ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?
న్యూఢిల్లీ: అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పౌరులనూ మిలిటెంట్ల మాదిరిగా చూస్తారా’ అంటూ ఆయన ప్రశ్నించారు.
‘పౌరులను మిలిటెంట్ల మాదిరిగా చూస్తూ.. వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేయకండి. వ్యాలీలోని ప్రజల పట్ల అనుచితమైన బలప్రయోగాన్ని చూపకండి’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల కూడా జవాన్లు తూటాలు, పెల్లెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆజాద్ తాను ఎంతో బాధాతప్తుడినై ఈ సభ ముందు ఉన్నానని చెప్పారు. ‘మిలిటెన్సీని అంతం చేయడంలో మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ పౌరుల పట్ల ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం సమర్థించం’ అని ఆయన పేర్కొన్నారు.
మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో కొనసాగుతున్న ఈ అశాంతిపై రాజ్యసభలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో మొదట ఆజాద్ మాట్లాడారు.