దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్‌టీఏ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది.
ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్‌లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది.
పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది.
మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్‌కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్‌ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్‌కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి.
ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్‌లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు.
చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్‌కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్‌చిప్‌గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది.
నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు.
అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది.
లీకు వీరులకు బ్రేక్!
Published Fri, Feb 9 2024 1:14 AM | Last Updated on Fri, Feb 9 2024 1:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment