మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదనడానికి ఇది అత్యుత్తమ ఉదాహరణ. మహిళా సాధికారికత, స్త్రీ–పురుష సమానత్వం గురించి గొప్పలు చెప్పే మన ప్రజాస్వామ్య దేశంలో శాసన నిర్మాణ వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యం ఇప్పటికీ అతి తక్కువగానే ఉంది. పార్లమెంట్ శీతకాల సమావేశాల సాక్షిగా ఇది మరోసారి వెల్లడైంది. మన పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా ఎంపీల వాటా 15 శాతం లోపలే. ఇక, దేశవ్యాప్తంగా రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ఎమ్మెల్యేల సగటు సంఖ్య 8 శాతమే. ఇటీవలి గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లోనూ ఇదే కథ పునరావృతమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్ర సర్కార్ సమాధానం కోసం సుప్రీమ్ కోర్ట్ ఎదురుచూస్తున్న వేళ తాజా పరిణామాలు చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యంపై చర్చ రేపుతున్నాయి.
న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు రాజకీయ పార్టీల చిత్తశుద్ధి లేమిని కళ్ళకు కడుతున్నాయి. జనాభాలో సగం ఉన్న మహిళా లోకానికి చట్టసభల్లో 33 శాతం కనీస రిజర్వే షన్ల చట్టం చేయడానికి రాజకీయ నేతలు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిజానికి, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా 1996లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అనేక పరిణామాలు, అపరిమిత ఆలస్యం తర్వాత 2010లో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అయితే, నాటి 15వ లోక్‌సభ కాలపరిమితి తీరిపోవడంతో ఆ బిల్లు మురిగి పోయింది. కొత్తగా మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని ఇటీవల సైతం తృణమూల్ సహా పలు పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. లైంగిక సమన్యాయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్న ఢిల్లీ పెద్దలు పార్లమెంట్‌లో బిల్లు తేవడానికి మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలనే సాకుతో తాత్సారం చేస్తున్నారు.
మహిళల అభ్యున్నతి, సంక్షేమం గురించి గొప్పగా చెప్పే మన రాజకీయ పక్షాలు వాస్తవంలో అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదనేది నిష్ఠురసత్యం. ఇటీవల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైనవారిలో 8.2 శాతమే మహిళలు. ఇక, 68 మంది సభ్యుల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే ఆ రాష్ట్రంలోని మొత్తం 412 మంది నామినీల్లో కేవలం 24 మందే మహిళా అభ్యర్థులు. అంటే, బరిలోకి దిగిన స్త్రీలు 6 శాతమే. చదువులో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, చదువుకొనే ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్ళు – స్కూటర్లు, నెలవారీ భత్యం – ఇలా ఎన్నికల్లో వాగ్దానాల వర్షానికి అంతు లేదు. పార్టీల టికెట్ల పంపిణీలో మాత్రం మగాళ్ళకే పెద్ద పీట. బీజేపీ ఆరుగురు, ఆప్ అయిదుగురు, కాంగ్రెస్ ముగ్గురు స్త్రీలనే బరిలోకి దింపాయి. చిత్రంగా హిమాచల్‌లో ఓటేసినవారిలో పురుషుల కన్నా స్త్రీలే అధికం.
ఓటర్లలో దాదాపు సగం స్త్రీలే ఉన్న గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ బరిలో మహిళా అభ్యర్థులు 9 శాతమే. బీజీపీ 18 మందినీ, కాంగ్రెస్ 14 మందినీ పోటీలో పెట్టాయి. చివరకు గత అసెంబ్లీలో రికార్డు స్థాయిలో 17 మంది మహిళా ఎమ్మెల్యేలుంటే, తాజా అసెంబ్లీలో ఆ సంఖ్య 14కు పరిమితమైంది. ఈ ధోరణిని మార్చడానికి జరుగుతున్న కృషి అంతంత మాత్రమే. లోక్‌సభలో, శాసనసభల్లో మూడింట ఒక వంతు స్థానాలను స్త్రీలకే రిజర్వ్ చేయడానికి ఉద్దేశించినదే – 2008 నాటి 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ పైకి సూత్రప్రాయంగా అంగీకరిస్తు న్నాయి. తీరా సభలో ఆమోదానికొచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గా లకూ, స్త్రీలకూ తగు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుంది. కానీ ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాల్లో అతిపెద్దదైన భారత్‌లోనే పరిస్థితి తద్భిన్నంగా ఉండడం శోచనీయం.
స్త్రీ పురుషులిరువురూ సమానులే అన్నది రాజ్యాంగ అభిభాషణ. కానీ, భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలంటూ గుండెలు చరుచుకుంటున్న నాటికి కూడా అది వాస్తవంలోకి రాలేదన్నది విషాదం. దేశజనాభాలో సగం ఉన్నవారికి శాసన నిర్మాణంలో అతి తక్కువ స్థానమివ్వడం ఏ రకంగా సబబు? ప్రపంచ పటంపై ఏ రకంగా శోభస్కరం. 2022 మే లెక్కల ప్రకారం అమెరికా, ఐరోపా, సహారా ఎడారికి దక్షిణాన ఉండే సబ్–సహారా ఆఫ్రికా ప్రాంతంలో సైతం జాతీయ పార్లమెంటుల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రపంచ సగటు (26.2 శాతం) కన్నా ఎక్కువే. చివరకు నేపాల్ (34 శాతం), బంగ్లాదేశ్ (21), పాకిస్తాన్ (20), భూటాన్ (17)లు సైతం మనకన్నా మెరుగ్గా ఉన్నాయి.
సైనికోద్యోగాల నుంచి ప్రపంచదేశాల ఆధిపత్యం దాకా అన్నిటా మహిళలు ముందున్న రోజుల్లో మన చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందంటే తప్పు మనదే! సమాజంలో, రాజకీయాల్లో పాతుకుపోయిన పురుషాధిపత్యానికీ, లింగ దుర్విచక్షణకూ అది ప్రతీక. ఇప్పటికీ రిజర్వేషన్ల బిల్లు తేవడానికీ, చట్టం చేయడానికీ ఏకాభిప్రాయమంటూ ఏళ్ళూపూళ్ళూ చేయడం సరికాదు. అసలంటూ మహిళా సాధికారికత పట్ల అంకితభావం ఉంటే, దానికి చట్టం కోసం చూడాల్సిన పనీ లేదు. మనసుంటే మార్గాలెన్నో! పార్టీలన్నీ పెద్ద సంఖ్యలో మహిళలకు టికెట్లిచ్చి, చట్టసభలకు ఎన్నికల బరిలో దింపితే కాదన్నది ఎవరు? ఇన్నేళ్ళలో ఇప్పటికి దేశంలో రెండోసారి ఓ మహిళ రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించారు. ఆకాశంలో సగమంటూ మాటల్లో మనం కీర్తిస్తున్న ఆడవారికి చట్టసభల్లోనూ సముచిత ప్రాధాన్యం ఇవ్వడానికి ఇంతకు మించిన సమయం, సందర్భం మరొకటి ఉండదేమో!
Comments
Please login to add a commentAdd a comment