తీసుకురానున్నట్లు జైట్లీ సభకు తెలియజేశారు. 2011 ప్రజావేగు పరిరక్షణ చట్ట సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. -
నేడు లోక్‌సభకు ‘భూ’ బిల్లు
సమావేశాలు మూడు రోజులు పొడిగింపు న్యూఢిల్లీ: మరోసారి పార్లమెంటులో ‘భూ’కంపం రానుంది. వివాదాస్పద భూసేకరణ బిల్లును శుక్రవారమే లోక్‌సభ ముందుకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో వేడి రాజుకోనుంది. భూసేకరణ సవరణ బిల్లుతో సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందువల్ల లోక్‌సభ బడ్జెట్ సమావేశాలను మరో మూడురోజులు పొడిగించారు. శుక్రవారంతో ముగియాల్సి ఉండగా ఈ నెల 13 వరకు పొడిగించారు. రాజ్యసభ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఆలస్యంగా మొదలయ్యాయి. మే 13 వరకు ఉన్నాయి. లోక్‌సభ సమావేశాలను కూడా 13 దాకా పొడిగించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీ) గురువారం సిఫారసు చేసింది. నిజానికి బుధవారం జరిగిన బీఏసీ భేటీలో లోక్‌సభ సమావేశాల పొడిగింపునకు మిత్రపక్షమైన శివసేనతో సహా పలు విపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల పొడిగింపునకు మొగ్గు చూపింది. భూసేకరణ సవరణ బిల్లు, నల్లధనం బిల్లు లాంటి ఎనిమిది బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. యూపీఏ 2013లో తెచ్చిన భూసేకరణ బిల్లులో సవరణలు తేవడం ద్వారా మోదీ ప్రభుత్వం ఈ చట్టం కోరలు పీకివేసిందనే అభిప్రాయం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లు-2015ను మార్చి పదో తేదీనే లోక్‌సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఏన్డీయే... దీనిని పెద్దల సభలో పెట్టే సాహసం చేయలేదు. ఈలోపు ఆర్డినెన్స్ గడువు సమీపించడంతో ఏప్రిల్ 3న మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన ఈ బిల్లును గతంలో తాము చేసిన 9 సవరణలతో శుక్రవారం యథాతథంగా లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెట్టనుంది. ఎగువసభలో బలం లేని నేపథ్యంలో ఏకాభిప్రాయం సాధించి విపక్షాల మద్దతును కూడగట్టడానికి ఈ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీని నివేదించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయవచ్చు. మిగిలిన నాలుగు రోజుల (శుక్ర, సోమ, మంగళ, బుధవారాలు) సమావేశాల్లో రెండు సభల్లోనూ ఈ బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. లోక్‌సభ ఆమోదం పొంది... రాజ్యసభలో తిరస్కరణకు గురైతే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని (దీనికి ఏదో ఒక సభ బిల్లును తిరస్కరించాలి) పిలిచి ఆమోదముద్ర వేసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. -
భూ బిల్లుపై నిరసనలు
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో వామపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో టీఎంసీ, జేడీయూ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు రైతు వ్యతిరేకమని, దీనివల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని పలువరు నేతలు హెచ్చరించారు. పార్లమెంటు వెలుపల రైతుల ఐక్యతే పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమకు పోరాడే శక్తినిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పేర్కొన్నారు. -
బిల్డర్ల కోసమే ‘రియల్ బిల్లు!
మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు విషయంలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్డర్ల ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా చేసేందుకే రియల్ ఎస్టేట్ బిల్లును సవరణలతో నీరుగారుస్తున్నారని ఆరోపించారు. రైతులు, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ జాబితాలో మధ్యతరగతిని కూడా చేర్చేసిందని విమర్శించారు. శనివారం ఢిల్లీలో కొందరు ఫ్లాట్ కొనుగోలుదారులతో భేటీ అయిన అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడారు. రైతులు, గిరిజనుల కోసం పోరాడుతున్నట్లే మధ్యతరగతి ప్రయోజనాలు కాపాడేందుకు వారి వెన్నంటి ఉంటానని చెప్పారు. రియల్ ఎస్టేట్(క్రమబద్ధీకరణ, అభివృద్ధి) బిల్లుకు చేసిన సవరణలను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఈనెల 5న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాహుల్ వ్యతిరేకిస్తుండడంతో.. ప్రభుత్వానికి మెజారిటీ తక్కువున్న పెద్దల సభలో ఇది గట్టెక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ‘మధ్యతరగతికీ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. యూపీఏ హయాం నాటి బిల్లును ఈ ప్రభుత్వం నీరుగారుస్తోంది. పాత బిల్లులో పారదర్శకత ఉండేది. ఇప్పుడు లోపించింది’ అని రాహుల్ అన్నారు. -
బిల్డర్ల కోసమే ‘రియల్ బిల్లు!
-
'రాజకీయ కుట్ర జరుగుతోంది'
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక సర్కారుగా ముద్ర వేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. దీన్ని ఒకవర్గం మీడియా హైలెట్ చేస్తోందని అన్నారు. భూసేకరణ బిల్లుకు విపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనీ ఆరోపణలు చేశారు. అన్నదాతల బాగుకోసమే భూసేకరణ బిల్లు తెచ్చామని గడ్కరీ స్పష్టం చేశారు. బిల్లులో ప్రతిపాదించిన ఐదు సవరణల్లో ఒక్కటైనా రైతులకు వ్యతిరేకంగా ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం రైతులకు, షెడ్యూల్ కులాలకు, తెగలకు వ్యతిరేకమన్న ముద్ర వేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. -
ల్యాండ్ బిల్లుపై రగడ.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల మొదటిరోజు లోకసభలో భూసేకరణ చట్టం - 2013 సవరణల బిల్లును సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. కేంద్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఈ ఆర్డినెన్సును సభలో ప్రవేశపెడుతున్నపుడు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కిసాన్ బచావో, దేశ్ బచావో అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ నేత ములాయంసింగ్ తదితర నేతలు ఆందోళనకు దిగారు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఈ బిల్లును రద్దు చేయాలని కోరుతూ కొంతమంది నేతలు వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చామని తెలిపారు. భారతీయులతో పాటు విదేశీయులను కూడా యెమెన్ నుంచి సురక్షితంగా తరలించామని వెల్లడించారు. లోకసభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించింది. ఎన్డీఏ ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేదిగా ఉందని... ఈ బిల్లును అడ్డుకొని తీరతామంటోంది కాంగ్రెస్. -
భూ సేకరణ బిల్లుపై చర్చకు సిద్ధం: మోదీ
న్యూఢిల్లీ : భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చకు సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా లోక్ సభ బడ్జెట్ మలివిడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజే వివాదాస్పదమైన భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు మోదీ సర్కారు యోచిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వ, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో పరిస్థితి వేడెక్కింది. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగే అవకాశం ఉంది. -
భూబిల్లుపై పోరాటం
ప్రభుత్వం వెనక్కు తీసుకునేదాకా ఉద్యమిస్తాం: రాహుల్‌గాంధీ రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అన్నదాతల సమస్యలు, పంటనష్టంపై ఆరా నేడు రాంలీలా మైదానంలో రైతుసభ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని, దీన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరు సాగిస్తామన్నారు. దాదాపు రెండు నెలల సెలవుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. శనివారమిక్కడ తన నివాసంలో రైతు సంఘాల ప్రతినిధులతో రెండు విడతలుగా సమావేశమై భూసేకరణ బిల్లుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇటీవలి అకాల వర్షాలతో పంటలకు జరిగిన న ష్టంపై ఆరా తీశారు. పంటలను ప్రభుత్వం ఏ ధరకు సేకరిస్తోందని అడిగారు. భూసేకరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా అన్నారు. రైతు సమస్యలపై తమ పోరాటం ఒకరోజు, నెల, ఏడాదికో పరిమితం కాదని రైతులతో రాహుల్ అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతు సమస్యలకు ప్రభుత్వం సహేతుక పరిష్కారం చూపే వరకు పోరు కొనసాగిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలు, వ్యవసాయం అంటే తెలియని వారు రైతు విధానాలకు రూపకల్పన చేస్తున్నారని కొందరు రైతులు రాహుల్‌తో అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గత యూపీఏ సర్కారులో కూడా ఇదే జరిగిందని పేర్కొన్నారు. ఆదివారం రాంలీలా మైదానంలో జరిగే రైతు సభలో రాహుల్ ఈ అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. 2011లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేపట్టిన భట్టా పర్సౌల్‌కు చెందిన రైతు ప్రతినిధులతోపాటు హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ఉత్తరప్రదేశ్ పీసీసీ అధినేత నిర్మల్ ఖత్రి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తన నివాసం ముందున్న వందలాది మంది రైతులతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మరికొందరు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చూపించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో.. రైతు సమస్యలను రాహుల్ సభలో లేవనెత్తుతారని పార్టీ తెలిపింది. ‘జమీన్ వాపసీ’ వెబ్సైట్ ప్రారంభం.. భూసేకరణ బిల్లుపై సామాజిక మీడియాలో కూడా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు శనివారం ప్రత్యేకంగా ‘జమీన్ వాపసీ’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సైట్‌ను పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రారంభించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈ సైట్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ప్రధాని మోదీ అవాస్తవాలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మరోవైపు భూసేకరణ బిల్లుపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. కేంద్రమంత్రి గడ్కారీ ఎప్పుడంటే అప్పుడు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం నాటి రైతు బహిరంగ సభకు దిగ్విజయ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. -
భూ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గళం విప్పనున్నారు. ఈ నెల 22న ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించే సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించనున్నారు. అంతేగాకుండా పార్లమెంట్ వరకూ నిర్వహించే నిరసన ప్రదర్శనకు ఆయన నేతృత్వం వహించే అవకాశం కూడా ఉంది. అయితే తుది కార్యక్రమానికి సంబంధించి మరింత కసరత్తు జరుగుతోందని సభకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆప్ ప్రతినిధి ఒకరు శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలని గత నెలజరిగిన ఆ పార్టీ జాతీయ మండలి భేటీలో నిర్ణయించడం తెలిసిందే. -
'భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తుంది'
భూసేకరణ బిల్లుపై విపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్రం వివిధ పార్టీలకు నచ్చజెప్పే పనిలో పడింది. ఆయా పార్టీల సూచనలను బిల్లులో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈ విషయంలో ఏకాభిప్రాయం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. సీనియర్ మంత్రులందరూ రాజకీయ పార్టీలకు నచ్చజెప్పే పనిలో ఉన్నారని బుధవారంతెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో రాజకీయమేమీ లేదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించగానే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపడతామని తెలిపారు. ఆయన బుధవారం స్వీడన్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అన్నా జాన్సన్ బృందంతో భేటీ అయ్యారు. -
'ఆ పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం'
హైదరాబాద్ : భూ సేకరణ చట్టం బిల్లును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణ చట్టం ప్రజా సంక్షేమం కోసమేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వెంకయ్య మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టం అమలు చేయాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ఆయన అన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ ఏప్రిల్ 6లోపు చట్టం కాకపోతే చెల్లుబడి కాదని అన్నారు. దాన్ని ఏవిధంగా చట్టం చేయాలన్నది కేంద్రం చూసుకుంటుందని వెంకయ్య అన్నారు. అర్థవంతమైన నిర్మాణాత్మక సలహాలు ఉంటే స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని వెంకయ్య నాయుడు అన్నారు. అంతేకానీ...వ్యతిరేకించాలి అంటూ వ్యతిరేకిస్తే పట్టించుకోమని ఆయన స్పష్టం చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతులు, రైతుల పిల్లలకు అన్ని రకాలుగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. మిషన్ కాకతీయ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వెంకయ్య ప్రశంసించారు. -
బహిరంగ చర్చకు రండి...
భూ బిల్లుపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధం విపక్షాలకు గడ్కారీ సవాలు; సోనియా, హాజరే, విపక్ష నేతలకు లేఖలు న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై చర్చకు రావాలని, బిల్లులోని ఏ అంశంపైనైనా, ఏ వేదిక మీదైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని విపక్షానికి ప్రభుత్వం సవాలు విసిరింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే సహా పలువురు విపక్ష నేతలకు గురువారం లేఖలు రాశారు. రాజకీయ కారణాలతోనే భూ బిల్లును విమర్శిస్తున్నారని, అందులో రైతు వ్యతిరేక ప్రతిపాదనలేవీ లేవని, అది పూర్తిగా రైతు అనుకూల బిల్లేనని ఆయన అందులో స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగపడే ప్రతిపాదనలేమైనా చేస్తే బిల్లులో చేర్చేందుకు సిద్ధమేనన్నారు. రైతు ప్రయోజనాలను కాలరాసేలా ఉందంటూ విపక్షం అంతా ఐక్యంగా భూ బిల్లును వ్యతిరేకిస్తూ, ఆ బిల్లును అడ్డుకోవాలంటూ రాష్ట్రపతికి సైతం వినతిపత్రం అందించిన నేపథ్యంలో గడ్కారీ ఈ లేఖలు రాయడం విశేషం. రైతులకు పరిహారం విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, నిజానికి ఈ బిల్లులో రైతులు, గ్రామాలు సుసంపన్నం అయ్యే ప్రతిపాదనలే ఉన్నాయని ఆ లేఖల్లో గడ్కారీ పేర్కొన్నారు. రైతుల తప్పనిసరి ఆమోదం, సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబంధనల్లో 13 ముఖ్యమైన చట్టాలను యూపీఏ ప్రభుత్వమే పొందుపర్చలేదన్నారు. ప్రతిపక్షంతో సంప్రదించకుండా బిల్లును రూపొందించారన్న ప్రచారం జరుగుతోందని, నిజానికి అన్ని రాష్ట్రాలతో చర్చించి, వారి సూచనలను బిల్లులో పొందుపర్చామని గడ్కారీ వివరించారు. శరద్‌యాదవ్(జేడీయూ), శరద్ పవార్(ఎన్సీపీ), ప్రకాశ్ కారత్(సీపీఎం), ములాయం సింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), దేవెగౌడ(జేడీఎస్), అరవింద్ కేజ్రీవాల్(ఆప్) తదితరులకు గడ్కారీ లేఖలు రాశారు. అకస్మాత్తుగా ఇంత జ్ఞానమేంటి? భూబిల్లుపై చర్చకు ఆహ్వానిస్తూ గడ్కారీ రాసిన లేఖపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ‘ఇంత అకస్మాత్తుగా ఈ జ్ఞానమెలా వచ్చింది? బీజేపీ భయపడుతోందా?’ అంటూ ఎద్దేవా చేసింది. గడ్కారీ లేఖ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇంకా చేరలేదని, చేరాల్సినవారికి తప్ప మిగతా అందరికీ చేరిందని ఆ పార్టీ నేత అజయ్ కుమార్ అన్నారు. -
భూ బిల్లుపై కదం తొక్కిన విపక్షం
సోనియా నేతృత్వంలో తరలివచ్చిన 14 విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన మార్గం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పణ న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షం అంతా ఏకమైంది. కలసి కదం తొక్కింది. బిల్లులోని రైతు వ్యతిరేక సవరణలను అడ్డుకుని తీరుతామని గళమెత్తింది. ఎలాగైనా బిల్లును ఆమోదింపచేసుకోవాలనుకుంటున్న మోదీ సర్కారు నియంతృత్వ పోకడలకు పోతోందంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రైతు ప్రయోజనాలను కాపాడేందుకు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరింది. బిల్లుపై రాజ్యసభలో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షమంతా కలసికట్టుగా కదలడం ఇదే ప్రథమం. 14 పార్టీలు.. వందకుపైగా ఎంపీలు కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, జేడీయూ, ఎన్సీపీ, ఐఎన్ఎల్డీ, ఆప్ సహ 14 విపక్షాల జాతీయ స్థాయి నేతలు ఒక్కటై కదిలిన అరుదైన దృశ్యం దేశ రాజధానిలో మంగళవారం ఆవిష్కృతమైంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన వందమందికి పైగా ఎంపీలు పార్లమెంట్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశారు. కిలోమీటరుపైగా దూరాన్ని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నడిచారు. ర్యాలీకి జేడీయూ చీఫ్ శరద్‌యాదవ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం వారిలో నుంచి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ సహా 26 మంది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి బిల్లుపైఅభ్యంతరాలను వివరించి, వినతిపత్రం సమర్పించారు. మోదీ సర్కారు ప్రతిపాదించిన సవరణల వల్ల ప్రజల్లో అంతరాలు పెరిగే, సామాజిక అసమతౌల్యత నెలకొనే ప్రమాదముందని హెచ్చరించారు. ‘భూ సేకరణ చట్టం, 2013లో మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణలకు వ్యతిరేకంగా మేమంతా ఏకమయ్యాం. సమాజంలో అంతరాలను, ప్రజల్లో విద్వేషాలను పెంచే మోదీ సర్కారు ప్రయత్నాలను అడ్డుకునేందుకు లౌకిక, అభ్యుదయ, ప్రజాస్వామ్య శక్తులన్నీ సిద్ధంగా ఉన్నాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ముందుకు తీసుకువెళ్లకుండా చూడాలని రాష్ట్రపతిని అభ్యర్థించాం’ అని ప్రణబ్‌తో భేటీ అనంతరం సోనియా వెల్లడించారు. కేవలం రైతులకే కాదు, భారతదేశానికే ప్రమాదకరమైన ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కుతీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని శరద్‌యాదవ్ తేల్చిచెప్పారు. రాష్ట్రపతిని కలిసినవారిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్(కాంగ్రెస్), లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే(కాంగ్రెస్), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), డీ రాజా(సీపీఐ), డెరెక్ ఒబ్రీన్(టీఎంసీ), కనిమొళి(డీఎంకే), ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ), దుష్యంత్ చౌతాలా(ఐఎన్ఎల్డీ), ధర్మవీర్ గాంధీ(ఆప్), జయప్రకాశ్ యాదవ్(ఆర్జేడీ).. తదితరులున్నారు. విపక్షాల ర్యాలీ సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. అవసరమైతే ఉపయోగించేందుకు వాటర్ క్యానన్లు, బారికేడ్లతో సిద్ధమై వచ్చారు. యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన భూ సేకరణ చట్టాన్ని అప్పుడు సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రూపొందించింది. ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతుల భూములను సేకరించే ప్రక్రియలో కఠిన నిబంధనలను అందులో చేర్చారు. ప్రైవేటు ప్రాజెక్టులకు 80%, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లోని ప్రాజెక్టులకు 70% భూ యజమానుల ఆమోదం తప్పని సరనే నిబంధన, ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా తదితర రైతు అనుకూల నిబంధనలను తొలగిస్తూ మోదీ ప్రభుత్వం పలు సవరణలతో తాజా బిల్లును తెచ్చింది. స్పష్టమైన మెజారిటీ ఉండటంతో లోక్‌సభలో దీన్ని ఆమోదింపజేసుకుంది కానీ అధికార పక్షం మైనారిటీలో ఉన్న రాజ్యసభలో అదంత సులభం కాని పరిస్థితి నెలకొంది. పోలీసురాజ్యం చేయాలనుకుంటున్నారు దేశాన్ని గుజరాత్ తరహాలో పోలీసు రాజ్యం చేయాలని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. పోలీసుల ద్వారా ప్రతిపక్షాల ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం అందులో భాగమేనంది. రైతుల గొంతు నొక్కాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి విమర్శించారు. మెమొరాండంలో ఏముంది!? బిల్లును స్థాయీ సంఘం అధ్యయనానికి పంపించాలని విపక్షం కోరుకుంటోంది. కానీ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీ, సెలెక్ట్ కమిటీ వ్యవస్థలను నాశనం చేయాలనుకుంటోంది. ‘రైతుల ఆమోద’ నిబంధన పూర్తిగా పక్కనబెట్టారు. దీంతో వారి భూముల్నిబలవంతంగా లాక్కోడానికి అవకాశం లభిస్తుంది. సేకరించిన భూమి దుర్వినియోగం కాకుండా, అనవసరంగా, అదనంగా భూ సేకరణ జరపకుండా, తప్పనిసరి పరిస్థితుల్లోనే బహుళ పంటలు పండే భూముల సేకరణ జరిపేలా.. చూసే ముఖ్యమైన రక్షణ కవచమైన ‘సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) నిబంధనను తొలగిస్తూ సవరణలు చేశారు. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలను దెబ్బతీసే అంశం. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. కార్పొరేట్లకు అనుచిత లబ్ధి చేకూర్చేలా.. పారిశ్రామిక కారిడార్ల కోసం పెద్ద మొత్తంలో భూముల సేకరణకు తలుపులు బార్లాతీశారు. -
భూసేకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!
-
భూసేకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మొత్తం 9 సవరణలకు లోక్ సభలో ఆమోద ముద్ర పడింది. అయితే దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేడీ సభ నుంచి వాకౌట్ చేశాయి. భూసేకరణ చట్టంలపై ప్రతిపక్షాలు చేసిన సవరణలు వీగిపోయాయి. ఇదిలా ఉండగా భూసేకరణ బిల్లుకు అన్నా డీఎంకే ఆమోదం తెలిపింది. కాగా బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన సభలో లేకపోవడం గమనార్హం. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత లోక్ సభ బుధవారానికి వాయిదా పడింది. -
భూసేకరణ బిల్లుకు వైఎస్సాఆర్ సీపీ సవరణలు!
-
భూసేకరణ చట్టంలో సవరణలపై ఓటింగ్!
-
వైఎస్సార్ సీపీ సవరణలపై ఓటింగ్..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుపై వైఎస్సార్ సీపీ ప్రతిపాదించిన సవరణలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ తీర్మానాన్ని తప్పనిసరి చేయడమే కాకుండా, మూడు పంటలను భూములను భూసేకరణ చట్టం తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించారు. దీనిపై వైఎస్సార్ సీపీకి అనుకూలంగా 101 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 311 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్ సీపీ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఇదిలా ఉండగా భూసేకరణ చట్టంలోని సవరణలపై సభ నుంచి బీజేడీ వాకౌట్ చేసింది. రైతుల అంగీకారం, సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ తీర్మానాలు తాము వ్యతిరేకమంటూ సభ నుంచి బీజేడీ వాకౌట్ అయ్యింది. అయితే కొన్ని సవరణలకు మాత్రం బీజేడీ మద్దతు తెలిపింది. -
భూసేకరణ చట్టంలో సవరణలకు టీడీపీ మద్దతు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టంలో సవరణలపై మంగళవారం రాత్రి లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమయ్యింది. చట్టంలో మొత్తం తొమ్మిది సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో విపక్షాలు చేసిన కొన్ని సూచనలను ప్రభుత్వం పరిగణిలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు టీడీపీ మద్దతు తెలిపింది. ఇదిలా ఉండగా తమ పార్టీ చేసిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు మద్దతిస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్(సామాజిక ప్రభావ అంచనా) పై విపక్షాల పట్టు పట్టినా.. ఆ తీర్మానం వీగిపోయింది. -
మార్చి 25నుంచి అన్నాహజారే పాదయాత్ర
-
'మా సవరణలకు ఒప్పుకుంటేనే భూ బిల్లుకు మద్దతు'
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశాల వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాకు వివరించారు. భూసేకరణ చట్టంపై అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. బహుళ పంటలు పండే భూములను ఈ చట్టం ద్వారా సేకరించడానికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక ప్రభావాన్ని అంచనా వేయకుండా చట్టాన్ని తీసుకొస్తే తాము మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. తాము చెప్పే ఈ రెండు సవరణలు చేస్తేనే బిల్లుకు మద్దతిస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రధానంగా సభలో లేవనెత్తుతామన్నారు. ప్రభుత్వం అంగీకరించకుంటే సవరణలు ఇచ్చి డివిజన్ కోరుతామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో పోరాడాలని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమకు సూచించారని మేకపాటి తెలిపారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రకటించారని.. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఐదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యే హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం మేకపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకే మాటపై ఉంటే ప్రత్యేక హోదా తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అరకొర నిధులు కాకుండా మరిన్ని నిధులు కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని మేకపాటి వెల్లడించారు. -
ఇక కట్టుదిట్టంగా ‘భూసేకరణ’
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఏ భూములనైనా బలవంతంగా సేకరించేందుకు వీలు కాదు. భూసేకరణ కోసం భూములను వదులుకున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడం జరుగుతుంది. శతాబ్దానికి పైబడ్డ చట్టం స్థానంలో ప్రభుత్వం ఈ మేరకు భూసేకరణ, పునరావాసం, పరిహారం-2012 బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులోని నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారాన్ని చెల్లిస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 216, వ్యతిరేకంగా 19 ఓట్లు పడ్డాయి. ఏఐఏడీఎంకే, బీజేడీ సభ్యులు వాకౌట్ చేయగా, తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బీఎస్పీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లుకు 381 సవరణలను ప్రతిపాదించగా, వాటిలో 166 అధికారిక సవరణలు. విపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణల్లో కొన్నింటిని ఉపసంహరించుకోగా, ఓటింగులో కొన్ని వీగిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ నేత, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు అనారోగ్య కారణంగా ఓటింగులో పాల్గొనలేదు. బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్న సమయంలోనే వారు సభ నుంచి వెళ్లిపోయారు. భూములను సేకరించే బదులు, వాటిని లీజుకిచ్చినట్లయితే రైతులకు వాటిపై వార్షికాదాయం లభిస్తుందని సుష్మా సూచించారు. భూసేకరణ ఫలితంగా వ్యక్తులకు లభించే సొమ్ముపై ఆదాయపు పన్ను లేదా స్టాంపు సుంకం ఉండదు. సేకరించిన భూమిని అధిక ధరకు ఇతరులకు విక్రయించినట్లయితే, వచ్చిన లాభంలో 40 శాతాన్ని సంబంధిత భూమి యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. భూసేకరణ బిల్లు ముఖ్యాంశాలు... మార్కెట్ విలువకు గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు పరిహారం చెల్లించాలి గత భూసేకరణలకు నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే ఈ బిల్లు ప్రకారమే వాటికి పరిహారం చెల్లింపు వర్తిస్తుంది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేనిదే భూ సేకరణ జరపరాదు. పూర్తి పరిహారం చెల్లించి, పునరావాసానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సిద్ధం చేసేదాకా భూమిని స్వాధీనం చేసుకోరాదు {పభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టులకు భూమిసేకరించాలంటే 70శాతం, ప్రైవేటు కంపెనీలకైతే 80% మంది భూయజమానుల అంగీకారం తప్పనిసరి. సాగు భూముల సేకరణపై రాష్ట్రాలు పరిమితులు పెట్టాలి సేకరించిన భూమిని ఉపయోగించకపోతే.. ఆ భూమిని తిరిగి యజమానులకు/రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అందే మొత్తంపై ఎలాంటి ఆదాయపు పన్ను, స్టాంపు డ్యూటీ విధించరాదు