నేడు లోక్‌సభకు ‘భూ’ బిల్లు | today 'land' bill of Lok Sabha | Sakshi
Sakshi News home page

నేడు లోక్‌సభకు ‘భూ’ బిల్లు

Published Fri, May 8 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

today 'land' bill of Lok Sabha

సమావేశాలు మూడు రోజులు పొడిగింపు

న్యూఢిల్లీ: మరోసారి పార్లమెంటులో ‘భూ’కంపం రానుంది. వివాదాస్పద భూసేకరణ బిల్లును శుక్రవారమే లోక్‌సభ ముందుకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో వేడి రాజుకోనుంది. భూసేకరణ సవరణ బిల్లుతో సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందువల్ల లోక్‌సభ బడ్జెట్ సమావేశాలను మరో మూడురోజులు పొడిగించారు. శుక్రవారంతో ముగియాల్సి ఉండగా ఈ నెల 13 వరకు పొడిగించారు. రాజ్యసభ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఆలస్యంగా మొదలయ్యాయి. మే 13 వరకు ఉన్నాయి.

లోక్‌సభ సమావేశాలను కూడా 13 దాకా పొడిగించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీ) గురువారం సిఫారసు చేసింది. నిజానికి బుధవారం జరిగిన బీఏసీ భేటీలో లోక్‌సభ సమావేశాల పొడిగింపునకు మిత్రపక్షమైన శివసేనతో సహా పలు విపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల పొడిగింపునకు మొగ్గు చూపింది. భూసేకరణ సవరణ బిల్లు, నల్లధనం బిల్లు లాంటి ఎనిమిది బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

యూపీఏ 2013లో తెచ్చిన భూసేకరణ బిల్లులో సవరణలు తేవడం ద్వారా మోదీ ప్రభుత్వం ఈ చట్టం కోరలు పీకివేసిందనే అభిప్రాయం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లు-2015ను మార్చి పదో తేదీనే లోక్‌సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఏన్డీయే... దీనిని పెద్దల సభలో పెట్టే సాహసం చేయలేదు. ఈలోపు ఆర్డినెన్స్ గడువు సమీపించడంతో ఏప్రిల్ 3న మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన ఈ బిల్లును గతంలో తాము చేసిన 9 సవరణలతో శుక్రవారం యథాతథంగా లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెట్టనుంది.

ఎగువసభలో బలం లేని నేపథ్యంలో ఏకాభిప్రాయం సాధించి విపక్షాల మద్దతును కూడగట్టడానికి ఈ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీని నివేదించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయవచ్చు. మిగిలిన నాలుగు రోజుల (శుక్ర, సోమ, మంగళ, బుధవారాలు) సమావేశాల్లో రెండు సభల్లోనూ ఈ బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. లోక్‌సభ ఆమోదం పొంది... రాజ్యసభలో తిరస్కరణకు గురైతే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని (దీనికి ఏదో ఒక సభ బిల్లును తిరస్కరించాలి) పిలిచి ఆమోదముద్ర వేసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement