ఈ మార్పు మంచికేనా?! | Sakshi Editorial On no detention policy in education department | Sakshi
Sakshi News home page

ఈ మార్పు మంచికేనా?!

Published Thu, Dec 26 2024 12:13 AM | Last Updated on Thu, Dec 26 2024 12:13 AM

Sakshi Editorial On no detention policy in education department

విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. 

పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్‌ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 

రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్‌ వెలువడింది. 

‘నో డిటెన్షన్‌’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఒక విద్యార్థిని ఫెయిల్‌ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్‌’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్‌’ విధానం పెట్టి ఊరుకోలేదు. 

అందులోని 29(2)(హెచ్‌) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. 

కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్‌’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. 

చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. 

విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్‌లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వంటివి ట్యూషన్‌ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. 

ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్‌లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్‌కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్‌ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. 

‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్‌’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. 

అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌. పాలకులు దాన్ని గుర్తెరగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement