బిల్లుపై సిఫారసుల సమర్పణకు వారం గడువు పొడిగింపు కోరిన జేపీసీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై సెప్టెంబర్‌లో జరగబోయే బిహార్ ఎన్నికల తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ).. తన సిఫారసులను అందించటానికి మరో వారం రోజులు గడువు పొడిగించాలని కోరింది. బిల్లుపై జేపీసీలో ఏకాభిప్రాయం లేకపోవటం, మరోవైపు లలిత్‌గేట్ వివాదం సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భూసేకరణ బిల్లును తెస్తే విపక్షాల దాడికి మరో ఆయుధాన్ని అందించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు.
వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లును ప్రవేశపెట్టకపోతే.. బిహార్ ఎన్నికల అనంతరం జరిగే శీతాకాల సమావేశాల్లో దానిని ప్రవేశపెడతారు. అయితే.. రాజ్యసభలో తనతో పాటు ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, జేడీయూ తదితర పార్టీలు భూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఎగువ సభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం వంటి పరిస్థితులను బట్టి.. ఈ బిల్లును దాని వాస్తవ రూపంలో ఆమోదించుకోవాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహించటం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. 30 మంది సభ్యులున్న జేపీసీలో బీజేపీ ఎంపీలు కేవలం 11 మందే ఉన్నారని.. మెజారిటీ ఓటుతో బిల్లును అంగీకరించాలంటే అధికారపక్షానికి మరో ఐదు ఓట్లు అవసరమవుతాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాల అసమ్మతి ప్రకటనలతో ఈ బిల్లు జేపీసీ నుంచి పార్లమెంటు ముందుకు వస్తుందని పేర్కొంటున్నాయి.
భూ బిల్లుపై స్వదేశీ జాగర ణ్ మండిపాటు
ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లుపై ఆరెస్సెస్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) కూడా మండిపడింది. అందులో ఆమోదయోగ్యంకాని అనేక సెక్షన్లు ఉన్నాయని విమర్శించింది. జీపీసీ ముందు ఎస్‌జేఎం జాతీయ కన్వీనర్ అశ్వనీ మహాజన్ నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు హాజరై అభిప్రాయాలు తెలిపారు.
బిహార్ ఎన్నికల తర్వాతే భూబిల్లు!
Published Tue, Jun 30 2015 11:59 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement