- 2013 భూసేకరణ చట్టానికి మద్దతిచ్చి బీజేపీ తప్పు చేసింది
- కార్పొరేట్లకు మేలు చేయట్లేదు
- భూసేకరణ బిల్లుపై ప్రధాని
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో 2013లో తీసుకువచ్చిన భూసేకరణ చట్టం హడావుడిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టానికి నాడు మద్దతునివ్వటం ద్వారా భారతీయ జనతాపార్టీ కూడా పొరపాటు చేసిందని ఆయన అన్నారు. దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీరు 120 ఏళ్ల చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకోండి. పాత చట్టాన్ని సమీక్షించటం కోసం కనీసం 120 గంటలైనా ప్రయత్నించారా? లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పిదమేం కాదు.. ఇందులో బీజేపీకి కూడా బాధ్యత ఉంది అని మోదీ చెప్పారు. 2013లో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో హడావిడిగా భూసేకరణ చట్టాన్ని ఆమోదింపజేశారని మోదీ అన్నారు. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు అందరు ముఖ్యమంత్రులు ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా నా దగ్గర ఉన్నాయి అని మోదీ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం భూసేకరణకు సంబంధించి అపోహలు సృష్టిస్తున్నారన్నారు. నిజం ఏమిటంటే, 2013 నాటి చట్టంలో కార్పొరేట్లకు సంబంధించి ఉన్న నిబంధనల్లో ఏ ఒక్క మార్పూ మేం చేయలేదు.
ఈ చట్టానికి సవరణ చేయటం ద్వారా కార్పొరేట్లకు ఇంచు భూమి కూడా లబ్ధి చేకూర్చటం లేదు. అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు అని ఆయన అన్నారు.