పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా సాగుతాయని ఊహించినదే. అయితే మొదటి రోజే రానున్న నెల రోజులు ఎలా ఉండనున్నాయో అర్థమైపోయింది. అల్లరిమూకలు మణిపుర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను తొలి రోజే కుదిపేసింది. పాలకులు సిగ్గుపడాల్సిన ఈ మణిపుర్ ఘటనపై పూర్తి స్థాయి చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
రెండున్నర నెలల పైగా మణిపుర్ అగ్నికీలల్లో దగ్ధమవుతున్నా మూగనోము వీడని పాలకులు సుప్రీమ్ కోర్ట్‌కో, ఓటర్లలో వెల్లువెత్తే నిరసనకో వెరచి ఎట్టకేలకు పార్లమెంట్ తొలి రోజున పెదవి విప్పారు. సభ సమావేశంలో ఉన్నా అక్కడ కాకుండా, మీడియా ఎదుట మాత్రం విచారం వ్యక్తం చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పగలిగారు. ప్రధాని సైతం సభలో మణిపుర్‌పై చర్చలో పాల్గొని జవాబివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, హోమ్ మంత్రి మాట్లాడతారని అధికారపక్షం ఆశ్వాసిస్తోంది. మొత్తానికి ఒక్క మణిపురే కాదు... ఢిల్లీలో ఎన్నికైన ‘ఆప్’ ప్రభుత్వాన్ని కాదని అధికా రాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు దఖలు పరిచే ఆర్డినెన్స్, డేటా రక్షణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) – ఇలా అనేక అంశాలు ఈ సమావేశాల్ని విమర్శల జడివానగా మార్చనున్నాయి.
ఆగస్ట్ 17 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో అంతా సజావుగా సాగితే 17 రోజులు పార్లమెంట్ పని చేయాలి. ఈసారి శాసన నిర్మాణ అజెండాలో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ సంఘాలు పరిశీలించిన అటవీ, జీవావరణ వైవిధ్య చట్టసవరణ సహా 8 పెండింగ్ బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వ ఆలోచన. అలాగే, వ్యక్తిగత డేటా భద్రత బిల్లు సహా కొత్తగా మరో 21 బిల్లులకు ఆమోదముద్ర వేయించాలనీ భావిస్తోంది. ముందుగా ప్రకటించిన వీటికి తోడు జాబితాలో లేనివాటినీ ప్రభుత్వం సభ ముందుకు తేవచ్చు. ముందుగా చెప్పకుండానే 2019 ఆగస్ట్ 5న రాజ్యసభలో జమ్ము–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పాలకపక్షం ప్రవేశపెట్టిన అనుభవం ఉంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా పార్లమెంట్ కీలక చట్టాలు చేయడం కొంత కాలంగా జరుగుతున్నదే. 2019 ఎన్నికలకు ముందు 2018 వర్షాకాల సమావేశాల్లో ఆర్థిక నేరగాళ్ళ ఆస్తుల స్వాధీనం చట్టాన్నీ, 2014 ఎన్నికలకు ముందు 2013 వర్షాకాల సమావేశాల్లో జాతీయ ఆహార భద్రత చట్టాన్నీ నాటి పాలకపక్షాలు చేశాయి. ఈసారి అలాగే యూసీసీ ప్రస్తావనకు రావచ్చు.
వరదలు, అధిక ధరలు, రైళ్ళ భద్రత సహా అనేక అంశాలున్నాయి. కానీ, పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న అధికార, ప్రతిపక్షాల మధ్య పార్లమెంట్‌లో ప్రజాసమస్యల ప్రస్తావన, వాటిపై సరైన చర్చ ఎంత వరకు ఉంటాయనే అనుమానం కలుగుతోంది. మహిళలపై అమానుష ఘటనలో 48 రోజుల తర్వాత కానీ మణిపుర్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదంటే, సామూహిక అత్యాచార నిందితులు పాతికమందిలో ఒక్కరి అరెస్టుకే 77 రోజులు పట్టిందంటే ఏమనాలి? మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎంపీ నిష్పూచీగా, నిర్లజ్జగా తిరుగుతుంటే ఏం చేయాలి? పాలకుల ఈ నిర్లిప్తతనూ, నిష్క్రియా పరత్వాన్నీ కచ్చితంగా నిలదీయాలి. మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలంటూ ప్రభుత్వాన్ని వంచి, ఒప్పించాలి.
కానీ, అందుకోసం షరా మామూలుగా సభ కార్యకలాపాల్ని అడ్డుకొంటే లాభం లేదు. వేర్వేరు మార్గాల ద్వారా సభలోనే పాలకవర్గాన్ని నిలదీసి, జవాబివ్వక తప్పనిస్థితిలోకి నెట్టవచ్చు. కార్యాచరణకు దిగేలా చూడవచ్చు. దీనికి ప్రతి పక్షాల మధ్య ఐక్యత, ఎప్పటికప్పుడు ముందస్తు వ్యూహరచన తప్పనిసరి. పరస్పర వైరుద్ధ్యాల మధ్య కూడా అనివార్య తతో ఇటీవలే ‘ఇండియా’ పేరిట ఎన్నికల కూటమి కట్టిన 26 ప్రతిపక్షాల్లో అలాంటి సభా సమ న్వయం ఏ మేరకు ఉంటుందో చూడాలి. అర్థవంతమైన చర్చలకూ, ప్రజాసమస్యల పరిష్కారాలకూ వేదిక కావాల్సిన ప్రజాస్వామ్య దేవా లయం కొన్నేళ్ళుగా పలు దుస్సంప్రదాయాలకు మౌనసాక్షిగా మిగలాల్సి వస్తోంది.
ప్రస్తుత లోక్‌సభ అయిదేళ్ళ కాలపరిమితి 2024 ప్రథమార్ధంలో ముగిసిపోనుంది. రాజ్యాంగ విహితమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే ఇంతకాలంగా అధికారపక్షం చక్రం తిప్పుతోంది. ఇది మన పార్లమెంటరీ చరిత్రలోనే కనివిని ఎరుగనిది. మరి ఈ సమావేశాల్లోనైనా ఉప సభాపతి ఎన్నికకు పాలకపార్టీ ఊ కొడుతుందా అంటే చెప్పలేం. సంఖ్యాబలం ఉందని అధికార పక్షం, ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధం వేయాలని ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న మంకుపట్టు కారణంగా చర్చలు, సంప్రతింపులు అటకెక్కాయి. పెద్దగా చర్చలేమీ లేకుండానే అనేక బిల్లులు మూజువాణీ ఓటుతో చట్టాలైపోతున్న శోచనీయమైన పరిస్థితులు చూస్తున్నాం.
వాకౌట్లు, సస్పెన్షన్లతోనే సమావేశాలు తూతూ మంత్రంగా నడిచి, మమ అనిపిస్తున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటివాళ్ళమని జబ్బలు చరుచుకొనేవారు ఇకనైనా కళ్ళు తెరవాలి. అలాగే, పార్లమెంట్ సజావుగా సాగడం అధికార, ప్రతిపక్షాల సమష్టి బాధ్యత. నిమిషానికి రూ. 2.5 లక్షల వంతున వెచ్చిస్తున్న ప్రజాధనం వృథా కానివ్వరాదని ప్రజాప్రతినిధులు స్ఫురణలో ఉంచుకోవాలి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరొక్కసారి శీతకాలంలో మాత్రమే పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలకు వీలుంటుంది. కాబట్టి, ఈసారైనా మన పార్లమెంట్ అంకగణితపు లెక్కల కన్నా అత్యవసర అంశాలపై కనీసపాటి చర్చకు వేదిక కావాలి. ప్రజాస్వామ్యానికి అదే అసలైన ధన్యత.
Comments
Please login to add a commentAdd a comment