మునిసిపల్ హైస్కూళ్లకు జూనియర్ టీచర్లు
ఖాళీగా 2,800 పోస్టులు.. సర్దుబాటులోనూ జరగని న్యాయం
సబ్జెక్టు టీచర్లులేక కుంటుపడిన బోధన
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.
సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్‌జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు.
పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం
ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్‌జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్‌లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్‌జీటీని డిప్యుటేషన్‌పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.
మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్‌పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్‌పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్‌ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది.
Comments
Please login to add a commentAdd a comment