
ఇక కట్టుదిట్టంగా ‘భూసేకరణ’
యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఏ భూములనైనా బలవంతంగా సేకరించేందుకు వీలు కాదు.
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఏ భూములనైనా బలవంతంగా సేకరించేందుకు వీలు కాదు. భూసేకరణ కోసం భూములను వదులుకున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడం జరుగుతుంది. శతాబ్దానికి పైబడ్డ చట్టం స్థానంలో ప్రభుత్వం ఈ మేరకు భూసేకరణ, పునరావాసం, పరిహారం-2012 బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులోని నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారాన్ని చెల్లిస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 216, వ్యతిరేకంగా 19 ఓట్లు పడ్డాయి.
ఏఐఏడీఎంకే, బీజేడీ సభ్యులు వాకౌట్ చేయగా, తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బీఎస్పీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లుకు 381 సవరణలను ప్రతిపాదించగా, వాటిలో 166 అధికారిక సవరణలు. విపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణల్లో కొన్నింటిని ఉపసంహరించుకోగా, ఓటింగులో కొన్ని వీగిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ నేత, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు అనారోగ్య కారణంగా ఓటింగులో పాల్గొనలేదు.
బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్న సమయంలోనే వారు సభ నుంచి వెళ్లిపోయారు. భూములను సేకరించే బదులు, వాటిని లీజుకిచ్చినట్లయితే రైతులకు వాటిపై వార్షికాదాయం లభిస్తుందని సుష్మా సూచించారు. భూసేకరణ ఫలితంగా వ్యక్తులకు లభించే సొమ్ముపై ఆదాయపు పన్ను లేదా స్టాంపు సుంకం ఉండదు. సేకరించిన భూమిని అధిక ధరకు ఇతరులకు విక్రయించినట్లయితే, వచ్చిన లాభంలో 40 శాతాన్ని సంబంధిత భూమి యజమానికి చెల్లించాల్సి ఉంటుంది.
భూసేకరణ బిల్లు ముఖ్యాంశాలు...
మార్కెట్ విలువకు గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు పరిహారం చెల్లించాలి
గత భూసేకరణలకు నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే ఈ బిల్లు ప్రకారమే వాటికి పరిహారం చెల్లింపు వర్తిస్తుంది
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేనిదే భూ సేకరణ జరపరాదు.
పూర్తి పరిహారం చెల్లించి, పునరావాసానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సిద్ధం చేసేదాకా భూమిని స్వాధీనం చేసుకోరాదు
{పభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టులకు భూమిసేకరించాలంటే 70శాతం, ప్రైవేటు కంపెనీలకైతే 80% మంది భూయజమానుల అంగీకారం తప్పనిసరి.
సాగు భూముల సేకరణపై రాష్ట్రాలు పరిమితులు పెట్టాలి
సేకరించిన భూమిని ఉపయోగించకపోతే.. ఆ భూమిని తిరిగి యజమానులకు/రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి.
ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అందే మొత్తంపై ఎలాంటి ఆదాయపు పన్ను, స్టాంపు డ్యూటీ విధించరాదు