న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల మొదటిరోజు లోకసభలో భూసేకరణ చట్టం - 2013 సవరణల బిల్లును సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. కేంద్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఈ ఆర్డినెన్సును సభలో ప్రవేశపెడుతున్నపుడు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కిసాన్ బచావో, దేశ్ బచావో అంటూ నినాదాలతో హోరెత్తించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ నేత ములాయంసింగ్ తదితర నేతలు ఆందోళనకు దిగారు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఈ బిల్లును రద్దు చేయాలని కోరుతూ కొంతమంది నేతలు వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
అంతకుముందు యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చామని తెలిపారు. భారతీయులతో పాటు విదేశీయులను కూడా యెమెన్ నుంచి సురక్షితంగా తరలించామని వెల్లడించారు. లోకసభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించింది. ఎన్డీఏ ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేదిగా ఉందని... ఈ బిల్లును అడ్డుకొని తీరతామంటోంది కాంగ్రెస్.