న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్‌గా కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
కాగా, గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీనే లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్ గాంధీ ఉండాలని తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానంలో గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘ నా పార్లమెంట్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పేరు మీదనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాను. నాకు తెలిసి లోక్‌సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్షనేత ఉండాలి. ఎన్నికైన ఎంపీలందరిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ’’ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా సైతం లోక్‌సభలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని తలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు. లోక్‌సభలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రాహుల్ గాంధీ తన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ పెద్దలు, ఎంపీలు తీసుకుంటారు. కానీ ఏకగ్రీవంగా ఉన్న ఒకే ఒక అవకాశం.. రాహుల్ గాంధీనే’’ అని తెలిపారు.
ఈ విషయంపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. నా వ్యక్తిగతంగా.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటే అది సరైన నిర్ణయంగా భావిస్తానని అన్నారు. ఇక 2019లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకావటంతో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment