
భూ బిల్లు 'వర్షా' ర్పణం కానుందా?
- వర్షాకాల సమావేశాల్లో భూ సేకరణ సవరణ బిల్లు సభ ముందుకు అనుమానమే
- ప్రభుత్వానికి ఇంకా చేరని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తుది నివేదిక
- జేపీసీలో స్పష్టతవస్తేగానీ బిల్లుకు సహకరించబోమని విపక్షాల పట్టు
- మరోవైపు లిలిత్ గేట్ పోటు.. మల్లగుల్లాలు పడుతోన్న మోదీ సర్కార్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ భూ సేకరణ సవరణ బిల్లు ఎన్డీఏ ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగల్చనుందా? అసలా బిల్లు సభ ముందుకు రాకుండానే సమావేశాలు ముగుస్తాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. బిల్లు ఆమోదం కోసం ఎగువ, దిగువ సభల సభ్యులతో ఏర్పాటయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సమయానికి అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
బీజేపీ ఎంపీ అహ్లువాలియా నేతృత్వంలో ఇరు సభల సభ్యులతో ఏర్పాటయిన జేపీసీ.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై బిల్లులో చేయాల్సిన మార్పులపై సమాలోచనలు జరిపింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని, మరిన్ని భేటీల తర్వాతగానీ బిల్లులో మార్పులపై స్పష్టత వస్తుందని, అందుకోసం మరో మూడు, నాలుగు వారాలు గడువు అవసరం ఉందని జేపీసీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసెకెళ్లింది. జులై 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే జేపీసీ నివేదిక పూర్తవుతుందని, దాంతో భూ బిల్లును సులభంగా గట్టెక్కించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. కాగా మరింత గడువు కావాలని జేపీసీ కోరడంతో మోదీ సర్కారు ఇరుకున పడ్డట్టయింది. ఒకవేళ వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లు చర్చకు రాకుంటే మరో సారి ఆర్డినెన్స్ తప్ప మరో మార్గంలేదు బీజేపీకి. ఎందుకంటే పార్లమెంట్ శీతకాల సమావేశాలు డిసెంబర్ లో జరుగుతాయి. ఆలోపు ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. అప్పుడు మరోసారి ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంటుంది.
జులై 21 నుంచి ఆగస్లు 13 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో భూబిల్లుతోపాటు లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్‌టీ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది.